మెస్సీ పన్ను ఎగవేత నిజమే | Sakshi
Sakshi News home page

మెస్సీ పన్ను ఎగవేత నిజమే

Published Thu, May 25 2017 1:13 AM

మెస్సీ పన్ను ఎగవేత నిజమే - Sakshi

మాడ్రిడ్‌: అర్జెంటీనా సాకర్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ మోసపూరితంగానే పన్ను ఎగవేతకు పాల్పడ్డాడని స్పెయిన్‌ సుప్రీం కోర్టు విచారణలో తేల్చింది. దీంతో మెస్సీ, అతని తండ్రి జార్జ్‌ హరసియో మెస్సీపై రూ. 14.57 కోట్ల (2.25 మిలియన్‌ డాలర్లు) జరిమానా, 21 నెలల జైలు శిక్ష విధించింది. మెస్సీ ఎండార్స్‌మెంట్ల ద్వారా ఆర్జించిన మొత్తాలపై వివిధ మార్గాల ద్వారా పన్ను ఎగ్గొట్టాడు. రూ. 32 కోట్ల మేర పన్ను మోసాలకు పాల్పడినట్లు అతనిపై గతేడాది జూలైలో ఆరోపణలొచ్చాయి.

అతని ఆదాయ వ్యయాలను స్వయంగా మెస్సీ తండ్రి చూసేవాడు. అయితే తన తండ్రి సక్రమంగానే పన్ను కడుతున్నట్లు తాను భావించానని అందువల్లే అటువైపు కన్నెత్తి చూడలేకపోయానని అప్పీలుకు వెళ్లిన మెస్సీ విన్నవించాడు. అయితే ఇందులో వాస్తవం లేదని బుధవారం సుప్రీం కోర్టు నిర్ధారించి... జరిమానాతో పాటు శిక్ష ఖరారు చేసింది. అయితే స్పెయిన్‌ చట్టాల ప్రకారం క్రిమినల్‌ శిక్ష కాని తొలి నేరానికి జైలు శిక్షను సస్పెండ్‌ చేయవచ్చు. రెండేళ్ల లోపు జైలు శిక్షకు ఈ మినహాయింపు ఉంది. దీంతో ఇప్పుడు మెస్సీ, అతని తండ్రి కేవలం జరిమానాతో గట్టెక్కవచ్చు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement