చరిత్ర చెక్కిలిపై చెరిగిన జ్ఞాపకం | Sakshi
Sakshi News home page

చరిత్ర చెక్కిలిపై చెరిగిన జ్ఞాపకం

Published Thu, Sep 25 2014 2:10 AM

చరిత్ర చెక్కిలిపై చెరిగిన జ్ఞాపకం

నవభారత్‌కు సమయ నిర్దేశం చేసిన దేశీయ తొలి చేతి గడియారాల తయారీ సంస్థ హెచ్‌ఎంటీ వాచెస్. కోట్లాది భారతీయుల హస్తాభరణమై నిలిచిన ఈ మేటి సంస్థ అయిదు దశాబ్దాల ప్రయాణంలోనే కాలం కడుపున తలదాచుకోనుండటం మహా విషాదం.
 
అదొక వైభవోజ్వల యుగం.. వల్లకాటి అధ్వాన్న శకం అంటూ ‘రెండు మహానగరాలు’ నవల మొదట్లో సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత చార్లెస్ డికెన్స్ ఫ్రెంచ్ విప్లవానికి ముందు పరిస్థితిని  వర్ణించారు. స్వతంత్ర భారత్ తొలినాళ్లలో  పురుడు పోసుకుని వికసించిన హిందుస్తాన్ మెషిన్ టూల్స్ (హెచ్‌ఎంటీ) ఉత్థాన, పతనాలకు కూడా ఈ వ్యాఖ్య వర్తిస్తుంది. దశాబ్దాల పాటు భారతీయులను అలరించిన ఈ సంస్థ వాచీల తయారీ విభాగం అటు కొనేవాళ్లు లేక, ఇటు నష్టాలు పూడ్చుకోలేక సెలవు ప్రకటించనుంది. స్వయంకృతాపరాధమో, పోటీలో నిలబడలేకపోవడమో.. కార్యనిర్వహణ లోపమో.. కారణాలు ఏవైనా కావచ్చు... హెచ్‌ఎంటీ వాచీ మన కళ్లముందే చరిత్ర గర్భంలో తలదాచుకోనుంది.
 
దేశభక్తి, సమయపాలన రెంటికీ పట్టం గట్టిన నెహ్రూ యుగంలో అవతరించిన ఈ గొప్ప ఉత్పత్తి కొన్ని తరాల భారతీయుల జీవితాల్లో భాగమై నిలిచింది. జాతికి కాలగమనాన్ని నిర్దేశించిన హెచ్‌ఎంటి గడియారం.. ఇకపై టిక్ టిక్ అనలేదు. దశాబ్దకాలంగా వరుస నష్టాలతో కోలుకోలేని దెబ్బలు తింటూ వస్తున్న హెచ్‌ఎంటి గడియారాల తయారీ విభాగాన్ని పూర్తిగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా వార్తలు పొక్కాయి. వెంటనే దేశవ్యాప్తంగా షాపుల్లో, ఆన్‌లైన్ షాపుల్లో మిగిలివున్న సంస్థ గడియారాలు హాట్‌కేక్‌ల లాగా అమ్ముడయ్యాయి. హిందుస్తాన్ మెషిన్ టూల్స్ ఇకపై ఒక హిందుస్తాన్ మెమొరీ మాత్రమే.
 
కోట్లాది మధ్యతరగతి భారతీయుల హస్తాభరణమై భాసిల్లిన హెచ్‌ఎంటీ గడియారం ఇక ఒక పురా జ్ఞాపకం. తన జీవితకాలంలో కొన్ని కోట్ల గడియారాలను అవిరామంగా సృష్టించిన హెచ్‌ఎంటీ డిమాండ్ లేని దుర్బలతకు గురైంది. పునరుద్ధరణకు కనుచూపు మేరలోనూ అవకాశం లేని నేపథ్యంలో ముగిం పు అనివార్యమైంది. భారతీయ వస్తూత్పత్తి చరిత్ర స్వర్ణయుగంలో మెరిసిన హెచ్‌ఎంటీ వాచీ ఇప్పుడు అంబాసిడర్ కారు, బజాజ్ స్కూటర్‌ల సరసన మ్యూజియంలో చేరబోతోంది.
 
