మద్యం మత్తులో యువతి హల్ చల్
Breaking News
‘సినిమా’ చూపించిన ట్రంప్.. అమెరికాలో కష్టమే!
Published on Mon, 05/05/2025 - 17:01
‘అమెరికా ఫస్ట్’అనే విధానంతో ప్రపంచ దేశాలపై ‘సుంకాల యుద్ధం’ ప్రకటించాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఇప్పటికే వివిధ రంగాలపై భారీగా టారీఫ్ విధించిన ట్రంప్..ఇప్పుడు సినిమా రంగంపై విరుచుపడ్డాడు. అమెరికాలో కాకుండా ఇతర దేశాలలో నిర్మించిన చిత్రాలపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించి సినిమా రంగానికి షాకిచ్చాడు. ట్రంప్ నిర్ణయం భారత సినీ పరిశ్రమపై ముఖ్యంగా టాలీవుడ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు.
గతకొన్నేళ్లుగా అమెరికాలో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ భారీగా కలెక్షన్స్ రాబట్టే చిత్రాలలో టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు అగ్రస్థానంలో ఉంటాయి. పటాన్, ఆర్‌ఆర్‌ఆర్, డంకీ, పుష్ప, జవాన్ లాంటి చిత్రాలు అక్కడ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టాయి.
(చదవండి: దయలేని ట్రంప్.. ఈసారి సినిమాపై 100% సుంకం)
ముఖ్యంగా తెలుగు సినిమాలకు ఉత్తర అమెరికాలో భారీ క్రేజీ ఉంది. ఇండియా కంటే ఒక్క రోజు ముందుగానే అక్కడ సినిమాను రిలీజ్ చేస్తారు. అక్కడ హిట్ టాక్ వస్తే.. ఇక్కడ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ వేసిన టారీఫ్ బాంబుకి అక్కడి డిస్ట్రిబ్యూషన్ వర్గాలు కుదేలు అవ్వడం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ట్రంప్ చెప్పినట్లుగా విదేశీ చిత్రాలకు 100 శాతం సుంకం విధిస్తే.. ఒక మిలియన్ డాలర్‌కు సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ మరో మిలియన్ డాలర్‌ని టాక్సీగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే డిస్ట్రిబ్యూటర్ రెట్టింపు ధరను చెల్లించి ఇండియన్ సినిమాలను కొనుగోలు చేయాలన్నమాట. ఈ భారం ప్రేక్షకుడిపై వేయాల్సి ఉంటుంది. లాభాల కోసం టికెట్ ధరను పెంచాల్సి వస్తుంది. ఇప్పుడున్న ధరకే ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్లడం లేదు. ఇక ధరలు పెంచితే.. అమెరికాలో కూడా థియేటర్స్ ఖాలీ అవ్వడం ఖాయమని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఇండియన్ సినిమాలను కొనుగోలు చేయాలంటే ఇప్పుడున్న రేటుకి రెట్టింపు చెల్లించాలి కాబట్టి..అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ వెనుకడుగు వేస్తారు. అలాగే ఓటీటీలకు కూడా ట్రంప్ నిర్ణయం వర్తిసుందని చెబితే మాత్రం.. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఇండియన్ సినిమాలకు తక్కువ డబ్బులు చెల్లించే అవకాశం ఉంది. మొత్తంగా అమెరికా మార్కెట్ దృష్టిలో పెట్టుకొని భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాలకు ట్రంప్ భారీ షాకిచ్చాడనే చెప్పాలి.
పాన్ ఇండియా సినిమాపై ట్రంప్ ఎఫెక్ట్
అమెరికా మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే భారీ బడ్జెట్‌తో కొన్ని చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ ‘ది రాజా సాబ్’, ధనుష్ ‘కుబేర’, పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, చిరంజీవి ‘విశ్వంభర’ తదితర చిత్రాలన్ని త్వరలోనే విడుదల కావాల్సి ఉంది. ఓవర్సిస్ బిజినెస్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాలకు భారీగానే ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ విధించిన 100 శాతం సుంకం కారణంగా ఈ చిత్రాలకు జరిగే బిజినెస్‌లో తేడాలు వస్తాయి.
ఓవర్సీస్‌లో తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుంది. అలాగే ఓటీటీలో కూడా కొనుగోలు విషయంలో వెనకడుకు వేసే అవకాశం ఉంది. అయితే ట్రంప్ నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సినిమా రంగంపై విధించిన వందశాతం టారీఫ్ విషయంలో ఆయన మరోసారి ఆలోచన చేస్తాడా? మనసు మార్చుకొని టారిఫ్ తగ్గిస్తాడా లేదా చూడాలి.
Tags : 1