రెండుసార్లు బౌండరీని తాకినా ఎందుకిలా? ఇది అన్యాయం.. | Sakshi
Sakshi News home page

రెండుసార్లు బౌండరీని తాకినా ఎందుకిలా? తప్పు ఎవరిదంటే?

Published Wed, May 8 2024 12:37 PM

సంజూ వివాదాస్పద రీతిలో అవుట్‌ (PC: IPL/BCCI)

రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ విషయంలో అంపైర్ల నిర్ణయాన్ని మాజీ క్రికెటర్‌‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు తప్పుబట్టాడు. కంటికి స్పష్టంగా కనిపిస్తున్నా సాంకేతికత పేరిట సంజూకు అన్యాయం జరిగిందని పేర్కొన్నాడు. అతడు గనుక క్రీజులో ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్‌-2024లో భాగంగా రాజస్తాన్‌ మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. ఇక సొంత మైదానం అరుణ్‌ జైట్లీ స్టేడియంలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

బాధ్యత తీసుకున్న  సంజూ శాంసన్‌
 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌(4), జోస్‌ బట్లర్‌(19) వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న వన్‌డౌన్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.

46 బంతుల్లో 8ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 86 పరుగుల వద్ద ఉన్న సమయంలో అనూహ్య రీతిలో అవుటయ్యాడు. పదహారో ఓవర్లో ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో షాయీ హోప్‌నకు క్యాచ్‌ ఇచ్చాడు.

అయితే, క్యాచ్‌ అందుకునే సమయంలో షాయీ హోప్‌ బౌండరీ లైన్‌ను తాకినట్లుగా అనిపించినా ఫీల్డ్‌ అంపైర్‌, థర్డ్‌ అంపైర్‌ అవుటివ్వడంతో సంజూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ విషయంపై స్పందించిన కామెంటేటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు.. సంజూకు మద్దతుగా నిలిచాడు.

సైడ్‌ యాంగిల్‌లో చూసినపుడు 
‘‘అంపైర్లు తీసుకున్న ఆ నిర్ణయం మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చి వేసింది. ‌‌సంజూ శాంసన్‌ అవుట్‌ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక.. కానీ సైడ్‌ యాంగిల్‌లో చూసినపుడు ఫీల్డర్‌ బౌండరీ లైన్‌ను రెండుసార్లు తాకినట్లు స్పష్టంగా కనిపించింది.

సాంకేతికత వాడినా, వాడకపోయినా కళ్లకు కట్టినట్లు కనిపించింది. ఈసారి టెక్నాలజీ వల్ల కచ్చితంగా తప్పిదం జరిగిందనే చెప్తాను. రెండుసార్లు అతడు బౌండరీ లైన్‌ తాకినా అవుట్‌ ఇవ్వడం సరికాదు.

అన్యాయం.. సంజూ బలైపోయాడు
నేను తటస్థంగా ఉండే వ్యక్తిని. సంజూ నాటౌట్‌ అని కచ్చితంగా చెప్పగలను. అలా అని అంపైర్లు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని నేను అనుకోవడం లేదు.

ఇక్కడ ఎవరి తప్పు లేకపోయినా సంజూ బలైపోయాడు. ఆటలో ఇవన్నీ సహజమే అయినా.. ఈ నిర్ణయం మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపింది’’ అని నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఢిల్లీతో మ్యాచ్‌లో రాజస్తాన్‌ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.

చదవండి: Playoff Race: సన్‌రైజర్స్‌ గుండెల్లో వర్షం గుబులు.. మ్యాచ్‌ రద్దైతే గనుక!
 

 
Advertisement
 
Advertisement