స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో దేశభక్తితోపాటు సమయ పాలనకూ ప్రాధాన్యం ఇవ్వాలన్న తొలిప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దార్శనికతనుంచి హెచ్‌ఎంటీ వాచెస్ సంస్థ ఏర్పడింది. ఇది భారత్ రూపొందించిన మొట్టమొదటి దేశీయ మాన్యువల్ వాచ్. నాటి నుంచి హెచ్‌ఎంటీ గడియారం భారతీయ మధ్యతరగతికి సరికొత్త రుచిని చూపింది. జపాన్ కంపెనీ సిటిజన్ వాచ్ సంస్థ సహకారంతో 1961లో బెంగళూరులో ఏర్పడిన హెచ్‌ఎంటీ వాచీల విభాగం భారీ స్థాయిలో  చేతి గడియారాలను తయారు చేసింది. 1970లలో యంత్రాల ద్వారా తొలిసారిగా ఆటోమేటిక్, క్వార్జ్ వాచీలను ప్రవేశపెట్టింది. జనతా, సోనా, విజయ్, ప్రియా, అపూర్వ తదితర పాపులర్ వాచీలతో ఇది అచ్చమైన దేశీ బ్రాండ్‌గా వెలుగొందింది. హెచ్ ఎంటీ వాచ్ ధరించడం అంటే మునుపటి తరాలకు ఒక హోదా. నలభైఏళ్లుగా దాన్ని వాడుతూనే ఉన్నామని నేటికీ ప్రజలు గర్వంగా చెబుతుంటారు.
 
భారత్‌లో లైసెన్స్ పర్మిట్ రాజ్ రాజ్యమేలుతున్న కాలంలో హెచ్‌ఎంటీ గడియారం నవ్యత్వానికి, సాహసానికి మారుపేరుగా నిలిచింది. కాని 1991 ఆర్థిక సంస్కరణల అనంతరం లెసైన్స్ రాజ్ తగ్గుముఖం పట్టి ప్రయివేట్ వాచీల తయారీ కంపెనీలు మార్కెట్లోకి దూసుకొచ్చిన నేపథ్యంలో ఈ సంస్థ తన పురా ప్రాభవాన్ని కోల్పోయింది. చివరి సంవత్సరాల్లో ఇది ఏటా రూ.200 కోట్ల నష్టాలతో కుంగిపోయింది. ప్రైవేట్ సంస్థలతో పోటీ పడలేక, కాలానుగుణంగా మారలేక, తన పునాదులను తానే బలహీనపర్చుకుంది. పచ్చిగా చెప్పాలంటే ప్రైవేట్‌కు పట్టం గడుతూ పబ్లిక్ సంస్థలపై శీతకన్ను వేస్తున్న పాలనా విధానాలకు హెచ్‌ఎంటీ పతనం తిరుగులేని తార్కాణం.
 
1961లో దేశీయ తొలి చేతి గడియారాన్ని నెహ్రూ ఆవిష్కరించడంతో మొదలైన హెచ్‌ఎంటీ ప్రస్థానం 53 ఏళ్లపాటు కొనసాగింది. 1981లో క్వార్జ్ వాచీలు, 85లో సోలార్, టవర్ క్లాక్‌ల తయారీతో పతాక స్థాయికి చేరింది. గత అయిదు దశాబ్దాల కాలంలో 11 కోట్లకు పైగా వాచీలను ఉత్పత్తి చేసి, అమ్మింది. తొలి వివాహ బహుమతిగా ప్రజల హృదయాల్లో నిలిచింది.
 
టైమ్ కీపర్ పతనం
1981లో క్వార్జ్ వాచీల తయారీకి మళ్లిన హెచ్‌ఎంటీ వాచెస్ అత్యధిక ధరల వాచీల విభాగంలో పై చేయి సాధించగలిగింది కానీ, అప్పుడప్పుడే చౌక ధర వాచీలవైపు మళ్లుతున్న మార్కెట్ నాడిని పసికట్టడంలో వెనుకబడింది. మొదట్లో ఆల్విన్‌తో పోటీలో తడబడిన సంస్థ తర్వాత టాటాల ప్రవేశంతో చతికిలబడింది. సంస్థ అంతర్గత సంక్షోభం లో ఉన్నతాధికారులు టాటా సంస్థలో చేరడం, ప్రభుత్వం కూ డా పట్టించుకోకపోవడంతో ఇతర ప్రభుత్వ రంగసంస్థల కోవలోకి చేరిపోయింది. నేటికీ 18 మాన్యుఫాక్చర్ విభాగాలున్న హెచ్‌ఎంటీ ఇకపై ట్రాక్టర్ల వంటి ఉత్పత్తులకే పరిమితం కానుం ది. ఏదేమైనా తరాలుగా కొనుగోలుదారుల హృదయాలపై చెరగని ముద్ర వేసిన హెచ్‌ఎంటీ  దేశీయ తొలి వాచీల ఉత్పత్తిదారుగా జాతికి గర్వకారణమే.  53 ఏళ్లపాటు జాతికి సమయాన్ని నిర్దేశించిన ఈ టైమ్ కీపర్, ‘దేశ్ కీ దడ్కన్’కు వీడ్కోలు.
-మోహన

Advertisement
Advertisement