Breaking News

Amblyopia: లేజీ 'ఐ' ఓ కన్నేయండి..!

Published on Tue, 07/15/2025 - 10:42

కొన్ని సందర్భాల్లో రెండు కళ్లలో... ఏదో ఓ కన్ను పనిచేయడానికి కాస్త బద్ధకిస్తుంటుంది. ఈ సమస్య అందరిలోనూ వచ్చే అవకాశమున్నా ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇలాంటి కేసులు ఎక్కువ. అయితే...  తమకు ఉన్న రెండు కళ్లలో ఒకటి... తన పక్కదానంత బాగా పనిచేయడం లేదన్న విషయం వారికి తెలిసే అవకాశం సాధారణంగా ఉండదు. ఇలాంటి సందర్భాల్లో స్పష్టంగా కనిపించే కంటి నుంచే ప్రతిబింబాలను గ్రహించి, అస్పష్టంగా కనిపించే ప్రతిబింబాలను మెదడు నిరాకరిస్తుంది.  అంటే ఈ రెండు కళ్లలో ఒకటి ప్రతిబింబాన్ని ప్రసారం చేయడంలో కాస్త బద్ధకంగా పనిచేస్తుందన్నమాట. ఇలా బద్ధకంగా పనిచేసే కన్ను పనితీరు క్రమంగా  తగ్గి΄ోతూ... ఒక దశలో పూర్తిగా పనిచేయకుండా ΄ోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యనే వాడుక భాషలో ‘లేజీ ఐ’ అనీ, వైద్యపరిభాషలో ‘ఆంబ్లోపియా’ అని అంటారు. సాధారణంగా ఆంబ్లోపియా సమస్య ఉన్నప్పుడు... కొద్దిగానైనా చూపు ఉన్నంత కాలం... తమ కళ్లలో ఒకదానికి సమస్య ఉందన్న విషయమే బాధితులకు తెలిసే అవకాశం పెద్దగా ఉండదు. ఈలోపే జరగాల్సిన అనర్థాలు జరిగే అవకాశముంది. అందుకే ‘లేజీ ఐ’ (యాంబ్లోపియా)పై అవగాహన అవసరం. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. 

ఓ కేస్‌ స్టడీ
శిరీష (పేరు మార్చాం) అనే ఓ ఎనిమిదేళ్ల చిన్నారి రెండు కళ్లలో ఒక కన్నులోంచే దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రెండో కన్ను మంచి ప్రతిబింబాన్ని పంపడంలో కాస్త బద్ధకిస్తోంది. ఇలా కంటిన్యువస్‌గా జరిగే సమయంలో ఎదుటి దృశ్యాన్ని స్పష్టంగా పంపే కంటి తాలూకు ప్రతిబింబాన్నే మెదడు తీసుకుంటోంది. 

సరిగ్గా కనిపించని కంటి నుంచి వచ్చే ఆ సమాచారాన్ని తీసుకోవడాన్ని నిరాకరిస్తూ పోవడంతో కొంతకాలానికి ఆ కంటికి క్రమంగా అంధత్వం వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఈలోపు ఏదో ఇతర పరీక్ష కోసం వెళ్లిన సమయంలో డాక్టర్లకు ఒక కన్ను బద్ధకిస్తోన్న విషయం తెలిసివచ్చింది. దాంతో డాక్టర్లు అతి కష్టమ్మీద ఆ రెండో కంటి చూపునూ కాపాడగలిగారు. 

అసలు ‘లేజీ ఐ’ పై అవగాహన రావాలంటే ముందుగా... చూడడమనే ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియడం చాలా ప్రధానం. మనం ఏదైనా దృశ్యాన్ని లేదా వస్తువును చూడాలంటే... తొలుత ఆ వస్తువుపై కాంతి పడి, మళ్లీ అదే కాంతి మన కంటిని చేరాలి. 

