అమెరికాను ఓవర్‌టేక్‌ చేసిన భారత్‌

అమెరికాను ఓవర్‌టేక్‌ చేసిన భారత్‌ - Sakshi

అగ్రరాజ్యం అమెరికాను భారత్‌ ఓవర్‌టేక్‌ చేసింది. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు, ఎక్కువ యాక్టివ్‌ యూజర్లున్న అతిపెద్ద దేశంగా భారత్‌ అవతరించింది. మొత్తం 241 మిలియన్‌ మంది యాక్టివ్‌ యూజర్లతో భారత్‌ ఈ స్థానాన్ని దక్కించుకుంది. అమెరికాలో 240 మిలియన్‌ మందే యాక్టివ్‌ యూజర్లున్నారు. కంపెనీ ఇటీవలే 2 బిలియన్‌ యూజర్ల మార్కును చేధించినట్టు వెల్లడించింది. ఈ మార్కును చేధించిన కొన్ని రోజుల్లోనే టాప్‌ దేశాల ర్యాంకింగ్స్‌లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఫేస్‌బుక్‌ను ఎక్కువ యాక్టివ్‌ యూజర్లున్న దేశాల్లో అమెరికాను భారత్‌ అధిగమించిందని నెక్ట్స్‌ వెబ్‌ గురువారం వెల్లడించింది. అడ్వర్‌టైజర్ల కోసం సోషల్‌ మీడియా దిగ్గజం గణాంకాలను ఈ పోర్టల్‌ విడుదల చేసింది. భారత్‌లో ఫేస్‌బుక్‌ యాక్టివ్‌ యూజర్లు రెండింతలు పైగా పెరుగుతున్నారని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

 

గత ఆరునెలల కాలంలోనే భారత్‌లో యాక్టివ్‌ యూజర్లు 27 శాతం పెరిగారు. ఇదే కాలంలో అమెరికాలో 12 శాతం వృద్ధి మాత్రమే కనిపించింది. ఎక్కువమంది యాక్టివ్‌ యూజర్లున్నప్పటికీ, భారత్‌లో ఫేస్‌బుక్‌ వ్యాప్తి మాత్రం తక్కువగానే నమోదైంది. జూన్‌ నెలలో మొత్తం జనాభాలో కేవలం 19 శాతం మంది ప్రజలే ఫేస్‌బుక్‌ను వాడారు. ఫేస్‌బుక్‌ వాడకంలోనూ లింగ అసమానత కనిపిస్తోంది. మూడు క్వార్టర్స్‌గానూ యాక్టివ్‌ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్‌లో పురుషులే ఆధిక్యంలో ఉన్నారు. దీనికి భిన్నంగా అమెరికాలో 54 శాతం మంది యాక్టివ్‌ యూజర్లు మహిళలే ఉన్నట్టు తెలిసింది. భారత్‌లో ఫేస్‌బుక్‌ వాడుతున్న సగానికి పైగా యూజర్లు 25 ఏళ్ల లోపు వారే. 
Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top