ఆశలు సమాధి.. ముక్కలు ముక్కలుగా మీనా!

ఆశలు సమాధి.. ముక్కలు ముక్కలుగా మీనా! - Sakshi


చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లిలో గురువారం సాయంత్రం బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. అయితే అరవై గంటలకు పైగా శ్రమించినా కనీసం పాప మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించలేకపోవటం విచారకరం. కేవలం పాప అవశేషాలు ఒక్కొక్కటిగా చూడాల్సి రావడంతో కడసారి చూపును సైతం కోల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. మరోవైపు గురువారం రాత్రి నుంచి అత్యాధునిక పరికరాలతో బయటకు తీసేందుకు సిబ్బంది చేసిన యత్నాలు ఫలించలేదు. శుక్రవారం బోరుబావిలోని మోటారు తీసినప్పటి నుంచి జాడ కనబడకుండా పోయింది. శనివారం ప్రత్యేక లేజర్‌ కెమెరాలతో పరిశీలించినా, అత్యాధునిక మ్యాట్రిక్స్‌ వాటర్‌ప్రూఫ్‌ కెమెరాను తెప్పించి.. 210 అడుగుల లోతు వరకు అన్వేషించినా చిన్నారి ఆచూకీ కానరాలేదు.



ఆదివారం వేకువ జాము నుంచి ఎయిర్ ప్రెషర్ ద్వారా బయటకు తీయాలని చేసిన చివరి ప్రయత్నం కొంత మేలని అధికారులు భావించారు. అయితే ఫ్లషింగ్‌తో మృతదేహాన్ని బయటకు తీయాలని చూడగా మొదటగా బోరు బావి నుంచి దుర్వాసన వచ్చింది. ఆపై చిన్నారి దుస్తులు బయటకు వచ్చాయి. ఇది చూడగానే చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆపై మరికాసేపు ఫ్లషింగ్ చేయగా చిన్నారి మీనా అవశేషాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం చూపరులను సైతం కంటతడి పెట్టించింది. ఆ తల్లిదండ్రులకు తమ ముద్దుల చిన్నారి రూపాన్ని కడసారి చూపు సైతం దక్కలేదని స్థానికులు ఆవేదన చెందారు. దాదాపు మూడు రోజులుగా నీళ్లు, మట్టిలో చిన్నారి కూరుకుపోవడంతో చనిపోయి మృతదేహం కుళ్లిపోయింది.



శవ పరీక్ష కోసం చిన్నారి అవశేషాలను చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. పనిచేయని బోరుబావులు మూసివేయకుండా ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని ఘటనా స్థలంలో ఉన్న మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. చిన్నారి కుటంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ప్రమాదానికి కారణమైన బోరు యాజమాని మల్లారెడ్డిపై 336 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బోరు బావిని నిర్లక్ష్యంగా వదిలేసిన మల్లారెడ్డిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రఘునందన్‌రావు చెప్పారు.

సంబంధిత కథనాలు

ఆ నిర్ణయమే కొంప ముంచింది!

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top