నిజమైన ఏరువాక ఎప్పుడు?

నిజమైన ఏరువాక ఎప్పుడు? - Sakshi


గడచిన 17 సంవత్సరాలలో 3,00,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అవకాశం దొరికితే పొలాలను వదిలి పోవాలని ఎదురుచూస్తున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. పరిస్థితులు ఇలా ఉన్నా వ్యవసాయ రంగానికి ఎలాంటి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడమంటే రైతులను పస్తులకు గురిచేయడానికేనని స్పష్టమవుతుంది. ఇదే వలసలను ప్రోత్సహిస్తుంది.

 

 మరికొన్ని గంటలలోనే 2014వ సంవత్సరానికి ప్రపంచం వీడ్కోలు పలుకుతోంది. కొత్త ఏడాదికి చోటిస్తూ 2014 చరిత్రలో అంతర్భాగం కానున్నది. వార్తా పత్రికలు, టీవీ చానళ్లు పాత సంవత్సరంలోని మైలురాళ్లను గురించి గుర్తు చేయ డంలో, సంఘటనలను సమీక్షించడంలో హడావుడిగా ఉన్నాయి. సంవత్సరాం తపు నివేదికలను అందించడంలో తలమునకలై ఉన్నాయి. పత్రికలు తమ కాల మ్‌ల నిండా, చానళ్లు తమ సమయమంతా ఇందుకే కేటాయిస్తున్నాయి. దురదృష్టం ఏమిటంటే, ఏ వార్తాపత్రిక తిరగేసినా, ఏ చానల్ తిప్పినా సెలవంటూ వెళ్లిపోతున్న ఈ సంవత్సరం రైతుకు మిగిల్చిన విషాదం గురించి, ఈ ఏడాదిలో కూడా కొనసాగిన వ్యవసాయ సంక్షోభం గురించి ప్రస్తావించడం మాత్రం కని పించదు. అదేం చిత్రమో! రైతులతో, నాగళ్లతో నిండి ఉండే ఆ మరో భారతం లేదా రైతు భారతం అనేది లేనట్టే ప్రసార మాధ్యమాలు వ్యవహరిస్తున్నాయి.

 

 సేద్యం పట్ల ఎందుకీ వివక్ష

 ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ వ్యవసాయం 125 కోట్ల భారతీయులలో 70 శాతం మందికి ప్రధాన జీవికగా ఉంది. ఎంతటి దుర్భర పరిస్థితులలో మనుగడ సాగిస్తున్నప్పటికీ, గ్రామీణ ఆర్థికవ్యవస్థకు ఇప్పటికీ వ్యవసాయ రంగమే ఇరు సుగా పనిచేస్తున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. అయినా చాలాకాలంగా నేను చెబుతున్నట్టు దేశ ఆర్థిక రాడార్ తెరమీద నుంచి వ్యవసాయం అదృశ్యమై పోతోంది. ప్రస్తుతం మీడియాలో జరుగుతున్నది కూడా అదే. వ్యవసాయానికి కాస్త కూడా స్థలం దక్కడంలేదు. ఆర్థికవ్యవస్థ తీరును చూస్తుంటే, మిగిలిన సేద్యపు జాడలను కూడా సంపూర్ణంగా ధ్వంసం చేయడమే ధ్యేయమన్నట్టు కనిపిస్తోంది.

 

  వాస్తవానికి భారత ఆర్థికవ్యవస్థలో సేద్యం సత్ఫలితాలను చూపుతున్న రంగమే. ప్రభుత్వాలు ఇంతగా నిర్లక్ష్యం వహిస్తున్నా, నాలుగు శాతం వృద్ధిరేటుతో వెలుగొందుతోంది. ఇతోధిక దిగుబడి కోసం రైతాంగం చెమటోడుస్తూనే ఉంది. రుతుపవనాలు ఆలస్యమవుతున్నా, ఎవరూ ఊహిం చని రీతిలో వారు విజయాలు సాధిస్తున్నారు. అయినప్పటికీ ఆర్థికవేత్తల పక్షపాత అవగాహనకు రైతులు బలవుతున్నారు. ఆహారోత్పత్తుల స్వయం సమృద్ధి దేశసార్వభౌమత్వానికి మూలస్తంభంగా ఉంటుందన్న వాస్తవాన్ని నిరాకరిస్తున్నది కూడా ఆ పక్షపాత అవగాహనే. చౌకగా లభించే దిగుమతుల మీద సుంకాలు ఇంకా తగ్గాలని, అలాంటి దిగుమతులకు మరిన్ని రాయితీలు కల్పించాలని కొందరు ఆర్థికవేత్తలు నిస్సిగ్గుగా గగ్గోలుపెడుతున్నారు. ఇందు వల్లే ఆహారద్రవ్యోల్బణం పెరిగిపోతోందని కొన్ని పత్రికలు, చానళ్లు ఆర్థికవేత్తల వాదనలతో గొంతుకలుపుతున్నాయి.

