అసలు నిజాలు చెప్పిన జనసేన ఇన్ ఛార్జ్ వినుత డ్రైవర్ చెల్లి
Breaking News
డోపమైన్ లోపం వణికిస్తుందా..?
Published on Tue, 07/08/2025 - 10:29
పార్కిన్‌సన్స్ వ్యాధి కాస్త వయసు పెరిగిన వాళ్లలో అంటే 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే వ్యాధి.
ఇందులో బాధితుల వేళ్లు, చేతులు వణుకుతుంటాయి. ఈ వ్యాధిని డాక్టర్ జేమ్స్ పార్కిన్‌సన్ అనే వైద్యనిపుణుడు 1817లో గుర్తించి, మొదట్లో దానికి ‘షేకింగ్ పాల్సీ’ అని పేరు పెట్టినప్పటికీ... వ్యాధినిమొదట గుర్తించిన ఫిజీషియన్ పేరిట ఇది ప్రాచుర్యం పొందింది. కొందరిలో మెదడులోని డోపమైన్ అనే రసాయనం ఉత్పిత్తి తగ్గడం వల్ల, శరీర కదలికలను అదుపులో ఉంచే నాడీకణాలు తగ్గిపోతాయి. దాంతో దేహం వణకడం మొదలై పార్కిన్‌సన్స్ వ్యాధి మొదలువుతుంది. ఈ వ్యాధి గురించి తెలుసుకుందాం...
పార్కిన్‌సన్ వ్యాధి ఉన్నవాళ్లలోతొలుత నడకతో మొదలై... తర్వాత అన్ని రకాల కదలికలూ ప్రభావితమవుతాయి. ఇలా ఒక వ్యక్తి కదలికలు తగ్గిపోయే గుణాన్ని ‘హైపోకైనేసియా’ అంటారు. తర్వాత చెయ్యి వణకడం మొదలవుతుంది. ఈ వణకడమనేది ఏ పనీ చేయని దశలో... అంటే ఓ వ్యక్తి ఏ పనీ చేయకుండా పూర్తిగా రెస్ట్‌లో ఉన్నప్పుడు కూడా వస్తుంది ఉంటుంది. కాబట్టి ఈ వణుకుడును ‘రెస్ట్ ట్రిమర్స్’గా చెబుతారు. ఇలాంటి వ్యక్తులు పక్కకు తిరగబోయే ప్రయత్నంలో అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి పడిపోతూ ఉంటారు. ఇలా బ్యాలెన్స్ కోల్పోవడాన్ని పోష్చురల్ ఇన్‌స్టెబిలిటీ’ అంటారు. ఇవన్నీ ఈ జబ్బుకు ఉన్న ముఖ్యమైన లక్షణాలు. ఇవేగాక ఇంకా చాలా అనుబంధ లక్షణాలూ కనిపిస్తుంటాయి.
కారణాలు...
నిర్దిష్టంగా కారణం ఇదీ అని చెప్పలేనప్పటికీ కొన్ని పరిశీలనల ద్వారా పార్కిన్‌సన్ జబ్బు రావడానికి అనేక కారణాలు ఉన్నాయన్నది వైద్య శాస్త్రవేత్తల మాట. అందులో ముఖ్యమైనది జన్యులోపం. ఈ జన్యులోపం ఉన్నవారిలో ఒక వయసు దాటాక ఈ జబ్బు తప్పనిసరిగా బయటపడుతుంది. అలాగే కొందరిలో తీవ్రమైన ఒత్తిడి కారణంగా డోపమైన్ సరిగా వెలువడక జబ్బు వస్తుంది. మరి కొందరిలో వారు తీసుకునే పానియాల్లో లేదా పీల్చే గాలిలో కొన్ని రకాల విషపదార్థాలు (టాక్సిక్ మెటీరియల్స్) ఉన్న కారణంతో... ఆ విషాలు డోపమైన్ విడుదల చేసే కణాలను దెబ్బతీనందువల్ల డోపమైన్ సరిగా విడుదల కాకపోవడంతో ఈ జబ్బు వస్తుంది.