అప్పుడది తొలుత నల్లగుడ్డు అయిన కార్నియా నుంచి, తర్వాత  పారదర్శకమైన మన లెన్స్‌ నుంచీ ప్రసరించి... రెటీనా అనే తెరపై ఆ వస్తువు తాలూకు ప్రతిబింబాన్ని తలకిందులుగా పడేలా చేస్తుంది. ‘ఆప్టిక్‌ నర్వ్‌’ అనే కీలకమైన నాడి ద్వారా రెటీనాపైనున్న ప్రతిబింబం సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. దాంతో ఆ వస్తువు  కనిపించడం వల్ల మనకు దృష్టిజ్ఞానం కలుగుతుంది. 

ఏమిటీ ‘లేజీ ఐ’?
మనకు కలిగే దృష్టి జ్ఞానాన్ని ‘బైనాక్యులర్‌ విజన్‌’ అంటారు. అంటే... మన రెండు కళ్లలోని దృశ్యాలూ తమ తమ రెటీనాలపై కలిసి (ఇంటిగ్రేట్‌ అయి) ఆ రెండూ ఒకే దృశ్యంగా / వస్తువుగా కనిపిస్తాయి. అంటే ‘బై’ అంటే రెండు... ‘ఆక్యులార్‌’ అంటే ‘కళ్లు’... ఈ రెండు కళ్లూ కలిసి ఒకే దృశ్యాన్ని చూపడమే ‘బైనాక్యులార్‌ విజన్‌’! 

ఏదైనా కారణాలతో ఒకవేళ ఒకరి రెండు కళ్లలో... ఒకదానికి ఏదైనా కొంత లోపం ఉంటే... అలాంటప్పుడు ఒక కంటిలోని ప్రతిబింబం చాలా స్పష్టంగానూ, లోపమున్న కంటిలోని ప్రతిబింబం కొంత అస్పష్టంగా... ఇలా తన రెండు రెటీనాలపై ప్రతిబింబాలను చూపుతుంది. అయితే రెండు కళ్లతో చూసేప్పుడు బైనాక్యులర్‌ విజన్‌ కారణంగా ఆ లోపం తెలియక΄ోవచ్చు. ఒక్కో కంటితో విడివిడిగా, పరీక్షగా చూసినప్పుడు మాత్రమే అది తెలిసిరావచ్చు.

ఇలాంటి సందర్భాల్లో స్పష్టమైన ప్రతిబింబాన్నే మెదడు స్వీకరిస్తుంది. అస్పష్టమైన దాన్ని క్రమంగా నిరాకరిస్తూపోతుంది. ఇలా అస్పష్టమైన ప్రతిబింబాన్ని నిరాకరించడాన్ని ‘సప్రెషన్‌’ అంటారు. ఒక కంట్లో ప్రతిబింబం అస్పష్టంగా ఏర్పడుతున్నప్పుడూ, ఆ సమాచారాన్ని మెదడు క్రమంగా నిరాకరిస్తూపోతూ ఉండే మెడికల్‌ కండిషన్‌ను ‘లేజీ ఐ’ అనీ, వైద్యపరిభాషలో ‘ఆంబ్లోపియా’ అని అంటారు. 

లేజీ ఐ / ఆంబ్లోపియా సమస్య ఉన్నవారిలో తొలుత ఎలాంటి లోపమూ కనిపించదు. చిన్నపిల్లల్లోనైతే వాళ్ల కన్ను అభివృద్ధి / వికాసం కూడా మామూలుగానే జరుగుతాయి. వైద్యపరీక్షల్లోనూ కంటి గురించి ఎలాంటి లోపమూ తెలియదు. కాని కొన్నిసార్లు  ఏదో ఒక కంట్లోగానీ లేదా ఒక్కోసారి రెండు కళ్లల్లోనూ చూపు మందగిస్తుంది.  ‘లేజీ ఐ’ కండిషన్‌ వయసుతో పాటు పెరుగుతూ పోతుంది. పైకి అంతా బాగానే  ఉండటంతో ఈ కండిషన్‌ను తొలిదశల్లో గుర్తుపట్టడమూ కష్టమే.

