పాకిస్తాన్ తో యుద్ధాన్ని ఎందుకు ఆపేశారు? కాంగ్రెస్ సూటి ప్రశ్నకు బీజేపీ రిప్లై ఏంటి?
Breaking News
ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్: పెళ్లి పరీక్షకు ప్రిపేర్ అవ్వాలి
Published on Wed, 07/02/2025 - 00:47
పెళ్లంటే పందిళ్లు, సందళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలే కాదు.. పరస్పర ప్రేమాభిమానాలు, గౌరవ, నమ్మకాలు కూడా! వీటిల్లో ఏది లోపించినా విడాకుల దారే కనిపిస్తోంది ఈ తరానికి! కారణం... ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ లేకపోవడమే అంటున్నారు నిపుణులు. దాని అవసరం గురించే ఈ కథనం..
పెళ్లి అంటే సినిమాల్లో చూపించినట్లో.. సోషల్ మీడియాలోపోస్ట్ చేసే ఫొటోలు, వీడియోల్లాగానో ఉండదు! రిలేషన్ షిప్స్‌లో ఎన్ని కొత్తట్రెండ్స్ కనిపిస్తున్నా పెళ్లంటే మన దగ్గర రెండు కుటుంబాలకు సంబంధించిన వ్యవహారమే ఇంకా! పెట్టుపోతల దగ్గర్నుంచి అప్పగింతల దాకా పెళ్లిలో ఉన్న తంతే దానికి నిదర్శనం! సంప్రదాయ వివాహ వ్యవస్థలో ఇమడాలనుకుంటున్న యూత్.. తమ నేపథ్యాల నుంచి జీవన శైలులు, విలువల దాకా రెండు కుటుంబాల మధ్య ఉన్న భిన్నత్వాన్ని అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇదివరకైతే ఉమ్మడి కుటుంబాలుండేవి.
ఆ వాతావరణం, పెద్దవాళ్ల సుద్దుల ద్వారా అలాంటివన్నీ తెలిసేవి. ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలే! అబ్బాయితోపాటు అమ్మాయీ ఆర్థికంగా స్వతంత్రురాలైంది. జెండర్ రోల్స్, కుటుంబ విలువలూ మారాయి. దాంతో సాంస్కృతిక సర్దుబాట్ల నుంచి ఆర్థిక వ్యవహారాలు, కంపాటబులిటీ దాకా అన్నీ సవాళ్లుగా పరిణమిస్తున్నాయి. విడాకుల సంఖ్యను పెంచుతున్నాయి. అది మన సంప్రదాయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ క్రమంలో పెళ్లికి ముందే వాటన్నిటి గురించి ముఖ్యంగా కాపురంలో ఉండాల్సిన సర్దుబాట్లు, సమ్మతి, పరస్పర గౌరవం, బాధ్యత, నమ్మకం .. ఒక్కమాటలో చెప్పాలంటే వైవాహిక జీవితం మీద పూర్తి అవగాహనను కల్పించే ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ అవసరమని చెపుతున్నారు నిపుణులు.
ఇదీ చదవండి: Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్ తప్పవు మరి!
క్రాష్ కోర్స్..
ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ అనేది పెళ్లి బంధానికి క్రాష్ కోర్స్ లాంటిదంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్స్. అన్నిరకాలుగా చూసి పెళ్లికి సిద్ధపడ్డా.. ఆ ప్రయాణం నల్లేరు మీద నడకేమీకాదు. కానీ సంసారం ఒడిదుడుకులకు లోనైప్పుడు జాగ్రత్తగా ఎలా ప్రయాణించాలో ఈ ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ నేర్పుతుంది అంటున్నారు మానసిక విశ్లేషకులు. అందుకే ఈడు –జోడు, సంపాదన, ఆస్తి– పాస్తులు ఒక్కటే సరిపోవు. జీవిత భాగస్వామి బలాబలాల నుంచి పర్సనల్ – ప్రోఫెషనల్ లక్ష్యాలు, క్లిష్టపరిస్థితులను, భావోద్వేగపరమైన విభేదాలను హ్యాండిల్ చేసే తీరు దాకా, దైనందిన జీవితంలోని పనులు, ఆర్థిక బాధ్యతలు, జీవితభాగస్వామికున్న అంచనాల దాకా అన్నిటినీ పరిశీలించాలి. దానికి ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ చోటిస్తుంది.