అంతేకాకుండా మరికొందరిలో తలకు పదే పదే దెబ్బలు తగలడం వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. ఇంకొందరిలో మెదడుకు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ఈ జబ్బు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇవన్నీ ఈ జబ్బుకు కారణమయ్యే అంశాలు. అయితే ఈ జబ్బుకు గురైన దాదాపు 50 శాతం మందిలో మాత్రం ఏ కారణం లేకుండా కూడా రావచ్చు. ఇంకా విచిత్రం ఏమిటంటే... ఈ జబ్బు ఎలాంటి చెడు అలవాట్లు (అంటే స్మోకింగ్, ఆల్కహాల్) లేకపోవడం లేదా కనీసం కాఫీ, టీలు తాగని వారిలోనూ కనిపించడమన్నది చాలామంది వైద్యశాస్త్రవేత్తలూ, అధ్యయనవేత్తల దృష్టికి వచ్చిన ఆశ్చర్యకరమైన అంశం.
ఏ వయసు వారిలో...
పార్కిన్‌సన్స్ వ్యాధికి గురైన వారిలో 98 శాతం మంది 50 ఏళ్లు పైబడిన వారే. కేవలం రెండు శాతం లోపు వారిలోనే ఇది 50 ఏళ్లలోపు వారిలో కనిపించింది. పార్కిన్‌సన్స్ వ్యాధి మహిళల్లో కంటే పురుషుల్లో దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. కొందరిలో మరీ యుక్తవయసులో అంటే 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తుడటంతో దీన్ని వంశపారంపర్యంగా కనిపించే పార్కిన్‌సనిజమ్ (హెరిడిటరీ పార్కిన్‌సనిజమ్) అంటున్నారు.
ఎందుకు వస్తుందీ జబ్బు?
మన మెదడు నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుందన్నది తెలిసిందే. అందులోని ఒక చిన్న భాగం పేరు ‘సబ్‌స్ట్రాన్షియా నైగ్రా’. దీని నుంచి డోపమైన్ అనే రసాయనం (బయోకెమికల్) వెలువడుతుంది. ఇది మన దేహం కదలికలను నియంత్రిస్తుంది. సాధారణంగా 50 ఏళ్లు పైబడ్డ వ్యక్తులు కొందరిలో ఈ రసాయనం సరిగా వెలువడదు. ఆ రసాయనం లోపించడం వల్లనే కదలికల్లో లోపాలు కనిపించడం మొదలవుతుంది.
వ్యాధి నిర్ధారణ ఇలా...
మెదడు ఎమ్మారై పరీక్ష, అయోఫ్లుపేన్ సింగిల్ ఫొటాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (స్పెక్ట్) పరీక్ష. దీన్నే డాట్ స్కాన్ అని కూడా అంటారు ∙ఎఫ్–డోపల్–6 ఫ్లూరో –3, 4 డై హైడ్రాక్సీ ఫినైల్ అలనైన్ (18 ఎఫ్– డో΄ా) పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (పెట్) స్కాన్ పరీక్ష.
కొన్ని నివారణ పద్ధతులు
వ్యాయామం పార్కిన్‌సన్ వ్యాధిని కొంతమేరకు నివారిస్తుంది. ఫిజియోథెరపీ, రీ–హ్యాబిలిటేషన్, మింగలేని సమయాల్లో వచ్చే పాషకాహార లోపాలను అధిగమించడానికి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడంతో పాటు పార్కిన్‌సన్ వ్యాధి వల్ల కుంగుబాటు (డిప్రెషన్) వంటి కొన్ని రకాల మానసిక సమస్యలు రావడంతో పాటు అవే సమస్యలు పార్కిన్‌సన్ వ్యాధికి దారితీసే ప్రమాదం ఉన్నందున సైకియాట్రిక్ ఇవాల్యుయేషన్ కూడా అవసరం కావచ్చు.
జబ్బు గురించి కొన్ని కొత్త విషయాలు : ఈ జబ్బుతో బాధపడేవారి జీవన పరిస్థితులను (క్వాలిటీ ఆఫ్ లైఫ్) మెరుగుపరిచేందుకు ఎన్నో మందులు అందుబాటులో ఉన్నాయి. మెదడులో డోపమైన్ అనే రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గడం వల్ల ఈ జబ్బు వస్తుంది కాబట్టి జబ్బు ఉన్నవారిలో ఇదే పదార్థాన్ని బయట నుంచి టాబ్లెట్ల రూపంలో ఇవ్వడం ఒక చికిత్స ప్రక్రియ.
