మీ ‘మద్దతు’ బాధంతా బాబు కోసమేగా! | FactCheck: Eenadu Ramoji Rao Fake News On CM Jagan Govt, Details Inside | Sakshi
Sakshi News home page

మీ ‘మద్దతు’ బాధంతా బాబు కోసమేగా!

Published Sun, May 12 2024 6:04 AM

Eenadu Ramoji Rao Fake News On CM Jagan Govt

రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి మీ పచ్చ కళ్లకు కనిపించదా?

సీఎం యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు మార్కెట్‌ ధరల పర్యవేక్షణ

కనీస మద్దతు ధర దక్కని ఉత్పత్తులు ప్రభుత్వమే కొనుగోలు

రూ.65 వేల కోట్లు చెల్లించి 3.38 కోట్ల టన్నుల ధాన్యం సేకరణ

రూ.7,757.87 కోట్లతో ఇతర పంట ఉత్పత్తుల కొనుగోలు

గన్నీ బ్యాగులు, కూలీలు, రవాణా ఖర్చు కూడా ప్రభుత్వానిదే

ఎమ్మెస్పీకి మించి మార్కెట్‌లో రైతులకు మంచి ధరలు

ఇన్ని చేస్తున్నా ప్రభుత్వంపై రామోజీ విషం

సాక్షి,అమరావతి: ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అనే చందంగా పచ్చ పత్రికాధినేత రామోజీరావు తీరు ఉంది. వ్యవసాయం దండగ అని చంద్రబాబు తీసిపారేస్తే.. వ్యవసాయం పండుగ అని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిరూపించింది. అధికారంలోకి వచ్చింది మొదలు గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు, అక్కడే విత్తు నుంచి విక్రయం వరకు అన్ని ఏర్పాట్లు, కనీస మద్దతు ధర దక్కని పంటలను ప్రభుత్వమే కొనుగోలు, మార్కెట్‌లో ధరలు పడిపోయిన ప్రతిసారి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వ జోక్యం, ఏకంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ఆరు పంటలకు కనీస మద్దతు ధర, సీఎం యాప్‌ ద్వారా ధరల పర్యవేక్షణ, ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పుడు గోనె సంచులతోపాటు కూలీల భారం, రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే పెట్టుకుంటున్నా.. ఇంకా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో చేస్తున్నా రామోజీ విషం జిమ్ముతున్నారంటే ఏం అనుకోవాలి? ఈ ఏడుపుకు, కడుపుమంటకు అసలు మందు ఉందా? బుధవారం తన పచ్చ పత్రిక ‘ఈనాడు’లో ‘కనీస మద్దతు ధర.. గరిష్ట మోసం దొర’ అంటూ ఒక తప్పుడు కథనాన్ని అచ్చేశారు. దీనికి సంబంధించి అసలు వాస్తవాలివిగో..

ఆరోపణ: ధరల స్థిరీకరణ నిధి ఒక దగా
వాస్తవం: మార్కెట్‌లో మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు రూ.3 వేల కోట్లతో ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. వాస్తవానికి ఈ 57 నెలల్లో 1–2 సీజన్‌లలో 2–3 పంట ఉత్పత్తులకు మినహా మిగిలిన పంటల మార్కెట్‌ ధరలు మద్దతు ధరకు మించి పలికాయి. ఈ ఏడాది కూడా మద్దతు ధరలు ప్రకటించిన పంట ఉత్పత్తులతో సహా పలు రకాల వ్యవసాయ, ఉద్యాన పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి పలుకుతున్న మాట వాస్తవం కాదా? అలాంటప్పుడు మార్కెట్‌లో జోక్యం చేసుకోవల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంటుందో ‘ఈనాడు’కే తెలియాలి. 

ఆరోపణ: సీఎం యాప్‌ సిగ్గు..సిగ్గు
వాస్తవం: దేశంలోనే తొలిసారిగా గ్రామాల వారీగా మార్కెట్‌లో ధరలను సేకరించి ఎప్పటికప్పుడు వాటి హెచ్చుతగ్గులను సమీక్షించేందుకు సీఎం యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్‌ ద్వారా ఈ 57 నెలల్లో ధరలు పతనమైన ప్రతిసారీ ప్రభుత్వమే మార్కెట్‌లో జోక్యం చేసుకొని వ్యాపారులతో పోటీపడి రైతులకు కనీసమద్దతు ధర దక్కేలా కృషి చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల పంటల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. ఈ 57 నెలల్లో 6.18 లక్షల మంది రైతుల నుంచి రూ.7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నుల ఉత్పత్తులను జగన్‌ ప్రభుత్వం కొనుగోలు చేసింది. 

