చీరాల గ్రాఫిక్ కృష్ణుడు

చీరాల గ్రాఫిక్ కృష్ణుడు


తెలుగువారి మధ్య ఒక కొత్త గీత పలికింది. ఇది గ్రాఫిక్ నావెల్ అనే కొత్త రాగాన్ని ఆలపిస్తోంది. తెలుగువారికి తెలీని అనేకానేక రహస్యాల్లో ఒక దీని పేరు రాజేష్ నాగులకొండ. పుట్టింది చీరాలలో. జీవితంలో మొదటి విప్లవం మూడవ తరగతితో చదువు మానేయడం. బాల కార్మిక వ్యవస్థపై గట్టి నమ్మకంతో ఆ మూడవ తరగతి పట్టా పుచ్చుకుని తండ్రికి ప్రింటింగ్ ప్రెస్‌లో చేతి సాయం కింద ఉండేవాడు. ఆరేళ్ల తరువాత ఏ బోధి చెట్టు కింద ఏం జరిగిందో తెలీదు కాని ఎకాఎకి పదవ తరగతి క్లాసులో కూచుని బీఎస్సీ దాకా నడిచాడు. చదువు సంధ్య సంగతి అటుంచితే తాతలు తండ్రుల రక్తం గ్రూపు ఆర్ట్ పాజిటివ్. రాజేష్‌ది కూడా అదే. ఆ రక్తంలోని వేడి తనను కుదురుగా నిలువనీయక చీరాల నుంచి దేశంపైకి తరిమింది. మొదట హైద్రాబాదు ఆపై మద్రాస్ పిదప ఢిల్లీ చేరాడు.

 

 భారతదేశ కామిక్ చరిత్ర రెండు భాగాలు కంప్యూటర్‌కు ముందు కంప్యూటర్ తరువాత. మొదట్లో కామిక్స్‌లోని కృష్ణుడు, రాముడు తదితరులు నితిష్ భరద్వాజ్, అరుణ్ గోవిల్‌ల నీరస మొహాలేసుకుని అడ్వెంచర్స్ చేసేవారు. తరువాత కంప్యూటర్ వేకం టాబ్లెట్లు చిత్రకారుల టేబుల్ పెకైక్కి కాగితాన్ని, కుంచెల్ని కాలితో తన్నితగలేసిన తరువాత మన దేవుళ్లు అర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్, వాన్ డమ్మీ మొహాలు తొడుక్కుని జిమ్ముల్లో కండలు పెంచి డైనోసార్లు గాడ్జిల్లాలపై స్వారీ చేస్తూ పుస్తకాల్లోకి ఆపై పిల్లల బుర్రల్లోకి దూరిపోయే సమయంలో- మాయాబజార్, పాతాళ భైరవి, చందమామ కథలు, ఎన్‌టీఆర్ వర్చస్సు, వడ్డాది పాపయ్యల వారసత్వంతో ‘క్రిష్ణా ద డిపెండర్ ఆఫ్ ధర్మ’ మొదటి పుస్తకంతో ఇండియన్ కామిక్ అండ్ గ్రాఫిక్ నావెల్ ప్రపంచంలో అడుగుపెట్టాడు రాజేష్. పుస్తకం నిండా ఎటువంటి బీభత్సం లేదు, రక్తపాతం లేదు, భీముడు గద ధరించిన కిల్ బిల్‌లా పూనకం పూనింది లేదు.

ఈ గ్రాఫిక్ నావెల్ ప్రయాణంలో 10 పుస్తకాలు తెచ్చాడు రాజేష్. అతని పుస్తకాల కోసమైతే ఫ్లిప్ కార్ట్, అమేజాన్ చూడండి. స్నేహం కోసం అయితే Rajesh Nagulakonda  అని ఫేస్‌బుక్‌లో పలకరించండి.

 -  అమరావతి

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top