కొన్ని ప్రధాన చికిత్స ప్రక్రియలు :
మెదడులో తగ్గిన డోపమైన్ ఉత్పత్తిని పెంచే మందులతో లక్షణాల్ని అదుపులోకి తేవచ్చు. అయితే పెరిగే వయసుతోపాటు డోపమైన్ ఉత్పాదన / మెదడులో దాని మోతాదు తగ్గుతూ వస్తుండటంతో మందుల మోతాదును పెంచుతూపోవాల్సి ఉంటుంది.
లెవోడోపా / కార్బిడోపా అనే మందులు దేహంలోకి వెళ్లగానే డోపమైన్‌గా మారతాయి. మావో–బి ఇన్హిబిటార్స్ మందులు మరింత డోపమైన్ లభ్యమయ్యేలా చేస్తాయి.
యాంటీ కొలెనెర్జిక్ మందులు లక్షణాల తీవ్రతను తగ్గించి, ఉపశమనాన్నిస్తాయి.
ఎమ్మారై ఇమేజింగ్ సమయంలో ఫోకస్‌డ్ అల్ట్రాసౌండ్ థెరపీతో థలామస్‌లో కొన్ని లీజన్స్ కల్పించడమూ ఓ చికిత్సగా చెప్పవచ్చు. ఇదొక నాన్–ఇన్వేజివ్ ప్రక్రియ. అంటే... కత్తి కోత గానీ లేదా గాటు గానీ పడకుండా చేసే చికిత్స.
పై చికిత్సలతో పాటు గత పది పదిహేనేళ్ల వ్యవధిలో దీనికి అనేక కొత్త చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి...
శస్త్రచికిత్స : మందుల మోతాదు పెరుగుతున్న కొద్దీ ఓ దశలో దుష్ప్రభావాలు మొదలవుతాయి. అందుకే మాత్రలు వేసుకున్నా ప్రయోజనం లేని సందర్భాల్లో ఇక చివరి యత్నంగా ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ’ అనే శస్త్రచికిత్స అవసరం పడవచ్చు.
డీబీఎస్ : డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే రూపానికి ఇంగ్లిష్ పొడి అక్షరాలే డీబీఎస్. ఇదో శస్త్రచికిత్స ప్రక్రియ. ఇందులో చాలా మోతాదులో తక్కువ కరెంట్‌ను పంపి డోపమైన్ కణాలను ఉత్తేజపరుస్తారు. జబ్బు బాగా ముదిరిపోయి, ఇక మందులు ఎలాంటి ప్రభావం చూపని దశలోనే ఈ శస్త్రచికిత్స చేస్తారు. ఈ కరెంట్ పంపే పరికరం గుండెకు అమర్చే పేస్‌మేకర్‌లా ఉంటుంది. మెదడు లోపల ‘సబ్‌స్ట్రాన్షియా నైగ్రా’ అనే ప్రాంతంలో దీని తాలూకు ఎలక్ట్రోడ్‌ను అమర్చుతారు. బయట దాన్ని అనుసంధానించడానికీ, మోతాదు నియంత్రించడానికీ ఒక బటన్‌ను అమర్చుతారు.
మందుల దుష్ప్రభావాలు మొదలైతే
ప్రత్యామ్నాయం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ...పార్కిన్‌సన్ వ్యాధిలో వాడుకునే మందులు మూడు నుంచి ఐదేళ్ల వరకు సమర్థంగా పనిచేసినా... ఆ తర్వాత రెండు రకాల దుష్ప్రభావాలు మొదలవుతాయి. కొందరిలో టాబ్లెట్ ప్రభావం కొనసాగినంతసేపు బాగానే ఉన్నా... దాని ప్రభావం తగ్గగానే లక్షణాలు బయటపడుతుంటాయి.
దీన్నే ‘ఆన్ ఆర్ ఆఫ్ ఫినామెనా’ అంటారు. మరికొందరిలో మాత్ర వేసుకున్నప్పుడు వ్యాధి తీవ్రత పెరిగినట్లుగా... దేహంలో కదలికలు మరింత పెరిగి΄ోతూ ఉంటాయి. ఈ రెండు రకాల దుష్ప్రభావాలూ సుదీర్ఘకాలం మందులు వాడినవారిలో కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మందుల్ని ఆపలేక... కొనసాగించలేక బాధితులు ఇబ్బంది పడతారు. ఇలాంటివారికి ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ’ అన్నది ఓ వరప్రదాయని అనుకోవచ్చు.
డీబీఎస్ సర్జరీకి ముందు పరీక్ష...