అంటే... రెట్టింపు కన్నా అధికం. అలాగే చంద్రబాబు ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే.. ఈ 57 నెలల్లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 37.34 లక్షల మంది రైతుల నుంచి 3.38 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.65 వేల కోట్లు చెల్లించింది. బాబు హయాంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు రూ.43,559 కోట్లు మాత్రమే వెచ్చిస్తే, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఏకంగా రూ.72,445 కోట్లు ఖర్చుచేసింది అంటే.. సగటున చంద్రబాబు హయాంలో ఏడాదికి రూ.8,711 కోట్లు వెచ్చిస్తే, జగన్‌ ప్రభుత్వం ఏటా సగటున రూ.16,099 కోట్లు వెచ్చించింది. 

ఆరోపణ: గిట్టుబాటు ధర కల్పనలో చేతులెత్తేశారు
వాస్తవం: గిట్టుబాటు ధరలు పడిపోతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇలా ప్రభుత్వ భరోసా వల్లే మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయి. అలాగే 2021–22లో ఉల్లి ధరలు పతనమైనప్పుడు మద్దతు ధరకు, 2022–23లో ధరలు పెరిగినప్పుడు మార్కెట్‌ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇటు రైతులకు, అటు వినియోగదారులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఇలా రూ.64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు సబ్సిడీ ధరలకు అందించింది. 

2022–23లో రూ.22.94 కోట్ల విలువైన 2,541 టన్నులు, 2023–24లో రూ.43.46 కోట్ల విలువైన 5,517 టన్నుల పసుపును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. మిరప ఎమ్మెస్పీ రూ.7వేలు కాగా మూడేళ్లుగా మార్కెట్‌లో క్వింటా రూ.15వేల నుంచి రూ.30వేలకు పైగా ధరలు పలుకుతున్నాయి. నాలుగేళ్లుగా చిరుధాన్యాల మార్కెట్‌ ధరలు మద్దతు ధర కంటే ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగానే ప్రస్తుత ఎమ్మెస్పీ ధరల కంటే మిరప, పత్తి, పసుపు, వేరుశనగ, మినుము, మొక్కజొన్న పంటలకు మార్కెట్‌లో రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయి. 

ఆరోపణ: వ్యవసాయ ఖర్చులు పెరిగాయి
వాస్తవం: సహజంగా మద్దతు ధరలు ప్రకటించేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని పంటలు వేసే రైతులు నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా సొంతంగా వాటికి మద్దతు ధరలను ప్రకటించింది. మద్దతు ధరకు మించి పలికితే మార్కెట్లోనే రైతులు విక్రయించుకుంటారు. మార్కెట్‌లో ధర లేనప్పుడు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతుకు బాసటగా నిలుస్తోంది. రైతులకు పెట్టుబడి పెరిగిందని వాదిస్తున్న రామోజీ... అదే సమయంలో రైతుకు ఏటా రూ.13,500 చొప్పున ఇస్తున్న రైతు భరోసా సాయాన్ని మాటమాత్రం ప్రస్తావించలేదు. ఈ 57 నెలల్లో ప్రతి రైతుకు రూ.65,500 చొప్పున 53.53 లక్షల మందికి రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించినా రామోజీ పచ్చ కళ్లకు కనిపించలేదు.  

జీఎల్‌టీ ఖర్చులను కూడా భరిస్తూ.. 
రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా జీఎల్‌టీ (గన్నీ బ్యాగ్‌లు, కూలీలు, రవాణా)ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తోంది. ధాన్యం కొనుగోలు సందర్భంలో టన్నుకు రూ.2,523 (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా చార్జీలకు రూ.468తో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85), ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాకు రూ.418 చొప్పున భరిస్తోంది.  

 
Advertisement
 
Advertisement