ఆంబ్లోపియా విస్తృతి :  మన దేశంలోని చిన్నారుల్లో దీని విస్తృతి దాదాపు రెండు శాతం. అంటే ప్రతి వంద మంది పిల్లల్లో ఇద్దరిలో ఈ లోపం కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీని విస్తృతి ఇంకా ఎక్కువ. అంటే దాదాపు 4 శాతం. 

ఆంబ్లోపియా రకాలు 
అన్‌ ఐసోమెట్రోపిక్‌ ఆంబ్లోపియా : ఒక కంట్లో ఉన్న దృష్టిలో΄ానికీ (రిఫ్రాక్టివ్‌ ఎర్రర్‌కూ), మరో కంటికీ తేడా ఉండటం.  ఈ సమస్య ఉన్న వాళ్లలో చాలా  ఎక్కువమందిలో ఈ సమస్యే ఉంటుంది. 
ఐసోమెట్రిక్‌ ఆంబ్లోపియా : రెండు కళ్లలోనూ ఎక్కువ దృష్టిలోపం (రిఫ్రాక్టివ్‌ ఎర్రర్‌) ఉండటం. (ఉదా + 6.0 ; +6.0) 
మెరిడోనల్‌ ఆంబ్లోపియా: కళ్లలో సిలెండ్రికల్‌ పవర్‌ ‘2.0’ కంటే ఎక్కువ ఉండటం. 
స్టెడిస్మస్‌ ఆంబ్లోపియా : మెల్లకన్ను కారణంగా వచ్చే ఆంబ్లోపియా ఇది. 
డిప్రొవేషనల్‌ ఆంబ్లోపియా : పుట్టుకతోనే కంట్లో శుక్లం ఉండటం, కార్నియా సమస్య, రెటీనా సమస్య, కనురెప్ప వాలిపోవడం వంటి సమస్యలున్నప్పుడు, కాంతి కిరణాలు రెటీనాకు సరిగా చేరకపోవడం ఈ తరహా ఆంబ్లోపియా వస్తుంది.

ఎంత త్వరగా చికిత్స జరిగితే... అంత మేలైన ఫలితాలు
ఆంబ్లోపియాను ఎంత త్వరగా గుర్తించి,  ఎంత చిన్న వయసులో చికిత్స చేయిస్తే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. అయితే ఆ పసివయసులో తమ చూపులో లోపం ఉందన్న విషయాన్ని పిల్లలు గ్రహించలేకపోవడం, అలాగే చిన్నారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులూ లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా దీన్ని ఒకపట్టాన గుర్తించలేరు. 

అయితే చిన్నతనంలోనే అంటే...  రెండు నుంచి ఎనిమిది ఏళ్లలోపు గుర్తించి, చికిత్స చేయిస్తే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అంతమాత్రాన నిరాశపడాల్సిన అవసరం లేదు. పన్నెండేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల వరకు చికిత్స చేయించడానికి అవకాశం ఉంది. కాకపోతే ఫలితాలు చిన్నప్పటితో పోలిస్తే కాస్త నిదానంగా కనిపిస్తాయి. పెద్దవాళ్లలో కూడా ‘విజన్‌ థెరపీ’ ద్వారా కొంతవరకు ఫలితాలను రాబట్టవచ్చు.  

ఏ కారణంతో ఆంబ్లోపియా వచ్చిందో దానికి చికిత్స చేయడం : అంటే ఉదాహరణకు దృష్టిలోపాల వల్ల సమస్య వచ్చినట్లయితే దానికి సరిపడిన అద్దాలను ఇవ్వడం. ఉదాహరణకు ప్లస్‌ పవర్, మైనస్‌ పవర్, సిలెండ్రికల్‌ పవర్‌. 

