స్వీయ లోపంబెరుగుట పెద్ద ఘనత | Sakshi
Sakshi News home page

స్వీయ లోపంబెరుగుట పెద్ద ఘనత

Published Mon, Apr 27 2015 12:37 AM

స్వీయ లోపంబెరుగుట పెద్ద ఘనత - Sakshi

సీపీఎం బలం గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణించిన నేటి స్థితిలో పార్టీకి జవసత్వాలు నింపి దేశవ్యాపితంగా పునర్వైభవం సాధించాలి. ఇందుకు అంకిత భావం, అనుభవంతోపాటు  డైనమిజం, నవతరం కార్యకర్తలతో కలిసిపోగల నేర్పు అవసరం. వీటితోపాటు దేశ విదేశాల కమ్యూనిస్టు నేతలతో పరిచయం, వివిధ రాజకీయ పార్టీల నేతలతో సత్సంబంధాలు, ప్రజాసమస్యలపై పార్లమెంటరీ రంగాన పోరాట అనుభవం గల సీతారాం ఏచూరి మరింత అనువైన నేత అన్న విషయం నిస్సందేహం.
 
 ఇరవై ఒకటవ అఖిల భారత సీపీఎం మహాసభలు ముగిశాయి. గత రెండు న్నర దశాబ్దాలుగా, ఇంకా చెప్పాలంటే మూడున్నర దశాబ్దాల క్రితమే 1977 జలంధర్ మహాసభలోనే నిర్ణయించుకున్న వామపక్ష ప్రజాతంత్ర సంఘట నను నిర్మించడంలో, అందుకు ప్రాణప్రదమైన తమ పార్టీ స్వతంత్ర శక్తిని పెంచుకోవడంలోనూ విఫలమైనామని ఈ మహాసభలో సీపీఎం నిజాయి తీగా అంగీకరించింది. ‘స్వీయ లోపంబెరుగుట పెద్దఘనత’ అన్నట్లు సీపీఎం ని ఇందుకు అభినందించాలి.
 
 ఎప్పటికప్పుడు ఎదురవుతున్న రాజకీయ పరిస్థితులు.. ముఖ్యంగా బెంగాల్, కేరళ ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాట్లు, అలాగే జాతీయ స్థాయిలో పార్లమెంటు ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాటులో చొరవ తీసుకోవలసిన పరిస్థితులు అనివార్యంగా రావటం, ఇత్యాదుల వలన ప్రాప్తకాలజ్ఞతతో వాటిలో లీనమై ప్రధాన కర్తవ్యాన్ని నెరవేర్చలేకపోయా మని, చివరకు, కేంద్రంలో తృతీయ ఎన్నికల ప్రత్యామ్నాయ నిర్మాణం కోసం ఆరాటపడే స్థితికి చేరుకున్నామంటూ తీవ్రమైన ఆత్మవిమర్శనే మహాసభలో సీపీఎం నాయకత్వం చేసుకున్నది.
 
 ఇకనైనా వామపక్ష ప్రజాతంత్ర సంఘట నకు, పార్టీ స్వతంత్ర బలాన్ని పెంచుకునేందుకు అవసరమైన వామపక్ష ప్రజా తంత్ర శక్తుల విశాల ఐక్య ప్రజాపోరాటాల ఆధారంగా సీపీఎం చొరవతో కృషి చేయాలంటూ కర్తవ్యాన్ని కూడా ఈ మహాసభలో నిర్దేశించుకోవడం గమ నార్హం. ఇది ఆహ్వానించదగినది కూడా.
 
 అంతే కాదు మనదేశ ప్రత్యేక పరిస్థితిలో, దళిత, ఆదివాసీ గిరిజన తదితర వెనుకబడిన కులాల అణచివేత, మతాల భౌతిక సాంఘిక అభద్రత తదితర సామాజిక రుగ్మతలపైకూడా తగు శ్రద్ధ పెట్టాలని మహాసభ వక్కా ణించింది. తదనుగుణంగా ఆర్థిక సామాజిక అంటే వర్గ, వర్ణ తదితర సామా జిక అణచివేతలకు వ్యతిరేకంగా, పోరాటాలను సమన్వయం చేసుకుంటూ ద్విముఖ బహుముఖ పోరాటాలను ఏకకాలంలోనే చేసే దిశగా దృష్టి సారిం చాలని సీపీఎం నిర్ణయించుకున్నది. ఇంత స్పష్టంగా, నిర్మొహమాటంగా, ఆత్మవిమర్శనా దృక్పథంతో, నిబద్ధతతో మహాసభలో ప్రతినిధుల చర్చలు, సభా నిర్ణయాలు మనఃపూర్వకంగా స్వాగతింపదగినవి.
 
