అలిగితే.. పదవి! | Sakshi
Sakshi News home page

అలిగితే.. పదవి!

Published Sat, Apr 19 2014 8:14 AM

అలిగితే.. పదవి! - Sakshi

కాంగ్రెస్‌లో బుజ్జగింపుల రాజకీయం
 
సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు దక్కక అసంతృప్తితో ఉన్న నాయకులకు ఆ పార్టీ నాయకత్వం పదవులు ఇచ్చి బుజ్జగిస్తోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడిన నాయిని రాజేందర్‌రెడ్డికి కాంగ్రెస్ జిల్లా ఇన్‌చార్‌‌జ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న దొంతి మాధవరెడ్డి రాజీనామా చేయడంతో ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఈ సామాజికవర్గం నుంచి ఇబ్బంది ఎదురవుతుందని పార్టీ భావించింది. జరగబోయే నష్టాన్ని తగ్గించేందుకు మాధవరెడ్డి సామాజిక వర్గానికే చెందిన నాయిని రాజేందర్‌రెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవి అప్పగించింది.
 
నాయినికి ఈ పదవి అప్పగించడం.. ఈ వర్గంలో అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నమేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నాయిని రాజేందర్‌రెడ్డిని ఇన్‌చార్‌‌జ అధ్యక్షుడిగా నియమించడంపై పార్టీలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాయినిపై నమ్మకం ఉంటే పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించేవారని... ఇది లేకపోవడంతో ఇన్‌చార్‌‌జ్జ అధ్యక్షుడిగా నియమించారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.

అరుుతే మాధవరెడ్డి సైతం ఇన్‌చార్‌‌జ అధ్యక్షుడిగానే ఉన్నారని నాయిని వర్గీయులు అంటున్నారు. నాయిని రాజేందర్‌రెడ్డి టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్నప్పుడు కాంగ్రెస్ పెద్దల నుంచి పలకరింపు కూడా లేకపోవడంతో... నాయిని టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పెద్దలు మాట్లాడడంతో తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని నాయిని స్పష్టం చేశారు. దొంతి మాధవరెడ్డి ప్రతిరోజూ పొన్నాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
 
నర్సంపేట అసెంబ్లీ టికెట్‌ను కేటాయించి బీఫారం ఇవ్వకుండా... చివరి నిమిషంలో జేఏసీ నేత కత్తి వెంకటస్వామికి అభ్యర్థిత్వం కట్టబెట్టడంతో డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగారు. ఆ తర్వాత ఆయన డీసీసీ అధ్యక్ష పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు ఇలా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీలో ఉండడం ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. పొన్నాల లక్ష్మయ్య తనకు టిక్కెట్ రాకుండా కుట్ర చేశారని మాధవరెడ్డి విమర్శిస్తున్నారు. ఈ నష్టాన్ని ఎదుర్కొనేందుకు నాయినికి డీసీసీ పదవి అప్పగించినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement