ప్లీనరీలో 11 తీర్మానాలు | Sakshi
Sakshi News home page

ప్లీనరీలో 11 తీర్మానాలు

Published Mon, Apr 20 2015 2:17 AM

ప్లీనరీలో 11 తీర్మానాలు

టీఆర్‌ఎస్ తీర్మానాల కమిటీ నిర్ణయం
కేసీఆర్ నేతృత్వంలో సుదీర్ఘ సమావేశం
పార్టీ భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశంపై చర్చ

సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24న జరగనున్న టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీలో 11 తీర్మానాలు చేయాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నేతృత్వంలో పార్టీ తీర్మానాల కమిటీ ఆది వారం రాత్రి కమిటీ చైర్మన్ కె.కేశవరావు నివాసంలో 4 గంటలకుపైగా సమావేశమైంది.

కమిటీలో సభ్యులుగా ఉన్న ఎంపీ బి.వినోద్‌కుమార్, ఢిల్లీలో రాష్ర్ట ప్రభుత్వ ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి, దేశపతి శ్రీనివాస్ తదితరులు దీనికి హాజరయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యక్రమాలకు దిశానిర్దేశం చేసే దిశగా  తీర్మానాలు ఉండాలని, ఉద్యమ పాత్ర నుంచి బయటపడి పరిపాలనపై దృష్టి పెట్టేవిధంగా నిర్మాణాత్మక దృష్టితో వ్యవహరించాలని కమిటీ అభిప్రాయపడింది. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాల్సి ఉందని చర్చించారు.

ఈ సందర్భంగా ప్లీనరీ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఇప్పటివరకు జరిగిన పార్టీ సభ్యత్వం, సంస్థాగత ఎన్నికల ప్రక్రియను స్టీరింగ్ కమిటీ చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్లీనరీలో వివరిస్తారు. దీనిపై కేశవరావు కూడా ప్రసంగిస్తారు. తర్వాత హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను పూర్తిచేస్తారు. పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికవనున్న కేసీఆర్ ప్రసంగిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం 11 తీర్మానాలు చేస్తారు.

రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్ నిర్వహించాల్సిన పాత్ర-ఉద్యమకాలంలో పనిచేసిన వారికి ప్రభుత్వంలో అవకాశాలు, వ్యవసాయం-సాగునీరు, పంచాయతీరాజ్ సంస్థలు-వాటర్‌గ్రిడ్, విద్యుత్‌రంగం, సంక్షేమం, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు-విధులు-కార్యక్రమాలు, మిషన్ కాకతీయ, హరితహారం, విశ్వనగరంగా హైదరాబాద్, పట్టణాల్లో మౌలిక వసతులు-సౌకర్యాల కల్పన, గిరిజనులు-దళితులు-మైనారిటీల అభివృద్ధి(కళ్యాణలక్ష్మి, దళితులకు భూ పంపిణీ), తెలంగాణ వారసత్వ-సాంస్కృతిక పునరుజ్జీవం (భాష, యాస పరిరక్షణ) వంటి ముఖ్యమైన తీర్మానాలు ఉంటాయి. ఒక్కో తీర్మానంపై 15-20 నిమిషాలకు మించకుండా ప్రసంగాలు ఉంటాయి. ఎక్కువగా పార్టీ నేతలకే మాట్లాడే అవకాశమివ్వాలని నిర్ణయించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మహిళా నేతలకు తదితరులు ప్రసంగిస్తారు.

Advertisement
Advertisement