దేశంలో విశాఖ స్టేషన్ బెస్ట్, సికింద్రాబాద్ నెంబర్ 2 | Sakshi
Sakshi News home page

దేశంలో విశాఖ స్టేషన్ బెస్ట్, సికింద్రాబాద్ నెంబర్ 2

Published Wed, May 17 2017 6:45 PM

దేశంలో విశాఖ స్టేషన్ బెస్ట్, సికింద్రాబాద్ నెంబర్ 2 - Sakshi

పరిశుభ్రత విషయంలో దేశంలోనే ఉత్తమ రైల్వేస్టేషన్‌గా విశాఖపట్నం రైల్వేస్టేషన్ నిలిచింది. దాని తర్వాతి స్థానంలో సికింద్రాబాద్ ఉంది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే మొత్తం 75 స్టేషన్లను తీసుకుని వాటిలో సర్వే చేసినప్పుడు.. క్లీనెస్ట్ స్టేషన్‌గా విశాఖ నిలిస్తే, అత్యంత మురిగ్గా ఉండే స్టేషన్‌గా బిహార్‌లోని దర్భాంగా నిలిచింది. ఈ సర్వే వివరాలను రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. దేశ రాజధానిలోని న్యూఢిల్లీ స్టేషన్‌కు ఈ జాబితాలో 39వ ర్యాంకు లభించింది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ సర్వే చేసింది. ప్లాట్‌ఫాంల మీద ఉన్న టాయిలెట్ల శుభ్రత, ట్రాకులు పరిశుభ్రంగా ఉండటం, స్టేషన్లలోని డస్ట్‌బిన్‌లు తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ప్రతి స్టేషన్‌కు పరిశుభ్రత విషయంలో మార్కులు వేశారు.

స్వచ్ఛ రైలు ప్రచారంలో భాగంగా రైల్వే స్టేషన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్న ప్రయత్నంలో భాగంగా రైల్వేశాఖ ఈ తరహా సర్వే చేయించడం ఇది మూడోసారి. గతంతో పోలిస్తే ఈసారి చాలావరకు రైల్వేస్టేషన్లు శుభ్రత విషయంలో తమ ర్యాంకులు మెరుగుపరుచుకున్నాయని సురేష్ ప్రభు చెప్పారు. ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహించే వారణాసి రైల్వే స్టేషన్‌కు ఈ సర్వేలో 14వ ర్యాంకు లభించింది. మొత్తం 407 స్టేషన్లలో సర్వే చేయగా వాటిలో 75 ఏ-1 కేటగిరీ స్టేషన్లు లేదా బాగా రద్దీగా ఉండే స్టేషన్లు. 332 ఏ కేటగిరీలో ఉన్నాయి. ఆ విభాగంలో పంజాబ్‌లోని బియాస్ స్టేషన్‌కు మొదటి ర్యాంకు, తెలంగాణలోని ఖమ్మం స్టేషన్‌కు రెండో ర్యాంకు, అహ్మద్‌నగర్ స్టేషన్‌కు మూడో ర్యాంకు వచ్చాయి. ఈ కేటగిరీలో జోగ్‌బని స్టేషన్ చివరి స్థానంలో నిలిచింది.

Advertisement
Advertisement