పార్కిన్‌సన్ వ్యాధి మందులతో అదుపు కావడంలేదని నిర్ధారణ చేసుకోవడం కోసం వైద్యులు ఓ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో బాధితులకు మొదట మందులు ఇవ్వకుండా వారి చేత కొన్ని పనులు చేయిస్తారు. వాటితో మందు ప్రభావమూ, దుష్ప్రభావాల తీవ్రత తెలుస్తాయి.
మందులతో ఇక ఏమాత్రమూ ప్రయోజనం కనిపించని బాధితులను మాత్రమే సర్జరీకి ఎంపికచేస్తారు. అంతేకాదు... వాళ్లకు ఎలాంటి మానసిక రుగ్మతలూ ఉండకూడదు. సర్జరీ తర్వాత కొందరిలో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్జరీకి ముందు ఎలాంటి మానసిక సమస్యలూ లేవని సైకియాట్రిస్ట్ తొలుత నిర్ధారణ చేయాలి.
డీబీఎస్ సర్జరీలో ఏంజరుగుతుందంటే...
డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కోసం మెడిట్రానిక్స్, బోల్టన్ సైంటిఫిక్, సెయింట్ జ్యూడ్ మొదలైన కంపెనీల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే ఈ శస్త్రచికిత్సలో భాగంగా... ఎలక్ట్రోడ్‌లను కలిగిన లీడ్‌లను మెదడులో అమర్చుతారు. వాటికి విద్యుత్తును అందించే పల్స్ జనరేటర్‌ను ఛాతీలో అమర్చుతారు. ఈ రెండూ వైర్‌తో అనుసంధానమై ఉంటాయి.
బ్యాటరీతో నడిచే ఈ పల్స్ జనరేటరు నిరంతరం పనిచేస్తూ, విద్యుత్ ప్రసారాన్ని వెలువరిస్తూ ఉండటం వల్ల మెదడుకు నిరంతరాయంగా కరెంట్ సరఫరా జరుగుతూ ఉంటుంది. దాంతో లక్షణాలు అదుపులోకి వస్తాయి. బ్యాటరీతో పనిచేసే ఈ పల్స్ జనరేటర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు.
వీటిలో రీచార్జ్, సింగిల్ యూజ్ అనే రెండు రకాల బ్యాటరీలు ఉంటాయి. సింగిల్ యూజ్ బ్యాటరీలు ఏకంగా మూడు నుంచి ఐదేళ్ల వరకు పనిచేస్తాయి. కాలం చెల్లిన తర్వాత చిన్న సర్జరీతో బ్యాటరీని మార్చుకోవాల్సి ఉంటుంది. అదే రీచార్జ్ బ్యాటరీ అయితే 15 నుంచి 20 ఏళ్ల వరకు పనిచేస్తాయి. వీటిని ఫోన్ ఛార్జ్ చేసుకున్నట్లుగా, ఓ వైర్‌లెస్ ఛార్జర్‌ను ఛాతీకి కట్టుకుని బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు.
డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అంటే..?
డోపమైన్‌ను బయటి నుంచి అందించకుండానే... ఆ న్యూరోట్రాన్స్‌మిటర్ శరీరంలో ఉందనే భావనను మెదడుకు కలిగించేలా చేసే సర్జరీ ఇది. ఇందుకోసం... మెదడులో శరీర కదలికలను నియంత్రించే ‘న్యూక్లియస్’లలోకి ఓ లీడ్‌ను అమర్చుతారు. దాన్ని బ్యాటరీకి అనుసంధానిస్తారు. శస్త్రచికిత్స ద్వారా ఆ బ్యాటరీని ఛాతీలో ఉంచుతారు. ఆ బ్యాటరీ నుంచి వెలువడే ‘ఎలక్ట్రిక్ ఇంపల్స్’ మెదడును ప్రేరేపిస్తాయి. దాంతో న్యూక్లియస్‌లన్నీ గాడిలో పడి, డోపమైన్ ఉన్నట్లుగా మెదడుకు భ్రమ కలిగిస్తాయి.
ఫలితంగా పార్కిన్‌సన్ వ్యాధి అదుపులోకి వస్తుంది. అంతేకాదు... మందుల తాలూకు దుష్ప్రభావాలలో కనిపించే ‘ఆన్ అండ్ ఆఫ్ ఫినామినా’ కండిషన్ తొలగిపోతుంది. బ్యాటరీ నుంచి విద్యుత్తు నిరంతరాయంగా మెదడుకు ప్రసరిస్తూ ఉండటం వల్ల లక్షణాలు పెరగడం / తగ్గడం లాంటివి కూడా ఉండవు. అలాగే సర్జరీ తర్వాత మందుల మోతాదు కూడా తగ్గిస్తారు. దాంతో అదనపు కదలికలూ తగ్గుతాయి.
డీబీఎస్ సర్జరీ ఫలితం ఇలా...
ఈ శస్త్రచికిత్సతో పార్కిన్‌సన్ వ్యాధిని మరింత పెరగకుండా అక్కడికి అదుపుచేయవచ్చు. అయితే గతంలో జరిగి΄ోయిన నష్టాన్ని మాత్రం భర్తీ చేయడం సాధ్యం కాదు. బాధితులు ఒకింత నాణ్యమైన జీవితం గడపడం కోసమే ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్’ చికిత్స ఉపయోగపడుతుంది తప్ప... ఇది పూర్తిగా వ్యాధిని నయం చేయలేదని గ్రహించాలి. సర్జరీ సమయానికి రోగి శారీరక స్థితి ఎలా ఉందో, అదే పరిస్థితి కొనసాగడం లేదా అంతకంటే దిగజారకుండా ఉండటానికి మాత్రమే డీబీఎస్ ఉపయోగపడుతుంది.
స్టెమ్‌సెల్ థెరపీ: పార్కిన్‌సన్ డిసీజ్‌కు శాశ్వత చికిత్స అందించే ప్రయత్నాల్లో ఈ చికిత్స ప్రక్రియను మొదటిదిగా పేర్కొనవచ్చు. మన శరీరంలోని వేర్వేరు అవయవాల్లో ఉండే కణాలు వేర్వేరుగా ఉంటాయి. ఉదా: మెదడు కణాలను న్యూరాన్లుగా, రక్తకణాల్లో ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్స్‌గా, కాలేయకణాలు హెపటోసైట్స్, కండరకణాలు మయోసైట్స్‌గా, ఎముకకణాలు ఆస్టియోసైట్స్‌గా ఉంటాయి. అయితే ఈ కణాలన్నీ ఉత్పత్తి అయ్యే మూల (ప్రిమిటివ్) కణాన్ని ఇంగ్లిష్‌లో ‘స్టెమ్‌సెల్’ అంటారు.
ప్రస్తుతం బొడ్డుతాడునుంచి సేకరించిన కణాలను కొన్ని ప్రక్రియలు, దశల తర్వాత స్టెమ్‌సెల్‌గా మార్చి అమర్చితే... అది అమర్చిన ప్రదేశాన్ని బట్టి... అది సదరు అవయవానికి సంబంధించిన కణంగా మారి΄ోతుంది. ఈ తరహా చికిత్సనే స్టెమ్‌సెల్ థెరపీ అంటారు. ఈ చికిత్సలో భాగంగా స్టెమ్‌సెల్స్‌ను మెదడులో సబ్‌స్ట్రాన్షియా నైగ్రా (ఎస్.ఎన్.) ఉన్న ప్రాంతంలో ప్రవేశపెడతారు. అక్కడ అవి కొత్త ఎస్.ఎన్. కణాలుగా తయారవుతాయి. దాంతో ఆ కొత్త కణాలనుంచి మళ్లీ శరీరానికి కావాల్సిన డోపమైన ఉత్పత్తి అవుతుంటుంది. కాబట్టి ఈ జబ్బు లక్షణాలన్నీ పూర్తిగా తగ్గి΄ోయేందుకు అవకాశముంది.
స్టెమ్‌సెల్స్ ఉత్పత్తి ఇలా : మన శరీరంలో ఏదో ఒక శాంపుల్ నుంచి కణాలను సేకరిస్తారు. (ప్రధానంగా రక్తం లేదా బొడ్డు తాడులో ఉన్న రక్తంలో స్టెమ్‌సెల్స్ ఎక్కువగా ఉంటాయి). ఈ శాంపుల్‌ను ఒక యంత్రంలో ఉంచి మరిన్ని కణాలు ఉత్పత్తి అయి వాటి సంఖ్య పెరిగేలా ఇంక్యుబేట్ చేస్తారు. ఇలా ఒక మూలకణం... కణవిభజన ప్రక్రియ ద్వారా మరెన్నో కణాలుగా విభజన అయి చాలా కణాలు తయారవుతాయి.