 ప్రధాన కార్యదర్శి ఎన్నిక లాంఛనమే..!
పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నికలకు సీతారాం ఏచూరి, రామచంద్ర పిళ్లైల మధ్యనే పోటీ అయి ఉన్నట్లయితే ఏచూరి ఎన్నికల సహజమూ సమంజ సమూ కూడా. ఇక్కడ పిళ్లై శక్తిసామర్థ్యాలను శంకించడం ప్రశ్న కాదు. కానీ వయస్సే ఆయనకు వ్యతిరేకంగా ఉంది. 77 ఏళ్ల వయస్సులో సుదీర్ఘ పోరా టానుభవం ఉండినా, అదీ సీపీఎం బలం గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణిం చిన నేటి స్థితిలో పార్టీకి జవసత్వాలు నింపి దేశవ్యాపితంగా పునర్వైభవం సాధించడం.. ఇందుకు అంకిత భావం, అనుభవంతోపాటు ఎంతో డైనమిజం, నవతరం కార్యకర్తలతో కలిసిపోగల నేర్పు అవసరం.
 
 వీటితోపాటు దేశ విదేశాల కమ్యూనిస్టు నేతలతో పరిచయం, వివిధ రాజకీయ పార్టీల నేతలతో సత్సంబంధాలు, రాజ్యసభ సభ్యునిగా అవసరమైన చొరవ, ప్రజాసమస్య లపై పార్లమెంటరీ రంగాన పోరాట అనుభవం గల సీతారాం మరింత అను వైన నేత అన్న విషయం నిస్సందేహం. కాబట్టి సీతారాం ఎన్నిక లాంఛన ప్రాయం అన్నది తెలిసిన విషయమే.
 
 వివిధ దశలలో, వివిధ రాజకీయ ఆర్థిక సామా జిక సాంస్కృతిక వైవిధ్యాలతో కూడిన భారతదేశం మొత్తానికి ఒకే విధమైన కర్తవ్యాల తో రాజకీయ పోరాట మార్గం అం టూ ఉండటం సాధ్యమా? కశ్మీర్‌లో, అస్సాంలో, కేరళలో, తమిళనాడులో ఒకే విధమైన రాజకీయ ఎత్తుగడల పంథా తో పయనించడం సాధారణం గా ఉంటుందా? ఎందు వల్లనో ఈ అంశమే 21వ మహాసభ తీర్మానంలో లేదు.
 
 కేవలం ఎన్నికల ఎత్తుగడలు, పొత్తులు, ఓట్లు అందుకోసం ధనబలం, కండబలం, కులమత విద్వే షాలు రెచ్చగొట్టడం, ఆచరణ సాధ్యం కాని అబద్ధపు వాగ్దానాలు చేయడం వంటి పాలక వర్గ బూర్జువా పార్టీల విషయం వేరు,  ప్రజాసమీకరణ, ప్రజాఉద్యమాలు, వర్గపోరాటాలు, సమరశీల స్వభావమూ కలిగి అంతిమంగా దోపిడీవర్గ రాజ్యం స్థానంలో ఒక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేయాల్సిన కమ్యూనిస్టు పార్టీలకు, దేశ వ్యాప్తంగా ఏకశిలాసదృశ్యమైన నిర్మాణ, రాజకీయ, ఎత్తుగడల పంథా ఆచరణీయమా?
 
 ప్రాప్తకాలజ్ఞతే అసలు ప్రమాదం
 అంతిమ లక్ష్యాన్నే నిత్యం జపం చేస్తూ వర్తమానాన్ని విస్మరించడం ఎంతటి పొరబాటో, తాత్కాలిక ప్రాప్తకాలజ్ఞతకు లోబడి, అసలు గమ్యాన్నే అగమ్యం చేసుకోవడం అంటే ప్రమాదమే గదా. అదే విషయాన్ని గత మూడు దశాబ్దాల పార్టీ ఆచరణ నిరూపించిందని కదా నేడు ఈ సభలో సీపీఎం ఆత్మవిమర్శ! 1951 విప్లవ ఎత్తుగడల పంథా(అదే కిషన్ డాక్యుమెంటు స్టాలిన్ సమక్షంలో, 1951లో ఉమ్మడి సీపీఐ ప్రతినిధివర్గం రూపొందించుకున్నది) కే సీపీఎం కట్టుబడి ఉన్నానని ప్రకటించింది.
 
 సీపీఐతో ఉన్న సైద్ధాంతిక విభేదాలలో అది ఒక ప్రధానమైనది కూడా! ఆ ఎత్తుగడల పంథాను సమకాలీనం చేసే సందర్భంలో కూడా భారతదేశ విప్లవంలో జాతుల సమస్య ప్రభావమెలా ఉండబోతున్నదో, ఆయా జాతుల ప్రత్యేక పోరాటాలు ఏ రూపం తీసు కోనున్నాయో, ఇవన్నీ కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుందని సీపీఎం స్పష్టం చేసింది. ప్రాప్తకాలజ్ఞత రాజకీయాలకు ఏదోమేర అలవాటుపడిన, ప్రస్తుత సీతారాం నేతృత్వంలోని పార్టీ కేంద్ర కమిటీ ప్రధానంగా వీటిని గుర్తుంచుకోవాలి! నేపాల్‌లో ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీని జనజీవనస్రవంతిలోకి తేవడంలో ఒక ముఖ్య భూమిక పోషించిన ఏచూరి, ఆ అనుభవాలన్నింటినీ సమన్వయం చేసుకుని పురోగమించగలరని ఆశించ వచ్చు.
 
 ఆ జాతుల సమస్య విషయం అటుంచినా వివిధ రాష్ట్రాలలో పార్టీ పురోగమనానికి వివిధ డిమాండ్లపై విభిన్న శక్తులతో ప్రజాపోరాటాలు నిర్వహించాలి. అంతేకాదు విప్లవమా, ఎన్నికలా? పోరాట రూపం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు ముందు కావాల్సింది, ప్రజల్లో కమ్యూనిస్టు పార్టీలు, ప్రత్యేకించి సీపీఎం విస్తృతమైన ప్రజాభిమానాన్ని, బలాన్ని సంతరించుకోవడం! కనుక వివిధ రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా, విశాల సమరశీల ఐక్య ప్రజాఉద్యమాల నిర్మాణం ద్వారా మాత్రమే అలాంటి ప్రజాబలాన్ని కమ్యూనిస్టులు సంతరించుకోగలరు.
 
 ఉదా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుందాం! రాజధాని సమీకరణ బిల్లునే కాదు, అసలు కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేపట్టనెంచిన భూసేకరణ చట్టం విషయంలోనూ, రాష్ట్ర ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉంది. అయితే ఈ అసంతృప్తి ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సీపీతోపాటు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ఇతర సామాజిక సంఘాలలో కూడా విడివిడిగా పేరుకుని ఉన్నది. ఈ మొత్తం అసంతృప్తిని ఒకే విశాల ప్రజాస్వామిక ప్రజాఉద్యమంగా మలచడానికి, అలాంటి బృహత్తర ఐక్య ఉద్యమానికి కమ్యూనిస్టులు తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుంది.
 
 ఏపీలో ఐక్యప్రతిఘటన అవశ్యం
 అలాగే, ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్ల నెపంతో 20 మంది కూలీలను నగ్నంగా, బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంద్రబాబు ప్రభుత్వం పొట్టన పెట్టుకున్న విషయంపై కూడా ఎంతో తీవ్రమైన ప్రతిఘటనకు ప్రతిపక్షాలు సిద్ధపడాలి! నిస్సిగ్గుగా సంపద రక్షణ పేరుతో ప్రాణాలను హరించడాన్ని సమర్థించే పాలకులను ఎండ గట్టాల్సిన అవసరం ఉంది. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తూ స్వార్థ సంకుచిత, దృక్పథంతో కాకులను కొట్టి గద్దలకు వేసే ప్రస్తుత తెలుగుదేశం పాలన క్రమేపీ దమనపాలన నిరంకు శత్వదిశగా సాగనున్న దానికి ఇది నిదర్శనం. ఇంకా ఆంధ్ర ప్రదేశ్‌కు విభజన సందర్భంగా ప్రత్యేక హక్కుల వంటి ఇచ్చిన హామీ లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలి అన్న డిమాండ్ విషయం.
 
 అయితే ఆ పేరుతో ప్రైవేటీ స్వదేశ విదేశీ గుత్తాధిపతుల వ్యాపార ధనకాంక్షకు ఆంధ్రప్రజానీకం బలి కాకుండా జాగ్రత్తపడాల్సి ఉంది. ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం తెలుగు జాతి నినాదమై  ప్రభుత్వ రంగాన ప్రజాసొత్తుగా అవతరించిందని గుర్తుంచు కోవాలి. అలాగే వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రత్యేక పరిస్థితులను బట్టి నినాదా లు, కలిసివచ్చే శక్తులు, సాగించాల్సిన ఉద్యమ రూపురేఖలు ఇవన్నీ రూపొం దించుకోవాల్సి ఉంది.
 
 కనుక కేంద్ర నాయకత్వం పాలిట్‌బ్యూరో ఇత్యాదివి ఎంత ముఖ్యమో, వివిధ రాష్ట్రాల నాయకత్వం కూడా అంతే ముఖ్యం. మన దేశం వంటి విభిన్న జాతులు, విభిన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులున్న భారతదేశంలో.. కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరుతో కేంద్ర నిర్ణయాలను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దడం మన ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధం! ఈ విషయంలో గతంలో కొన్ని సందర్భాల్లో సీతారాం ఈ వాస్తవాన్ని గుర్తించిన ఉదాహరణలున్నాయి.
 
 సీతారాం తన సాపేక్షమైన సామరస్యపు ధోరణికీ- ప్రస్తుతం పార్టీ తీర్మానం ప్రకటించిన ‘వామపక్ష ప్రజాతంత్ర సంఘటన, సీపీఎం పార్టీ స్వతంత్ర అభివృద్ధి’ అనే సమరశీల లక్ష్యానికి వైరుధ్యం రాకుండా తన ప్రత్యేక శక్తియుక్తులను కేంద్ర నాయకత్వంలోని ఇతర నేతల అనుభవాన్ని స్వీకరించి ప్రస్తుత నయా ఉదారవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానానికి ప్రజామోద ప్రత్యామ్నాయాన్ని సృజనాత్మకంగా రూపొందిం చగలరని ఆశిద్దాం.
 
 - డా॥ఎ.పి. విఠల్
 (వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు  98480 69720)

Advertisement
Advertisement