అందుకే నా రాజీనామా.. బీఆర్‌ఎస్‌కు కూచుకుళ్ల గుడ్‌బై | MLC Kuchukulla Damodar Reddy Resigned To BRS - Sakshi
Sakshi News home page

అందుకే రాజీనామా చేస్తున్నా.. బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్సీ కూచుకుళ్ల గుడ్‌బై

Published Thu, Oct 26 2023 2:37 PM

MLC Kuchukulla Damodar Reddy Resigned BRS - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఎన్నికల వేళ జిల్లాలో భారత రాష్ట్ర సమితి పార్టీకి షాక్‌ తగిలింది. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గురువారం బీఆర్‌ఎస్‌కు రాజీనామా ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు పంపారాయన. పార్టీలో సముచిత స్థానం దక్కినప్పటికీ..  స్థానిక సమస్యల కారణంగానే బయటకు రావాల్సి వచ్చిందంటూ లేఖలో ప్రస్తావించారాయన. 

‘‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి వెళ్లి కలిసేవాడ్ని. కానీ, కేసీఆర్ ఈ నాలుగున్నర సంవత్సరాలలో కనీసం ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. పదిసార్లు వెళ్లినా.. కనీసం కలవలేదు. పార్టీ పరంగా నాకు సముచిత స్థానం కల్పించినప్పటికీ.. స్థానికంగా ఉండే సమస్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని లేఖలో పేర్కొన్నారాయన. 

స్థానికంగా ఎటువంటి ప్రయారిటీ లేదని.. ఎమ్మెల్సీ అంటే ఒక స్టిక్కర్ వేసి మీరు పడి ఉండండి అని కేసీఆర్ అంటున్నారని ఆరోపించారాయన. కేటీఆర్‌ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నా పట్టించుకోలేదని లేఖలో విమర్శించారు కూచుకుళ్ల. మరోవైపు  నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పొసగకపోవడమే కూచుకుళ్ల రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారతారనే ప్రచారం గత నాలుగైదు నెలలుగా నడుస్తోంది కూడా.

కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే మొదలైంది. కాంగ్రెస్‌ తరపునే తూడుకుర్తి గ్రామ సర్పంచ్ గా, ఎంపీపీగా, 2006లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ జెడ్పీటీసీగా గెలిచి మహబూబ్‌ నగర్‌ జిల్లా ఛైర్మన్‌గా పనిచేశాడు. ఐదుసార్లు నాగర్‌ కర్నూల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి పోటీ చేసి నాగం జనార్ధన్‌ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే  ఆ తర్వాత టీఆర్‌ఎస్‌(ఇప్పుడు బీఆర్‌ఎస్‌)లో చేరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల స్థానానికి రెండుసార్లు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారాయన. బీఆర్‌ఎస్‌కు రాజీనామా నేపథ్యంలో.. ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ నెల చివర్లో ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొనే బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. 

Advertisement
Advertisement