మెల్లకన్ను కారణంగా ఆంబ్లోపియా వస్తే మెల్లకన్ను కరెక్షన్‌ చికిత్సతో దాన్ని  సరిచేయడం. 

డిప్రెవేషన్‌ ఆంబ్లోపియా జబ్బులకు... అంటే శుక్లం, కార్నియా, రెటీనా, వాలిపోయే కనురెప్పలు వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని సరిచేయడం ద్వారా లోపాల్ని తొలగించవచ్చు. ఉదాహరణకు... 

పుట్టుకతోనే శుక్లం (కాటకార్ట్‌) కారణంగా ఆంబ్లోపియా వస్తే... శస్త్రచికిత్స ద్వారా తొలుత పారదర్శకత కోల్పోయిన శుక్లాన్ని తొలగించాలి. ఆ స్థానంలో ఇంట్రా ఆక్యులార్‌ లెన్స్‌ను అమర్చాలి. శుక్లం కేవలం ఒకే కంట్లోనే ఉంటే– బిడ్డ పుట్టిన వెంటనే ఈ ఆపరేషన్‌ చేయవచ్చు. ఒకవేళ శుక్లాలు రెండు కళ్లలోనూ ఉంటే ఆపరేషన్‌కు కొన్ని మాసాల వ్యవధి తీసుకోవచ్చు. కాని శస్త్రచికిత్స మాత్రం తప్పనిసరిగా చేయించాలి. 

ఆపరేషన్‌ ఎంత త్వరగా చేస్తే చూపు వచ్చే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఆపరేషన్‌ తర్వాత కూడా పిల్లలకు డాక్టర్లు సూచించిన ప్రకారం...  క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయిస్తూ ఉండాలి. ఇలా ఆ చిన్నారికి 14 ఏళ్ల వయస్సు వచ్చే వరకూ పరీక్షలు చేయించడం తప్పనిసరి. 

పిల్లల్లో మెల్లకన్ను ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా కంటి డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లాలి. మూడేళ్లలోపు పిల్లలకు ఇది వచ్చే అవకాశం ఎక్కువ. కొందరిలో పుట్టగానే మెల్లకన్ను ఉండవచ్చు. కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డకు మెల్లకన్ను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తారు. 

పిల్లలు ఎదిగిన తర్వాత పరీక్షలు చేయించవచ్చని మరికొంతమంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతుంటారు. ఈ రెండూ సరికాదు. పిల్లల్లో మెల్లకన్నును గమనించగానే వెంటనే పిల్లలను డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లాలి. 

మెల్లకంటి సమస్యకూ ఎంతత్వరగా చికిత్స చేయిస్తే... అంత మంచిది. 

కంటి రెప్ప వాలిపోవడం వల్ల ఆంబ్లోపియా వస్తే... ఆ రెప్ప పైకెత్తి నిలిపి ఉంచేలా ఓ శస్త్రచికిత్స అవసరమవుతుంది. దీన్నే ‘టోసిస్‌ కరెక్షన్‌’ సర్జరీ అంటారు. ఈ ఆపరేషన్‌ తర్వాత కూడా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయిస్తూ ఉండటం అవసరం. కొందరిలో కంటికి అద్దాలు అవసరమవుతాయి. ఇలాంటివారు అద్దాలు వాడుతూనే ఆంబ్లోపియాకూ చికిత్స చేయించాలి.

అంబ్లోపియాకు కారణాలు(ఆంబ్లోజెనెసిస్‌)
విజువల్‌ డిప్రవేషన్‌ : చూపు విషయంలో ఒక కంటిలో ఉన్నంత స్పష్టత మరోదానిలో లేకపోవడం. 
లైట్‌ డిప్రవేషన్‌ : కంటిలోని కొన్ని దోషాల కారణంగా (కాటరాక్ట్‌ వంటి వాటివల్ల)  రెటీనాకు తగినంత కాంతి చేరకపోవడం. 
అబ్‌–నార్మల్‌ బైనాక్యులార్‌ విజన్‌ : అంటే రెండు కళ్లూ సమంగా ఒకే వస్తువుపై కేంద్రీకరించలేకపోవడం... 
ఈ అంశాలు ఉన్నవారిలో ఆంబ్లోపియా క్రమంగా వృద్ధిచెందుతుంది.

