ప్రయాణికుల కొట్లాట.. విమానం దారి మళ్లింపు | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల కొట్లాట.. విమానం దారి మళ్లింపు

Published Thu, Jul 28 2016 6:09 PM

ప్రయాణికుల కొట్లాట.. విమానం దారి మళ్లింపు - Sakshi

విమానంలో వేరే దేశం వెళ్తున్నామంటే కాస్త మర్యాదగా ప్రవర్తించాలి. కానీ, కోజికోడ్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఆ విషయం మరచి కొట్లాటకు దిగడంతో విమానాన్ని అత్యవసరంగా ముంబైలో దించేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఇండిగో విమానయాన సంస్థ అధికార ప్రతినిధి కూడా నిర్ధారించారు. కోజికోడ్ విమానాశ్రయంలో ఈ విమానం 3 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 12.30కి దిగింది.  తన పక్కన కూర్చున్న వ్యక్తికి మానసిక స్థిరత్వం లేనట్లుందని, అతడితో చాలా సమస్య అయిందని ఓ ప్రయాణికుడు ఆరోపించారు. విమానం టేకాఫ్ తీసుకున్న గంట తర్వాత గొడవ మొదలైంది. కేబిన్ క్రూతో అతడు వాదులాట పెట్టుకున్నాడని, తోటి ప్రయాణికులు అతడిని అదుపుచేశారని నిఖిల్ అనే ప్రయాణికుడు చెప్పారు. చివరకు గొడవ పెట్టుకున్న వ్యక్తిని, అతడి సోదరుడిని ముంబైలో విమానం నుంచి దించేశారు. అయితే.. వాళ్లు విమానంలో ఇస్లామిక్ స్టేట్ అనుకూల నినాదాలు చేశారని, అందువల్ల ముంబైలో ఆ ఇద్దరినీ సీఐఎస్ఎస్‌ సిబ్బందికి అప్పగించారని కూడా సమాచారం వచ్చింది.

ప్రస్తుతానికి దాని గురించి ఏమీ చెప్పలేమని, దర్యాప్తు పూర్తయిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని డీసీపీ వీరేంద్ర మిశ్రా చెప్పారు. విమానంలో ఆహారం తీసుకొచ్చే బండి మీదకు దూకి దానిమీద కూర్చున్నాడని, సిబ్బంది వెంటనే కెప్టెన్కు చెప్పగా.. తర్వాత అంతా కలిసి అతడిని దించారని ప్రయాణికులు అన్నారు. తర్వాత ఉన్నట్టుండి అతడు పక్క ప్రయాణికుడిని తిట్టడం మొదలుపెట్టాడు. దీంతో కెప్టెన్ ఏటీసీకి, గ్రౌండ్ సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి, ఉదయం 9.40  సమయంలో ముంబైలో విమానాన్ని దించేశారు. అక్కడ సోదరులిద్దరినీ విమానం నుంచి దింపి.. అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement