నాకు పదవొస్తే కాంగ్రెస్‌కు ఎందుకంత భయం? | Sakshi
Sakshi News home page

నాకు పదవొస్తే కాంగ్రెస్‌కు ఎందుకంత భయం?

Published Fri, Oct 20 2023 4:00 AM

Sakshi exclusive interview with Nallu Indrasena Reddy

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ పదవిలో తనను నియమిస్తే కాంగ్రెస్‌ పార్టీ ఎందుకంత భయాందోళనలకు గురై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కు ఫిర్యాదు చేసిందో అర్థం కావడం లేదని త్రిపుర గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్‌నేత నల్లు ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పార్టీ పక్షాన ఎన్నికల సన్నద్ధతలో కీలకంగా వ్యవహరిస్తున్న తనను మరో రాష్ట్రానికి గవర్నర్‌గా నియమిస్తే సంతోషపడాలే కాని భయంతో ఉన్నారంటే ఇక్కడున్న పరిస్థితులు అర్థమవు తున్నాయన్నారు.

ఇప్పటికే బీసీలు బీజేపీ వైపు ఉండగా,   రెడ్డిగా తనకు ఈ పదవి ఇవ్వడం వల్ల ఈ సామాజికవర్గం ఓట్లు కూడా బీజేపీకే పడతాయనే భయంతో కాంగ్రెస్‌ ఉన్నట్టు  కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై వివిధ వర్గాల ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని, ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి తథ్యమని జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితే లేదన్నారు.

తనకు ఈ పదవి లభించడం పట్ల సుదూర ప్రాంతాల నుంచి కార్యకర్తలు ఫోన్‌ చేసి అభినందించడం, వారిలో నూతనోత్సాహం వెల్లివిరియడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి అంకితభావంతో పనిచేస్తే బీజేపీలో తప్పకుండా గుర్తింపు లభిస్తుందనడానికి గవర్నర్‌గా తన నియామకం స్పష్టం చేస్తుందన్నారు.  నియామకపత్రాలు అందాక ఈ నెల 24న లేదా 26న పదవీబాధ్యతలను స్వీకరించే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గవర్నర్‌గా నియమితులైన సందర్భంగా సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అంశాలపై ఆయన మాట్లాడారు.

సాక్షి: మీ రాజకీయ జీవితంలో సాధించిన విజయాలు, గుర్తుండిపోయే సందర్భాలు ఏమిటి?
ఇంద్రసేనారెడ్డి: 1983 అసెంబ్లీ ఎన్నికల్లో (33 ఏళ్ల వయసులో) నాటి హోంమంత్రి కె.ప్రభాకర్‌రెడ్డిని, 1985 ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావును ఓడించి సంచలనం సృష్టించాను. 1985లో గెలిచాక కొత్త అసెంబ్లీ భవనంలోకి మారాక జరిగిన తొలిరోజు సభలో నేను వేసిన మొట్టమొదటి ప్రశ్న మంత్రులు తమ ఆస్తులను ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కోరాను.

దానిపై అప్పటి సీఎం ఎన్టీరామారావు ఆవేశంగా స్పందిస్తూ...ఒక్క మంత్రులే కాదు, ఎమ్యెల్యేలంతా కూడా ప్రతీ ఏడాది తమ ఆస్తులు, అప్పులకు సంబంధించిన బ్యాలెన్స్‌ షీటు సమర్పించేలా ఆదేశిస్తామన్నారు. దీనినే ఈసీ కూడా పరిగణనలోకి తీసుకుని ఎన్నికల నామినేషన్లు సమర్పణకు ముందు ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్‌ను సమర్పించడం తప్పనిసరి చేసింది. దీనికి నా ప్రశ్నే కారణం కావడం గర్వంగా ఉంది. అసెంబ్లీ కమిటీల్లోనూ కీలకపాత్ర పోషించి కొంతమంది ఉన్నతాధికారులు సైతం తమ తప్పులను సరిదిద్దుకునే పరిస్థితిని కల్పించిన సందర్భాలున్నాయి. 

సాక్షి: బీజేపీలో పలువురు నేతలు ఎమ్మెల్యే అయ్యాక ఎంపీగా,  కేంద్రమంత్రిగా ప్రమోషన్‌ పొందారు? మీకు అది వెలితి అనిపించిందా ?
ఇంద్రసేనారెడ్డి: ఎంపీగా వెళితే మరింత విస్తృతంగా ప్రజలకు సేవ చేయొచ్చునని భావించాను. కానీ అది సాధ్యం కాలేదు. 1980లోనే బీజేపీ తరఫున  నల్లగొండ నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమి చవిచూశాను. ఆ తర్వాత పలుమార్లు ఎంపీగా పోటీచేసినా విజయం సాధించలేకపోయాను. 2014లో చివరిసారిగా భువనగిరి నుంచి ఓడిపోయాక ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలిగాను. అప్పటి నుంచి సంస్థాగతంగా పార్టీ కార్యకలాపాలు, కార్యక్రమాల సమన్వయం తదితర విషయాల్లో నా రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ట్రబుల్‌ షూటర్‌గా నిలిచాను. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా పార్టీపరంగా పూర్తి సమన్వయ బాధ్యతలను నిర్వహిస్తున్నాను.

సాక్షి: మీ రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది?
ఇంద్రసేనారెడ్డి : 1968, 69 నుంచి ఏబీవీపీలో, అంతకు ముందు విద్యార్థిగా ఆరెస్సెస్‌లో తిరిగాను. 1975 ఎమర్జెన్సీ విధించాక మీసా కింద అరెస్టయి జైలుకు కూడా వెళ్లాను.  1977లో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ప్రారంభించిన ఉద్యమంలో భాగస్వామి అయ్యాను. జనతాపార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించాను. 1980లో బీజేపీలో చేరి కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి 1983, 1985, 1999లలో మలక్‌పేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యాను. బీజేఎల్పీనేతగా వ్యవహరించా. ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా ఉన్నా. ప్రస్తుతం జాతీయకార్యవర్గసభ్యుడిగా కొనసాగుతున్నాను.  మొత్తంగా 46 ఏళ్లుగా బీజేపీ, జనతాలతో అనుబంధం ఉంది.

సాక్షి: కీలకమైన ఎన్నికల సందర్భంలో గవర్నర్‌ పదవి రావడంపై ఏమంటారు?
ఇంద్రసేనారెడ్డి: ఈ పదవి ఇంకా రెండు, మూడునెలలు ఆలస్యంగా వచ్చి ఉంటే బాగుండేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ కృషిలో భాగస్వామినై ఉన్నాను. వివిధ కీలకబాధ్యతలను నిర్వహిస్తూ పార్టీకి ఉపయోగపడుతున్నాను.

సాక్షి: రాజ్యాంగబద్ధ పదవిని ఎలా భావిస్తున్నారు ?
ఇంద్రసేనారెడ్డి : నా మొత్తం రాజకీయజీవితంలోని అనుభవసారాన్ని అక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో వెచ్చిస్తాను. రాజ్యాంగ పరిధిలో ఏ మేరకు మరింత మెరుగ్గా పనిచేయగలను, ప్రజల అభ్యున్నతికి ఎలా కృషి చేయగలను అన్నవే నా ముందున్న లక్ష్యాలు. సుదీర్ఘ రాజకీయ అనుభవం అందుకు పనికొస్తుందని విశ్వసిస్తున్నాను. 

Advertisement

తప్పక చదవండి

Advertisement