భలే ప్లాన్ 'బాసూ'!

భలే ప్లాన్ 'బాసూ'! - Sakshi


- తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు రూ.75 కోట్లు

- ఏపీలో స్థానిక ప్రజాప్రతినిధుల కోసం మరో 75 కోట్లు

- డబ్బు సమకూర్చే బాధ్యత ఇద్దరు రాజ్యసభ సభ్యులకు

- ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పారిశ్రామికవేత్తల నుంచి వసూలు

- రేవంత్ పట్టుబడటంతో బెడిసికొట్టిన బాబు వ్యూహం

 

హైదరాబాద్:
తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోవాలి.. తెలంగాణలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనాలి, ఏపీలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు డబ్బు వెదజల్లాలి.. ఇందుకోసం రెండు చోట్లా రూ.75కోట్ల చొప్పున రూ.150కోట్లు కావాలి.. ఆ సొమ్మును ఏపీ ప్రభుత్వం నుంచి ఆయాచిత లబ్ధి పొందిన కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల నుంచి వసూలు చేయాలి.. ఇదీ స్థూలంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పన్నాగం. ఇరవై రోజుల క్రితమే రూపకల్పన చేసిన పక్కా ప్లాన్ ఇది.



అనుకున్నదే తడవుగా తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు రాజ్యసభ సభ్యులకు ఆ సొమ్ము సేకరించే బాధ్యతను అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రాయితీలు పొందిన, ప్రాజెక్టులు దక్కించుకున్న ముగ్గురు కాంట్రాక్టు సంస్థల అధినేతలు, ఇద్దరు పారిశ్రామికవేత్తలను గుర్తించి, వారితో చర్చలు జరిపారు. రూ.30 కోట్ల చొప్పున ముట్టజెప్పేలా వారితో రహస్య ఒప్పం దం కుదుర్చుకున్నారు. తెలంగాణలో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు గాలం వేశారు. ముగ్గురు చేజారినా.. ఐదుగురిని పక్కా చేసుకుని, వారి డిమాండ్‌ను బట్టి రూ.75 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. అడ్వాన్సుగా కొంత ముట్టజెప్పడం కోసం ఇద్దరు పారిశ్రామికవేత్తల నుంచి రూ.5 కోట్ల చొప్పున ముందే తీసుకునేందుకు సిద్ధమయ్యారు.



బెడిసికొట్టిన వ్యూహం

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేసేందుకు రూ.5 కోట్ల ఒప్పందంలో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు అడ్వాన్సుగా రూ.50 లక్షలు ఇవ్వజూపుతూ రేవంత్‌రెడ్డి పట్టుబడటంతో చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టింది. ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఏసీబీ చేసిన విచారణలో.. చంద్రబాబు, ఆయన సన్నిహితులైన ఇద్దరు రాజ్యసభ సభ్యుల పన్నాగం మొత్తం బయటపడింది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమంగా గెలవాలన్న వ్యూహం వెల్లడైంది.



బంజారాహిల్స్‌లోని ఓ బ్యాంక్ శాఖ నుంచి డ్రా చేసిన డబ్బును రేవంత్ తెచ్చినట్లు తేలడంతో ఆ బ్యాంకు నుంచి 29, 30 తేదీల్లో పెద్ద ఎత్తున డబ్బు డ్రా చేసిన 40 మందిని గుర్తించారు. వారిలో టీడీపీతో సన్నిహితంగా ఉంటే ఐదారుగురు కాంట్రాక్టర్లు, అరడజను మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వీరిలో చంద్రబాబుతో, ఆయన వెన్నంటి ఉండే ఇద్దరు రాజ్యసభ సభ్యులతో సన్నిహితంగా మెలిగే ఇద్దరు పారిశ్రామికవేత్తలు, ఓ కాంట్రాక్టు సంస్థ అధినేతను గుర్తించి వారి కాల్‌డేటాను ఏసీబీ అధికారులు విశ్లేషించారు. ఐదారుగురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబుకు సన్నిహితులైన ఆ ఇద్దరు రాజ్యసభ సభ్యులు నిత్యం సంప్రదింపులు జరిపినట్లు వెల్లడైంది.



ఓ కాంట్రాక్టు సంస్థ అధినేతతో ఏపీకి చెందిన మంత్రి కూడా అనేకమార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు ఏసీబీ గుర్తించింది. అసలు వీరితో టీడీపీ రాజ్యసభ సభ్యులు ఎందుకు మాట్లాడారని ఓ పారిశ్రామికవేత్త వద్ద ఏసీబీ విచారణాధికారి ఒకరు ప్రస్తావించగా.. ఆయన ఆఫ్ ద రికార్డుగా బాబు వ్యూహాన్ని బట్టబయలు చేసినట్లు తెలిసింది. కేసుకు అవసరమైన ఆధారాన్ని బట్టి ఆ పారిశ్రామికవేత్త వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.



లబ్ధి చేకూర్చినందుకే

ఏపీ ప్రభుత్వం ముగ్గురు కాంట్రాక్టు సంస్థల అధినేతలు, ఇద్దరు పారిశ్రామికవేత్తలకు అయాచిత లబ్ధి చేకూర్చినందుకే వారు డబ్బు సమకూర్చడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. వారిలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన ఓ ప్రముఖుడు కూడా ఉన్నారు. నిజాయితీ రాజకీయాలు చేస్తానని పదేపదే చెప్పుకొనే చంద్రబాబు, తనకు బలం లేనిచోట పోటీకి పెట్టి ప్రజాప్రతినిధులను ప్రలోభపర్చుకోవడానికి ఎన్ని ఎత్తుగడలు వేశారో తెలుసుకుని ఏసీబీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ  వ్యవహారా న్ని వీలైనంత త్వరగా ఛేదించి బయటపెట్టాలని ఏసీబీ భావిస్తోంది. చంద్రబాబును విచారించే సమయానికి డబ్బు సమకూర్చిన వారి వివరాలతో సిద్ధంగా ఉండాలని భావిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top