అక్లూజన్‌ థెరపీ
ఈ చికిత్స ప్రక్రియలో నార్మల్‌గా ఉన్న కంటిని పూర్తిగా మూసివేసి, చూపు మందగించిన కంటి తాలూకు దృష్టి మెరుగుపడేలా స్టిమ్యులేట్‌ చేస్తారు. నార్మల్‌గా ఉన్న కంటిని ఎన్నాళ్లు మూసి ఉంచి... ఈ స్టిమ్యూలేషన్‌ చికిత్స చేయాల్సి ఉంటుందన్నది డాక్టర్‌ నిర్ధారణ చేస్తారు. ఈ చికిత్స వల్ల 8 నుంచి 10 ఏళ్ల వరకు ఉన్న పిల్లల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి.

పీనలైజేషన్‌
అట్రోపిన్‌ చుక్కల మందులు లేదా బలమైన లెన్స్‌లను బాగా కనిపించే కంటికి వాడతారు. అప్పుడు బలహీనంగా ఉన్న కన్ను స్టిమ్యులేట్‌ అవుతుంది. దాంతో అది చూడటానికి ప్రయత్నించడాన్ని మొదలు పెడుతుంది. కన్నును మూసివేసి ఉంచి చేసే చికిత్స అయిన ‘అక్లూజన్‌ థెరపీ’లోలా  కాకుండా, కన్ను తెరచే ఉంచి చేసే చికిత్స ఇది.

విజన్‌ థెరపీ
పైన పేర్కొన్న అక్లూజన్‌ పద్ధతిలో చికిత్స చేస్తూ... కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా బలహీనమైన కంటిని చురుగ్గా మారేలా చేస్తారు. దీని వల్ల మెదడు కూడా తిరిగి ప్రతిబింబాన్ని గ్రహించేలా, పక్క కన్ను ప్రతిబింబంతో పోల్చుకుని...  మళ్లీ చూపు, బైనాక్యులర్‌ విజన్‌ పొందేలా ప్రయత్నం జరుగుతుంది.  ఈ ప్రక్రియకు దాదాపుగా 100 నుంచి 200 గంటల పాటు చికిత్స అవసరమవుతుంది. 

లక్షణాలు / నిర్ధారణ
నిజానికి చాలా మంది తమకు లోపం ఉన్నట్లు గుర్తించలేరు / చెప్పలేరు. ∙ఒక కంటిలో చూపు తగ్గడం

క్రౌడింగ్‌ ఫినామినా: అంటే... అనేక అక్షరాలు ఉన్నప్పుడు ఏదో ఒక అక్షరాన్ని మాత్రమే చూడగలగటం. ఒక్క అక్షరాన్ని మాత్రమే చదవడగలగడం. 

న్యూట్రల్‌ డెన్సిటీ ఫిల్టర్‌ : దీనితో పరీక్షించినప్పుడు మామూలు కంటి చూపు ఉన్నవారికి

స్పష్టంగా కనిపించదు. కానీ ‘ఆంబ్లోపియా’ ఉన్నవారు దీనిలోంచి చూసినప్పుడు... వారికి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. 

కొంతమందిలో మెల్లకన్ను ఉండటం, అలాగే రంగులు చూసే సామర్థ్యం తక్కువగా ఉండటం. 

కంటి డాక్టర్లు  పైన పేర్కొన్న లక్షణాలను బట్టి ‘ఆంబ్లోపియా’ను నిర్ధారణ చేస్తారు. 

నివారణ
మూడు నుంచి ఐదేళ్ల వయసులోని పిల్లలకు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించాలి. లోపాలుండి శస్త్రచికిత్స అవసరమైన వారికి వీలైనంత త్వరగా చేయించాలి. ఆక్లూజన్‌ థెరపీ ద్వారా చూపు తిరిగి వచ్చాక కూడా ‘మెయింటెనెన్స్‌ థెరపీ’ అంటూ రోజూ రెండు గంటల పాటు అక్లూజన్‌ ప్రక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ∙తరచూ కంటి డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉండాలి.

ఫ్యూజనల్, స్టీరియాప్టిక్‌ ఎక్సర్‌సైజెస్‌
లేజీ ఐ తన  చురుకుదనాన్ని పొందేలా చేసిన చికిత్స ప్రక్రియల తర్వాత ఆ రెండు కళ్లూ ఒకేలాంటి మంచి ప్రతిబింబాన్నే మెదడుకు ఇచ్చేలా చేసేందుకు కొన్ని వ్యాయాయాలు చేయిస్తారు. ఇందులో ఫ్యూజనల్‌ ఎక్సర్‌సైజ్‌లో రెండు కళ్లూ తాము ప్రతిబింబించే దృశ్యాన్ని మెదడు ఒకేలా గ్రహించేలా చేస్తారు. ఇక స్టీరియాప్టిక్‌ ఎక్సర్‌సైజ్‌లో ఈ రెండు కళ్లూ డెప్త్‌ / 3 డీ ఇమేజ్‌ సాధించేలా చేయడానికి చేయిస్తారు. ఈ రెండు ఎక్సర్‌సైజ్‌లు చేయిస్తేనే భవిష్యత్తులో లేజీ ఐ లో చూపు తగ్గకుండా ఉంటుంది. లేదంటే మళ్లీ వెనక్కువెళ్లే అవకాశాలు ఉంటాయి.

ఫార్మకోథెరపీ
లీవోడోపావంటి మందుల ద్వారా కంటి నరాలు బాగా పనిచేసేలా చేస్తారు. భవిష్యత్తు చికిత్స ప్రక్రియల్లో జీన్‌ థెరపీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా సరికొత్త చికిత్స ప్రక్రియలు అందివచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల అడల్ట్‌ ఆంబ్లోపియాకు కూడా మరిన్ని అధునాతన చికిత్సలను అందుబాటు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  
డాక్టర్‌ కె. రవికుమార్‌ రెడ్డి, సీనియర్‌ కంటి వైద్య నిపుణులు  

(చదవండి: 'మార్నింగ్‌ వాకింగ్‌' ఎందుకంటే..! థైరోకేర్‌ వేలుమణి ఆసక్తికర వివరణ)

Videos

ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

సీఎంను చంపేసిన Facebook

కూటమి ప్రభుత్వంలో వైద్యానికి నిర్లక్ష్య రోగం!

హత్య కేసును తమిళనాడులోనే విచారించాలి.. ఏపీలో న్యాయం జరగదు

జగన్ 2.0.. ఎలా ఉండబోతుందంటే రోజా మాటల్లో...

మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా.. ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్

వణికిన మహానగరం

Big Question: నా పిల్లల్ని కూడా.. డిబేట్ లో రోజా కంటతడి

నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

Weather: ఏపీకి భారీ వర్ష సూచన

Photos

+5

విజయవాడ : సారె తెచ్చి..మనసారా కొలిచి..కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

జడివానకు హైదరాబాద్‌ అతలాకుతలం.. ట్రాఫిక్‌ జామ్‌తో చుక్కలు చూసిన వాహనదారులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..చెరువుల్లా మారిన రోడ్లు (ఫొటోలు)

+5

‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్‌ ఫేం పోస్ట్‌ (ఫొటోలు)

+5

‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?

+5

చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్‌గా తెలుగు బ్యూటీ!

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)

+5

కుమారుడితో తొలిసారి తిరుమలలో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

రెడ్‌ శారీలో ‘జూనియర్‌’మూవీ ఈవెంట్‌లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)