పార్టీలో గుర్తింపు లేదని.. నిప్పంటించుకున్నాడు

పార్టీలో గుర్తింపు లేదని.. నిప్పంటించుకున్నాడు

- టీఆర్‌ఎస్‌ తాండూరు పట్టణ మాజీ అధ్యక్షుడి ఆత్మహత్యాయత్నం

మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే ఘటన పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు

 

తాండూరు: పార్టీలో తనకు సరైన గుర్తింపు లేద ని.. నామినేటెడ్‌ పదవులు కూడా దక్కలేదంటూ మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరులో కలకలం సృష్టిం చింది. బుధవారం పట్టణంలో టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే.. మొదటగా తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ కోరగా.. ఇందుకు మంత్రి అంగీకరించారు.  



అయూబ్‌ఖాన్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి తాను కష్టపడి పనిచేశానని,  రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేశానని,  టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా కూడా పని చేసినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం సాధించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటైనా కూడా తమలాంటి ఉద్యమకారులకు గుర్తింపు లేదని అయూబ్‌ఖాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలో వచ్చిన వారికి పదవులు దక్కుతున్నాయని, ఉద్యమ కారులకు నామినేటెడ్‌ పదవులు కూడా ఇవ్వడం లేదని చెప్పి తన ప్రసంగం ముగించి వెళ్లి కార్యకర్తల మధ్యలో కూర్చున్నాడు.



అనంతరం సభ జరుగుతుండగా అయూబ్‌ఖాన్‌ ఒక్కసారిగా లేచి అప్పటికే తన వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో తల, ఛాతీ భాగాలు తీవ్రంగా కాలి పోయాయి. వెంటనే అక్కడున్న నాయకులు, కార్యకర్తలు, పోలీసులు మంటలను ఆర్పి జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానిక వైద్యులు ప్రథమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు.

 

ఉలిక్కిపడ్డ మంత్రి మహేందర్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌లో తనకు న్యాయం జరగడం లేదంటూ అయూబ్‌ఖాన్‌ ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకోవడంతో అక్కడే ఉన్న మంత్రి మహేందర్‌రెడ్డి ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో ఆయన షాక్‌కు గురయ్యారు. ఆ వెంటనే జిల్లా ఆస్పత్రికి చేరుకుని, వైద్యులతో మాట్లాడారు. అయూబ్‌ ఖాన్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించగా, మంత్రి మహేందర్‌రెడ్డి కూడా వెళ్లారు.  
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top