గత కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు
Breaking News
షాకింగ్.. హైదరాబాద్‌లో రోజుకి 8 వేల టన్నుల వ్యర్థాలు!
Published on Tue, 07/08/2025 - 10:04
హైదరాబాద్ ఒక అందమైన నగరం.. ఆధునిక జీవనశైలి, అంతర్జాతీయ కంపెనీలు, గ్లోబల్ సంస్థలు, సినిమాలు మొదలు క్రీడల వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించింది భాగ్యనగరం.. వెరసి టాప్ వరల్డ్ సీటీస్‌లో స్థానం సంపాదించుకుంది. ఐతే ఇదంతా నగరానికి ఒక వైపు మాత్రమే.. మరోవైపు నగరం ప్రస్తుతం ప్లాస్టిక్ భూతం గుప్పిట్లో చిక్కుకుపోతోంది. ఆధునిక జీవనశైలిపై వ్యామోహంతో పాటు సౌలభ్యం కోసం ప్లాస్టిక్‌పై అతిగా ఆధారపడే మోడ్రన్ కల్చర్ నగరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల సుడిగుండంలోకి తోసేస్తుంది. ఇది కేవలం నగర పరిశుభ్రత సమస్య మాత్రమే కాదు.. నగరవాసుల ఆరోగ్యం, జీవవైవిధ్యం, జల వనరుల భద్రత పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఇటీవలి పలు పరిశోధనల అత్యవసర హెచ్చరిక. ప్లాస్టిక్ నియంత్రించకపోతే మనం మన నగరంలోనే శ్వాస తీసుకోడానికి ప్రాణం ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి. ఇది కేవలం భవిష్యత్తు హెచ్చరిక కాదు.. ఇప్పటికే మొదలైన సంక్షోభం. – సాక్షి, సిటీబ్యూరో
నగరంలో ప్రతి రోజూ 8,000 టన్నుల వ్యర్థాలు
ప్రతిరోజూ హైదరాబాద్ నగరం సుమారు 8,000 టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోందని అంచనా. ఈ వ్యర్థాల్లో 14 శాతం పైగా ప్లాస్టిక్ ఉండటం శోచనీయం. అంటే రోజుకు సుమారు 1,120 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు. ఈ ఏడాది ముగింపునాటికి ఇది 9,000 టన్నులకు చేరనుందని అంచనా. ఇదే పరిస్థితి కొనసాగితే రెసిడెన్షియల్ ప్రాంతాల్లో మాత్రమే రోజుకు 495 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చే ప్రమాదం ఉందని ఐసీఎల్‌ఈఐ– దక్షణాసియా సూచించింది. ప్రతి ఇంట్లోనూ ప్లాస్టిక్ అంతర్భాగమవుతుండగా, దాని ప్రభావాలు బయటి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
జీవరాశులకు పెనుముప్పు..
హుసేన్ సాగర్, దుర్గం చెరువు వంటి నగర సరస్సులు ఇప్పుడు సింగిల్–యూజ్ ప్లాస్టిక్‌తో నిండిపోయాయి. ఇందులో సుమారు 70 శాతం వ్యర్థాలు ప్లాస్టిక్ ఉండటం విషాదకర పరిణామం. దీంతో సరస్సుల ఇన్‌లెట్లు, అవుట్‌లెట్లు పూర్తిగా ప్లాస్టిక్‌తో నిండిపోతున్నాయి. నీటి ప్రవాహం ఆగిపోవడం, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం, చేపల మరణం, గాలి, నీరు రసాయనాలతో కలుషితమవ్వడం వంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చేపలు, తాబేళ్లు, సరీసృపాలు, క్షీరదాలతో పాటు ఇతర చిన్న కీటకాల వినాశనానికి దారితీస్తోంది.
జీవవైవిధ్యంపై పెను ప్రభావం..
వానాకాలం వచి్చందంటే సరస్సుల దగ్గర ఎగ్రెట్లు, హెరాన్లు, కార్మోరెంట్లు వంటి పక్షులు కనిపించేవి. కానీ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు, కవర్లు ఆ జీవుల మనుగడకు పెను ప్రమాదంగా మారాయి. ఆహారంతో పాటు జీర్ణాశయంలోకి చేరి అరగించలేక మృత్యువాత పడుతున్నాయి. కొన్ని పక్షులు గూళ్లు నిర్మించేందుకు ప్లాస్టిక్ వినియోగించడంతో ఆ గూటిలోని పిల్ల పక్షులు ఈ వ్యర్థాలను తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. మరోవైపు నగరంలోని కేబీఆర్ పార్కు, నెక్లెస్ రోడ్, మాదాపూర్ వాకింగ్ ట్రాక్‌ల వద్ద ప్లాస్టిక్ మింగిన పెంపుడు కుక్కలు, పిల్లుల గ్యాస్ట్రో బ్లాకేజ్, ఊపిరితిత్తుల ఇబ్బందులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాయని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది నివాసితులు స్వయంగా క్లీనప్ డ్రైవ్స్ నిర్వహించాల్సి వస్తోంది.
మానవ దేహాల్లో నానో ప్లాస్టిక్..
నగరవాసులకు పెట్ బాటిళ్లు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ‘సేఫ్’ అనిపించవచ్చు. కానీ, వాటి నుంచి వెలువడే పాలీకార్బొనేట్స్, బిస్‌ఫినాల్ ఏ, యాంటిమోనీ
వంటి రసాయనాలు మన హార్మోన్లను దెబ్బతీస్తాయి. పిల్లల ఎదుగుదలకు అడ్డుపడతాయని ఐఐటీఆర్, సీడీఎస్‌సీఓ, ఎన్‌టీహెచ్ వంటి పరిశోధనలు ఇప్పటికే వెల్లడించాయి. అంతేకాకుండా నగరవాసుల శవ పరీక్షల్లో నానోప్లాస్టిక్.. మెదడు, కాలేయం, మూత్రపిండాల్లో కనిపించడం మరింత ఆందోళనకు గురిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా నానోప్లాస్టిక్ పరిమాణం మెదడులో సగటున 171 నానోమీటర్ల వరకూ ఉండడం పరిశోధకులను సైతం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పాలిథిలిన్, పాలీప్రొపైలిన్ వంటివి మానవ కణజాలాలను దాటి మన శరీర వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంది.
ఏం చేయాలి?
హైదరాబాద్ నగర వాసులు ప్లాస్టిక్‌ను తిరస్కరించడం ఒక ప్యాషన్‌గా, బాధ్యతగా మార్చుకోవాలి.
మట్టితో, కర్రతో, దారంతో చేసిన సహజ ఉత్పత్తులను ప్రోత్సహించాలి.
జీహెచ్‌ఎంసీ విధించే సింగిల్–యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలి.
ప్లాస్టిక్ బహిష్కరణ కార్యక్రమాలను పాఠశాలలు, కళాశాలల స్థాయిలో పెంపొందించాలి.
ప్రతి ప్రాంతంలో స్థానికులు వారం వారం లేక్ క్లీనప్ డ్రైవ్స్ చేపట్టాలి.
దైనందిన జీవితంలో ప్యాకేజింగ్ ఉత్పత్తులను నివారించాలి. ప్లాస్టిక్ సంచులను, బాటిళ్ల వినియోగాన్ని తగ్గించాలి.
ఇదీ చదవండి : జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది
Tags : 1