ముహూర్తం.. ముందరున్నదీ.. | Sakshi
Sakshi News home page

ముహూర్తం.. ముందరున్నదీ..

Published Wed, Mar 13 2019 1:01 PM

Election Candidates Are Following Muhurtam For Nominations - Sakshi

సాక్షి, భీమవరం: ఎన్నికల షెడ్యూలు విడుదల కావడం, నామినేషన్లు వేయడానికి రోజులు దగ్గర పడుతుండటంతో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలిచే రాజకీయ నాయకులు నామినేషన్‌ వేయడానికి మంచి ముహుర్తాల కోసం పండితులు, సిద్ధాంతుల వద్దకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు చిన్నపాటి పార్టీల నాయకులు, స్వతంత్య్ర అభ్యర్థులకు ఎన్నికల సెంట్‌మెంట్‌ ఎక్కువగానే ఉంటుంది. ప్రధానంగా నామినేషన్‌ వేయడానికి మంచి ముహుర్తంతోపాటు ప్రచారం ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రారంభించాలనే సెంటిమెంట్‌ను వీరంతా ఫాలోఅవుతారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకూ నామినేషన్‌ వేసేందుకు అవకాశం ఉంది.

 ఈ ఎనిమిది రోజుల్లో అభ్యర్థుల జాతకం ప్రకారం తిథి, నక్షత్రం ఆధారంగా సిద్ధాంతులు మంచిరోజులు నిర్ణయిస్తారు. ఈ పద్ధతి ఎప్పటినుంచో ఆచరణలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా మంచి ముహుర్తాల కోసం అన్వేషిస్తున్నారు. ఈసారి నామినేషన్లకు ఎనిమిది రోజులు మాత్రమే గడువు ఉండగా వాటిలో 18వ తేదీ ద్వాదశి, 19వ తేదీ త్రయోదశి, 22వ తేదీ విదియ, 25వ తేదీ పంచమి మంచి రోజులుగా లెక్కలు వేస్తున్నారు. నామినేషన్లకు చివరి రోజు అయిన 25వ తేదీ పంచమి సోమవారం బలమైన ముహూర్తం ఉండటంతో ఆ రోజునే ఎక్కువ మంది నామినేషన్లు వేస్తారని పండితులు చెబుతున్నారు.

అయితే పోటీచేసే అభ్యర్థి పేరు, జన్మనక్షత్రం, జాతకం ప్రకారమే ముహూర్తం నిర్ణయించాల్సి ఉంటుందంటున్నారు. మొత్తం మీద ఈ నాలుగు రోజులు పండితులు, సిద్ధాంతులను రాజకీయనాయకులు ఊపిరి సలపనివ్వరని తెలుస్తోంది. నామినేషన్‌ ముహూర్తంతోపాటు ఎన్నికల ప్రచారం ఎక్కడి నుంచి ఎప్పుడు ప్రారంభించాలనే దానికి కూడా ముహూర్తాలు తప్పవంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం నియోజకవర్గానికి ఈశాన్యం నుంచి ప్రారంభించడం పరిపాటి. అయితే కొందరు నాయకులు మాత్రం గతంలో ప్రచారం ప్రారంభించిన ప్రాంతం సెంటిమెంట్‌గా ఈసారి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సెంటిమెంట్‌ ఎవరిని విజేతలను చేస్తుందో చూడాలి మరి.   

Advertisement
 
Advertisement