నిష్క్రమణ బాటలో విదేశీ బ్యాంకులు | Sakshi
Sakshi News home page

నిష్క్రమణ బాటలో విదేశీ బ్యాంకులు

Published Fri, Mar 3 2023 6:02 AM

Citibank joined a line of foreign banks leaving India - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో రిటైల్‌ బ్యాంకింగ్‌ వ్యాపారం నుంచి నిష్క్రమిస్తున్న విదేశీ బ్యాంకుల జాబితాలో తాజాగా సిటీబ్యాంక్‌ కూడా చేరింది. 2011లో డాయిష్‌ బ్యాంక్‌ తమ క్రెడిట్‌ కార్డ్‌ వ్యాపారాన్ని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌కు విక్రయించింది. 2013లో యూబీఎస్‌ వైదొలిగింది. మోర్గాన్‌ స్టాన్లీ తమ బ్యాంకింగ్‌ లైసెన్సును రిజర్వ్‌ బ్యాంక్‌కు సరెండర్‌ చేసింది. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా–మెరిల్‌ లించ్, బార్‌క్లేస్, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ 2015లో తమ కార్యకలాపాలను తగ్గించుకున్నాయి.

2016లో కామన్వెల్త్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా నిష్క్రమించింది. అదే ఏడాది హెచ్‌ఎస్‌బీసీ రెండు డజన్లపైగా శాఖలను మూసివేసింది. బీఎన్‌పీ పారిబా 202లో తమ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారాన్ని మూసివేసింది. దక్షిణాఫ్రికాకు చెందిన రెండో అతి పెద్ద బ్యాంక్‌ ఫస్ట్‌ర్యాండ్‌బ్యాంక్‌ సైతం దేశీ మార్కెట్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు రెండేళ్ల క్రితం ప్రకటించింది. 1984 నుంచి భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఆస్ట్రేలియా అండ్‌ న్యూజిల్యాండ్‌ బ్యాంక్‌ 2000లో తమ గ్రిండ్లేస్‌ బ్యాంక్‌ను స్టాండర్డ్‌ చార్టర్డ్‌కు విక్రయించి తప్పుకుంది.

అయితే, 2011లో ముంబైలో కొత్త బ్రాంచ్‌ ద్వారా తిరిగివచ్చింది. దేశీ బ్యాంకుల నుంచి పోటీ పెరిగిపోతుండటం, పాటించాల్సిన నిబంధనలు వివిధ రకాలుగా ఉండటం, అసెట్‌ క్వాలిటీపరమైన సమస్యలు మొదలైనవి విదేశీ బ్యాంకుల నిష్క్రమణకు దారి తీస్తున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. పలు విదేశీ బ్యాంకులు తప్పుకుంటున్నప్పటికీ కొన్ని మాత్రం నిలదొక్కుకుంటున్నాయి. జర్మనీకి చెందిన డాయిష్‌ బ్యాంక్‌కు భారత్‌లో 16 శాఖలు ఉన్నాయి. 2020లో లక్ష్మి విలాస్‌ బ్యాంక్‌ను డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా కొనుగోలు చేసింది.

Advertisement
Advertisement