చదవండి: కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియో
భేదాబీప్రాయాలుంటే సర్దుబాట్లకున్న మార్గాలను చర్చించేలా చేస్తుంది. బలహీనతలు సహా భాగస్వామిని అంగీకరించగలమా లేదా అనే స్టేబులిటీని పరీక్షించుకునే అవకాశాన్నిస్తుంది. మొత్తమ్మీద పెళ్లిలోనిప్రాక్టికల్‌ప్రాబ్లమ్స్ మీద అవగాహన కల్పిస్తుంది. దీనివల్ల పెళ్లి తర్వాత వచ్చే సమస్యలను వాగ్వాదాలతో కాకుండా చర్చలతో పరిష్కరించుకునే సహనం అలవడుతుందం టున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్స్. ఈ కౌన్సెలింగ్‌లో కంపాటబులిటీ లేదని తేలితే ఆ సంబంధం పెళ్లిదాకా వెళ్లకుండా ఆగిపోతుంది. కాబోయే భాగస్వామిలో ఏమి చూడాలి, ఎలాంటి ఆలోచనా తీరున్న వ్యక్తి అయితే తనకు కుదురుతుంది లాంటివన్నీ తెలిసి భాగస్వామి ఎంపిక ఈజీ అవుతుంది.
యువతా మొగ్గుచూపుతోంది..
సామాజిక కట్టుబాటు కంటే కూడా మానసిక, భావోద్వేగ సరిజోడీని కోరుకుంటున్న ఈ తరం ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ వైపు మొగ్గు చూపుతోంది. అవతలి వ్యక్తి గురించి సరైన అవగాహన లేకుండా పెళ్లిలోకి దిగి.. జోడీ కుదరక పరస్పర ఆరోపణలతో విడాకులకు వెళ్లే బదులు ఈ కౌన్సెలింగ్ ద్వారా పెళ్లి బంధాన్ని కాపాడుకునే ఎబిలిటీని పెంచుకోవడం మంచిది కదా అని అబీప్రాయ పడుతోంది. పరస్పర గౌరవం, నమ్మకంతో కూడిన బలమైన బం«ధాన్ని ఏర్పరచుకునే వీలును ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ కల్పిస్తుందని సామాజిక విశ్లేషకులూ చెబుతున్నారు. – సరస్వతి రమ
పరస్పర గౌరవం లేకపోవడం, ఇరుకుటుంబ పెద్దల జోక్యం, ఆధిపత్యపోరు, అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, వరకట్నం, గృహహింస వంటివి సగానికి పైగా విడాకుల కేసుల్లో సాధారణ కారణాలు. శృంగార సమస్యలు, సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవటం కూడా ఈ మధ్య ఎన్నో విడాకులకు కారణాలుగా చూస్తున్నాం. ఇలాంటి ఎన్నో అంశాలను ప్రీమ్యారిటల్ కౌన్సెలింగ్ ద్వారా సమస్యలుగా మారకుండా చూడొచ్చు. అయితే ఈ కౌన్సెలింగ్‌లోనే చట్టాలపైనా అవగాహన కల్పిస్తే హక్కుల గురించి తెలిసి, హక్కులు – వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య ఒక బ్యాలెన్స్ క్రియేట్ అయ్యి.. కలహాలు, కలతల్లేకుండా కాపురాలు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. – సుధేష్ణ మామిడి, హైకోర్ట్ న్యాయవాది
Tags : 1