పీజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం | Gang rape on a student | Sakshi
Sakshi News home page

పీజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Jul 15 2014 7:15 PM | Updated on Sep 2 2017 10:20 AM

నిందితులు ఉపయోగించిన కారు.ప్రధాన నిందితుడు హైదర్ నజీర్

నిందితులు ఉపయోగించిన కారు.ప్రధాన నిందితుడు హైదర్ నజీర్

ఉద్యానవన నగరంగా పేరుపొందిన బెంగళూరు అత్యాచారాల విషయంలో ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీని మించిపోతోంది.

బెంగళూరు: ఉద్యానవన నగరంగా పేరుపొందిన బెంగళూరు  అత్యాచారాల విషయంలో  ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీని మించిపోతోంది. కామాంధులు కొందరు ఓ పీజీ విద్యార్థిని (22)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. స్థానిక ఫ్రేజర్ టౌన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న విద్యార్థిని, శుక్రవారం రాత్రి   స్నేహితుడితో కలసి ఓ హోటల్‌లో భోజనం చేసింది. ఆ తరువాత  11.45 గంటలకు హోండా సిటీ కారులో తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ వద్దకు వచ్చింది. అక్కడే ఇద్దరూ కారులో కూర్చుని 10 నిమిషాలు మాట్లాడుకున్నారు. అదే సమయంలో స్కోడా కారు(కేఏ 03-ఎంజే 8433)లో నలుగురు ఆగంతకులు అక్కడికి చేరుకుని, యువతిని బలవంతంగా కారు నుంచి బయటకు లాగారు. ఆమెతో పాటు స్నేహితుడు ఎదురు తిరిగాడు. తాము పోలీసులమని, తమ వెంట రాకపోతే ఇక్కడే కాల్చి వేస్తామని ఆగంతకులు బెదిరించారు. యువతితో పాటు ఆమె స్నేహితుడిని స్కోడా కారులోకి లాక్కున్నారు.

నలుగురు అదే కారులో అక్కడి నుంచి బయలుదేరగా, మరో ఇద్దరు హొండా సిటీ కారులో అనుసరించారు. కాసేపు అటు ఇటు తిరిగి చివరికి కాక్స్‌టౌన్ సమీపంలోని రైలు పట్టాల దగ్గర కార్లను పార్కు చేశారు. ఇద్దరు దుండగులు యువతి స్నేహితుడి గొంతు మీద కత్తులు పెట్టి చంపేస్తామని బెదిరించారు.  మిగిలిన నలుగురు యువతి మీద అక్కడే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా 50 వేల రూపాయలు ఇస్తేనే వదిలి పెడతామని బెదిరించారు. ఒక మహిళకు ఫోన్ చేసి, మహిళా కానిస్టేబుల్ లైన్‌లో ఉన్నారు, మాట్లాడాలంటూ బలవంత పెట్టారు. వేకువ జామున నాలుగు గంటల వరకు నగరంలో వారిని కారులోనే తిప్పారు. చివరికి యువతి స్నేహితుడి దగ్గర ఉన్న పర్సును లాక్కుని పారిపోయారు. స్నేహితుడు ఆమెను ఇంటికి తీసుకు వెళ్లాడు. ఆమె కోలుకున్న తరువాత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అమానుషంగా హింసించారు
 
'' నేను స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో హఠాత్తుగా వచ్చిన ఆగంతకులు మమ్మల్ని కారులోకి లాక్కున్నారు. స్నేహితుడు అడ్డు పడుతున్నా పట్టించుకోలేదు. కారులోనే నా షర్టు చింపేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. కారులో హైదర్ నజీర్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే సమయంలో మరో ఇద్దరు అసహజ రతికి పాల్పడ్డారు. చివరగా రైలు పట్టాల దగ్గరకు తీసుకు వెళ్లి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు’'  అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించింది.

సోమవారం రాత్రి ఫ్రేజర్‌టౌన్ సమీపంలో స్కోడా కారును గుర్తించిన యువతి స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు హైదర్ నజీర్‌ను అరెస్టు చేశారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు సీఐల నేతత్వంలో మిగిలిన ఆగంతకుల కోసం గాలిస్తున్నారు. స్కోడా కారును స్వాధీనం చేసుకున్నట్లు తూర్పు విభాగం డీసీపీ సతీష్ కుమార్ మంగళవారం తెలిపారు. పులకేశి నగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement