ప్రేమ ఉద్వేగం - వివాహం వ్యవస్థ

ప్రేమ ఉద్వేగం - వివాహం వ్యవస్థ


ఆసియా వాసులకు సెంటిమెంట్స్ ఎక్కువని పశ్చిమ దేశాలవాళ్లు అంటుంటారు. దాని అర్థం ఏమంటే, ఆసియా దేశాల్లో సాంస్కృతిక కప్పు దాదాపు ఇనప తెరలా ఉంటుంది. దాన్ని అధిగమించి అందులో దాగున్న ఆర్థిక కోణాన్ని కనిపెట్టడం దాదాపు అసాధ్యం.

 

 సమాజంలోని వ్యవస్థలన్నింటికీ ఆర్థికం, సాంస్కృతికం అనే రెండు కర్తవ్యాలుంటాయి. ఆర్థిక కార్యకలాపమే ఏ వ్యవస్థకైనా ప్రాణప్రద అంశం. అయితే మనుషులకుండే ఆదిమ భావోద్వేగాలకు ఆర్థిక కార్యకలాపాలకు పడదు. సమాజంలో భావోద్వేగాలు ముందు పుట్టి, ఆర్థిక కార్యకలాపాలు తరువాత వచ్చాయి. అందువల్లే, ప్రతి వ్యవస్థలోనూ ఆర్థిక కార్యకలాపాలకు ఆమోదాంశాన్ని కల్పించడానికి దానిమీద సాంస్కృతిక మూతనో, తెరనో కప్పుతుంటారు. ఆసియా వాసులకు సెంటిమెంట్స్ ఎక్కువని పశ్చిమ దేశాలవాళ్లు అంటుంటారు. దాని అర్థం ఏమంటే, ఆసియా దేశాల్లో సాంస్కృతిక కప్పు దాదాపు ఇనప తెరలా ఉంటుంది. దాన్ని అధిగమించి అందులో దాగున్న ఆర్థిక కోణాన్ని కనిపెట్టడం దాదాపు అసాధ్యం. మతాలన్నీ ఆసియా ఖండంలోనే ఆవిర్భవించడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.

 

 ఉత్పత్తి పెరిగితే పేదరికం తగ్గుతుందని నమ్మేవాళ్లు కొందరుంటారు. నిజానికి ఉత్పత్తి పెరిగేకొద్దీ వ్యక్తిగత ఆస్తి పెరుగుతుంది. వ్యక్తిగత ఆస్తి పెరిగేకొద్దీ మనుషుల్లో స్వార్థం పెరుగుతుంది. స్వార్థం పెరిగేకొద్దీ సమాజంలో పేదరికం పెరుగుతుంది. భూతాపం పెరిగి ఓజోన్ పొరకు రంధ్రాలు పడి అతినీల కిరణాల ధార్మిక శక్తి విజృంభించినట్టు, మనుషుల్లో స్వార్థం పెరిగేకొద్దీ సాంస్కృతిక పొరలకు చిల్లులు పడి, వ్యవస్థల్లోని ఆర్థిక కార్యకలాపాలు నగ్నంగా బయటపడిపోతాయి.

 

 ప్రేమ వేరు, వివాహం వేరు. ప్రేమ ఉద్వేగం. వివాహం వ్యవస్థ. ప్రేమలో ఆదిమ భావోద్వేగాలు పుష్కలంగా ఉంటాయి. వివాహ వ్యవస్థలో వ్యక్తిగత ఆస్తి, అస్తిత్వాల పరిరక్షణ, వారసత్వాల భద్రత అనే నిర్దేశిత ఆర్థిక కార్యకలాపాలు ఉంటాయి. మరో మాటలో చెప్పాలంటే, సాంస్కృతిక వ్యవహారంగా కనిపించే పచ్చి ఆర్థిక కార్యకలాపం వివాహ వ్యవస్థ. ఇటీవలి కాలం వరకు భారతదేశంలో స్త్రీలకు ఆస్తి హక్కు లేదు. వ్యక్తిగత ఆస్తిని కూడబెట్టడం భర్త కర్తవ్యం అయితే, భర్తకు వారసుల్ని కనడం, భర్త కూడబెట్టిన వ్యక్తిగత ఆస్తిని అతని సంతానానికి సంక్రమంగా చేర్చడం భార్య కర్తవ్యం. ఈ రెండు కర్తవ్యాలను నెరవేర్చమనడం అంటే భార్య పాతివ్రత్యాన్ని పాటించాలని అర్థం. పాతివ్రత్యం అనేది వందల సంవత్సరాలు ఒక సాంస్కృతిక విలువగా కొనసాగినప్పటికీ మహిళలందరూ దాన్ని ఆమోదించారని కాదు. వీలు దొరికినప్పుడల్లా దాన్ని వాళ్లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఖండిస్తూనే ఉన్నారు. ఆస్తి హక్కు, ఆర్థిక స్వేచ్ఛ వచ్చేకొద్దీ మహిళల నిరసనకు మార్గాలు పెరుగుతాయి. దానితో సాంస్కృతిక పొర పలచబారిపోతుంది.

 

 సాంస్కృతిక విభాగం బలంగా ఉన్నప్పుడు ఏ వ్యవస్థ అయినా ఉద్వేగభరితంగా కనిపిస్తుంది. అందులోని ఆర్థిక విభాగం బాహాటంగా బయటికి వచ్చినప్పుడు ఉద్వేగమంతా ఆవిరైపోతుంది. బయట చెలరేగిపోతున్న ఆర్థిక పోటీ, స్వార్థం ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు దాంపత్య కర్తవ్యాలను నిర్వర్తించడం భార్యకేకాక భర్తకు కూడా ఇబ్బందిగా మారుతుంది. భార్యకు భర్త ఒక అణిచివేత యంత్రంగా కనిపిస్తే, భర్తకు భార్య గుదిబండగా కనిపిస్తుంది. వివాహ వ్యవస్థలో తలెత్తే ఇలాంటి ఒత్తిళ్లు వివాహేతర సంబంధాలకు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. సరిగ్గా ఇక్కడి వరకు వచ్చి ఆగుతుంది అపర్ణ తోట కథ ‘ప్రేమకథ రిఫైన్డ్’. పెళ్లయి భర్త, పిల్లలున్న ఒకామెకు, పెళ్లయి భార్యా పిల్లలున్న ఒకతనికి మధ్య ఏర్పడిన వివాహేతర ఆకర్షణ, అందులోని ఘర్షణని అపర్ణ బాగా చిత్రించింది.

 

 సరిగ్గా ఇక్కడే మొదలవుతుంది కుప్పిలి పద్మ కథ ‘సెకండ్ హజ్బెండ్’. ఆ కథలో, దక్షిణ - అనిల్ ఇద్దరికీ సెకండ్ మ్యారేజే. అనిల్ పూజగదిలో మొదటి భార్య గౌరిది పెద్ద ఫొటో ఉంటుంది. ఆమె పుట్టినరోజును అతను ఆడంబరంగా చేస్తుంటాడు. దక్షిణ మొదటి భర్త విశ్వాస్ పుట్టినరోజున అతని ఫొటోను కూడా పూజకు పెట్టడంతో వివాదం మొదలవుతుంది. భార్యకు బహుళ అస్తిత్వాలు ఉండటాన్ని వివాహ వ్యవస్థ ఒప్పుకోదు.

 ఆఫీసు, ఇల్లు మాత్రమే కాదు సమాజంలోని వ్యవస్థలన్నీ రాజ్యానికి ప్రతిరూపాలే. వివాహేతర సంబంధాలు వివాహంగా మారితే మళ్లీ ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ వ్యవస్థలో మొదటి భర్త అయినా వందో భర్త అయినా పెద్దగా మార్పుండదు.

 -  ఉషా యస్ డానీ

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top