వాటినే మనం మూలకణాలుగా అవసరమైన చోట ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రక్రియ గురించి విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుత పురోగతిని బట్టి ఈ ప్రక్రియ ద్వారా రానున్న కొన్నేళ్లలో ఇవి కచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయని తప్పక చెప్పవచ్చు.
ఫీటల్ సెల్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ : ఈ ప్రక్రియలోనూ అనుసరించే విధానం ఇంచుమించు పైన పేర్కొన్నట్లుగానే ఉంటుంది. బిడ్డ పుట్టగానే ఆ చిన్నారి బొడ్డుతాడును, దాంతోపాటు కొద్దిగా రక్తాన్ని (ఫీటల్ బ్లడ్)ను సేకరించి, ప్రత్యేకమైన ల్యాబ్‌లో ప్రాసెస్ చేసి, మూలకణాలను తయారు చేస్తారు. వాటిని అవసరమైనప్పుడు కావాల్సిన చోట వాడుకుంటారు. అప్పుడు ఆ ప్రదేశంలో కొన్ని మూలకణాలను అమర్చగానే అది పూర్తి అవయవంగా రూపుదిద్దుకోవాలన్నదే ఈ ప్రక్రియ లక్ష్యం.
జీన్ థెరపీ : ఈ ప్రక్రియపై గత 15–20 ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. పార్కిన్‌సన్స్ డిసీజ్ అనే ఈ జబ్బు... పార్క్’ అనే ఒక జన్యువు లోపం కారణంగా వస్తుంది. కాబట్టి ఈ జన్యువులో వచ్చే లోపాలను నివారిస్తే అసలు జబ్బు రాకుండానే నివారించే అవకాశం ఉంది. ఇలా అరికట్టడం అనే ప్రక్రియ రాబోయే దశాబ్దకాలంలో అందరికీ అందుబాటులోకి రావచ్చని ప్రస్తుతం ఉన్న పురోగతిని బట్టి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ప్రాసావిన్ చికిత్స : ప్రాసావిన్ అనే పదార్థాన్ని మెదడుభాగంలోకి ఇంజెక్ట్ చేయడం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయని తేలింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ బయోమెడికా సంస్థలో ఈ చికిత్స ప్రక్రియపై పరిశోధనలు జరుగుతున్నాయి.
బ్రైట్‌లైట్ : ఒక ఫ్రీక్వెన్సీలో ఉండే కాంతి తరంగాలను ప్రసరింపజేయడం వల్ల మెదడులో ఉండే మెలటోనిన్‌ను తగ్గించి డోపమైన్ ఉత్పత్తిని ఎక్కువ చేయవచ్చనే అంశం ఆధారంగా జరిగే చికిత్స ఇది.
ట్రాన్స్ క్రేనియల్ ఆల్టర్నేట్ కరెంట్ స్టిమ్యులేషన్స్: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కరెంట్ ఇచ్చి, నైగ్రల్ సెల్స్‌ను ఉత్తేజపరచి, డోపమైన్ ఉత్పత్తి జరిగేలా తమ ప్రయోగాలను కొనసాగిస్తున్నారు. పైన పేర్కొన్న చికిత్స ప్రక్రియలతో పాటు న్యూరల్ గ్రోత్ ఫ్యాక్టర్, జీడీఎన్‌ఎఫ్ (గ్లయల్ డిరైవ్‌డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్) వంటి కొన్ని అంశాలను రక్తంలోకి ప్రవేశింపజేయడం వల్ల అవి మళ్లీ మెదడులోకి ప్రవేశించి అక్కడ నైగ్రల్ సెల్స్‌ను అభివృధ్ధి చేసేలా చూస్తే ప్రక్రియలపైన చాలా విస్తృతమైన అధ్యయనం జరుగుతోంది.
మునుపటితో పోలిస్తే ప్రస్తుతం పార్కిన్‌సన్స్ డిసీజ్‌ను తగ్గించేందుకు కొంతమేర మంచి చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయని, కొన్నాళ్లలో ఇంకా మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నమ్మకంగా చెప్పవచ్చు.
డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ అండ్ న్యూరో సర్జన్
(చదవండి: హీరో సల్మాన్‌ఖాన్ సైతం విలవిలలాడిన సమస్య..! ఏంటి ట్రెజెమినల్ న్యూరాల్జియా..)
Tags : 1