మస్క్‌ మామూలోడు కాదయ్యా..వీడియో వైరల్‌! ఇక ఆ రోబో కూడా? | Sakshi
Sakshi News home page

మస్క్‌ మామూలోడు కాదయ్యా..వీడియో వైరల్‌! ఇక ఆ రోబో కూడా?

Published Mon, Sep 25 2023 11:06 AM

Tesla Optimus Can Now Self Calibrate its Limbs Doing Yoga - Sakshi

Tesla Optimus ఎలాన్ మస్క్‌  నేతృత్వంలోని  టెస్లా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో  తయారవుతున్న హ్యూమనాయిడ్ రోబోమరో అడుగు ముందుకేసింది.  స్వయంగా మనిషిలా ఆలోచించే రోబోలను గత ఏడాది ప్రకటించిన  టెస్లా ఇపుడు అచ్చం మనిషిలాగే అన్ని పనులను చేయగలదంటూ తన అద్బుతమైన రోబో ఆప్టిమస్ వీడియోను టెస్లా ఎక్స్‌ (ట్విటర్‌)లో  పోస్ట్‌ చేసింది.  ఈ వీడియోలో రోబోట్ వస్తువులను సులువుగా పట్టుకోవడం, మానవుని కంటే వేగంతో క్రమబద్ధీ కరించగల సామర్థ్యాన్ని సాధించింది. ముఖ్యంగా నమస్తే ఫోజుతోపాటు, యోగా చేస్తున్న ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్‌లో హల్‌ చల్‌  చేస్తోంది.


మొక్కలకు నీళ్లు పోయడం, బాక్సులను మోయడం లాంటి పనులను చేసిన రోబో వీడియోను ఎలాన్‌ మస్క్‌ ప్రదర్శించారు. అయితే చివర్లో రోబో తడబడడం, ఇంజినీర్లు వచ్చి.. దానిని సరిచేయడం ట్రోలింగ్‌కు దారి తీసింది. ఇపుడు దాన్ని అధిగమించి సరికొత్త ప్రోగ్రెస్‌తో దూసుకొచ్చింది. ఈనేపథ్యంలో పురోగతి అంటూ ఈ వీడియోను మస్క్‌ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. 

హ్యూమనాయిడ్  బైపెడల్ రోబో  ‘ఆప్టిమస్‌’  స్వయంగా-కాలిబ్రేట్ చేయగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. వస్తువులు, దాని కలర్స్‌ను గుర్తించి సంబంధిత ట్రేలో పెట్టడం మనం ఈవీడియోలో చూడవచ్చు. అంతేకాదు చాలా చక్కగా యోగా కూడా చేస్తోంది. ఎండ్‌-టు-ఎండ్ శిక్షణ పొందిన న్యూరల్ నెట్‌వర్క్‌తో వస్తువులను గుర్తిస్తోంది. ఈ విషయంలో మానవుడు జోక్యం చేసుకున్నపుడు, అతనికంటే వేగంగా రోబో విజయవంతంగా పనిని పూర్తి చేసింది.   కలర్స్‌ బ్లాక్‌లను  ఒక క్రమంలో పెడుతుండగా, స్థానాన్ని మార్చి నప్పటికీ, రోబోట్ వాటిని సరైన ట్రేలో ఉంచింది.అంతేకాదు బ్లాక్‌ను తిరగేసి పెట్టినపుడు దాన్ని మార్చి కరెక్ట్‌గా ఉంచడం కూడా ఇందులో చూడొచ్చు. దీంతో వెల్ డన్ టెస్లా  టీం. అభినందనలు అంటున్నారు ట్వీపుల్‌. అంతేకాదు  మస్క్‌ మామ మామూలోడు కాదు భయ్యా అంటూ నెటిజన్లు  కమెంట్‌ చేశారు.  నెక్ట్స్‌  రోబో కోసం వెయిటింగ్‌  అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.

కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో హెడ్‌క్వార్టర్స్‌లో గత  ఏడాది జరిగిన ఒక ఈవెంట్‌లో  ప్రకదర్శించిన హ్యూమనాయిడ్‌ రోబో ఆప్టిమస్‌ టెక్నాలజీ ఆకట్టుకుంది. త్వరలో సెక్సీ రోబోలను సృష్టిస్తామంటూ ఎలాన్‌ మస్క్‌ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది మార్చిలో ఇన్వెస్టర్ డే సందర్భంగా, టెస్లా ఐదు రోబోలను ప్రదర్శించింది. ఇపుడిక ఒక ఏడాదిలోపే మరో కీలకమైన పురోగతిని సాధించడం విశేషం.

Advertisement

తప్పక చదవండి

Advertisement