 

 కనుమరుగవుతున్న వ్యవసాయం

 నానాటికీ పతనమవుతున్న రైతుల, వ్యవసాయ రంగ పరిస్థితుల మీద నివేదికల మీద నివేదికలూ; అధ్యయనాల మీద అధ్యయనాలూ వచ్చాయి. అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రం (సీఎస్‌డీఎస్) రూపొందించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ‘భారతీయ కర్షకుల స్థితి గతులు’ అన్న శీర్షికతో వచ్చిన ఈ అధ్యయనం, దేశంలో 76 శాతం ప్రజలు సేద్యాన్ని వదలి వెళ్లపోవడానికి అవకాశం కోసం చూస్తున్నారని వెల్లడించింది. ఇంకా, 58 శాతం రైతులు పస్తులు పడుకుంటున్నారని పేర్కొన్నది. పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం వరి, గోధుమ, ఇతర పంటలకు ఇచ్చే గిట్టు బాటు ధరను (క్వింటాల్‌కు) కేవలం రూ.50 పెంచింది. మొత్తంగా ద్రవ్యో ల్బణం పెరిగిన కారణంగా చుక్కలనంటుతున్న ధరల మధ్య ఈ పెంపుదల రైతుకు ఏ మూలకు?

 

 వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉండడం ఒక్కటే కాదు, త్వరిత గతిన  క్షీణించిపోతోందన్నది కూడా వాస్తవం. వ్యవసాయ కుటుంబాల పరిస్థితుల మీద సర్వే అంచనాల (2012-13) పేరుతో జాతీయ శాంపిల్ సర్వే సంస్థ నిర్వహించిన అధ్యయనం ఈ సంగతినే వెల్లడించింది. ఆ సర్వే నన్నేమీ ఆశ్చర్యపరచలేదు. మన వ్యవసాయ రంగాన్ని మరణశయ్య మీదకు చేర్చాలని 1996 ప్రాంతంలో ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ఆదేశాలు అక్షరాలా అమలు జరుగుతున్నాయి మరి. ఆ సంవత్సరమే ప్రపంచ బ్యాంకు వేసిన అంచనాను కూడా గుర్తు చేసుకోవాలి. మరో ఇరవై ఏళ్ల కల్లా, అంటే 2015వ సంవత్సరానికి భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస పోయే వారి సంఖ్య గణనీయంగా ఉంటుందని అది అంచనా కట్టింది. ఆ వలస జనాభా ఎంత అంటే, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఉమ్మడి జనాభాతో సమానమని కూడా ప్రపంచ బ్యాంకు లెక్క చెప్పింది. ఆ మూడు దేశాల ఉమ్మడి జనాభా 20 కోట్లు. అలాగే గ్రామీణ ప్రాంతాలను వీడి వెళ్లే వారి సంఖ్య 2015 నాటికి 40 కోట్లు ఉంటుందని కూడా ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. వ్యవసాయం ఆర్థికంగా ఎంతమాత్రం లాభసాటి కాదు అన్న వాతావరణాన్ని సృష్టించడం ద్వారా మాత్రమే ఈ వలసలు సాధ్యమవుతాయి.

 

  రైతులు, రైతు కూలీలు పొలాలను వదిలి ఆత్మాభిమానం చంపుకుని పట్టణాలలో దొరికే చిన్నాచితకా పనులు చేసుకోవడానికి వెళ్లిపోతారు. 2008లో ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ప్రపంచ అభివృద్ధి నివేదికలో వివరాలు ఇంకా దారుణంగా ఉన్నాయి. భూసేకరణ సజావుగా సాగడానికి వీలుగా గ్రామీణ భారత ప్రజలను పొలాల నుంచి, సేద్యం నుంచి బయటకు పంపే కార్యక్రమం వేగవంతం కావాలని ప్రపంచ బ్యాంకు అందులో సూచించింది. అలాగే గ్రామీణ ప్రాంత యువకులను పరిశ్రమలలో కార్మికులుగా మలచడానికి వీలైన శిక్షణ కార్యక్రమాలను కూడా చేపట్టాలని ప్రపంచ బ్యాంకు సలహా ఇచ్చింది. గడచిన 17 సంవత్సరాలలో 3,00,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అవకాశం దొరికితే పొలాలను వదిలిపోవాలని ఎదురుచూస్తున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. పరిస్థితులు ఇలా ఉన్నా వ్యవసాయ రంగానికి ఎలాంటి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడమంటే రైతులను పస్తులకు గురిచేయడానికేనని స్పష్టమవుతుంది.

 

 ఇదే వలసలను ప్రోత్సహిస్తుంది. రైతుల ఆత్మహత్యలను నిరోధించేందుకు పెద్దగా ప్రయత్నమేదీ చేయకపోవడం, పైన చెప్పుకున్నట్టు 58 శాతం రైతులు పస్తులు ఉన్నా లక్ష్యపెట్టక పోవడం ఈ వలసలను ప్రోత్సహించడానికేనని కూడా అర్థమవుతుంది. వారికి వలస పోవడం తప్ప వేరే మార్గం లేకుండా చేయడమే. 2011వ సంవత్సరం జనాభా లెక్కలు ఏం చెబుతున్నాయో కూడా పరిశీలిద్దాం. రోజుకు 2,400 మంది రైతులు వ్యవ సాయాన్ని వదిలి పట్టణాలకు, నగరాలకు వలసపోతున్నారని ఆ నివేదిక వెల్లడించింది. కాని కొన్ని స్వతంత్ర సర్వే సంస్థలు ఇస్తున్న లెక్కల ప్రకారం ఏటా 50 లక్షల మంది ప్రజలు నగరాలకు వలస వెళుతున్నారు. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రఘురామ్ రాజన్ పదవీ బాధ్యతలు స్వీకరించినపుడు కూడా వలసలే దేశ సమస్యలకు పరిష్కారమని చెప్పారు. వ్యవసాయం నుంచి ప్రజలను తప్పించి, వారందరినీ నగరాలకు తరలించినపుడే భారత్‌లో వాస్తవిక అభివృద్ధి సాధ్యమవుతుందని రాజన్ మొదట్లోనే చెప్పారు. కొందరు ఆర్థికవేత్తలు సయితం వీటినే చిలకపలుకుల మాదిరిగా దశాబ్దాలుగా వల్లిస్తు న్నారు. ఈ పరిణామాలన్నీ కలసి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసే విధానాల రూప కల్పనకు దోహదం చేస్తున్నాయి.  

 

 కొత్త సంవత్సరంలోనైనా...

 2015వ సంవత్సరంలో రైతుల పరిస్థితి ఏమైనా మెరుగుపడుతుందా? నేను నిరాశను వ్యక్తం చేయకున్నా, రైతు పరిస్థితి మారుతుందన్న ఆశ మాత్రం నాలో కొరవడింది. వ్యవసాయ రంగానికి జవజీవాలు కల్పించడానికి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి కేంద్రీకరిస్తే తప్ప, అడ్డూ ఆపూలేకుండా సాగుతున్న రైతుల ఆత్మహ త్యలను నివారిస్తే తప్ప, భవిష్యత్తులో అయినా సేద్యం ఆర్థికంగా వెసులు బాటును ఇస్తుందన్న విశ్వాసాన్ని కలిగిస్తే తప్పఆ రంగానికి భవిష్యత్తును ఆశించడం సాధ్యం కాదు. నరేంద్ర మోదీకి అనుకూలంగా జనం ఓటేశారు.  నిశ్చయంగా ఈ సమస్యను పరిష్కరించే సామర్థ్యం కూడా ఆయనకు ఉంది. వ్యవసాయ పునరుత్థానం గురించిన చర్చ ప్రజలలో ప్రారంభమైనపుడే ఇదంతా సాధ్యమవుతుందన్నది మరో వాస్తవం.

 

కాబట్టి కేవలం ప్రభుత్వాన్నీ లేదా మీడి యానీ మాత్రమే తప్పు పట్టి ప్రయోజనం లేదు. ప్రజలు కూడా రైతు దుస్థితికి సమాన బాధ్యత వహించాలి. ప్రజలు గొంతెత్తినపుడే,  ట్వీటర్, ఫేస్‌బుక్ మరే మార్గంలో అయినా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినపుడే అది చేరవలసిన వారికి చేరుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం చాలా ముఖ్యం. అప్పుడే నిర్లక్ష్యానికి గురైన అంశం ఏదైనా చర్చకు వస్తుంది. ఇలాంటి చర్చ దేశంలో తలెత్తడమే ప్రజలందరి ధ్యేయం కావాలి. అంతేకాదు, ఆ చర్చను కొనసాగిస్తే పాలకుల దృష్టి సేద్యం మీద పడక తప్పదు. అప్పుడే పూర్వ వైభవం వస్తుంది.

- (వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు)

 (hunger55@gmail.com)

 దేవీందర్ శర్మ

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top