‘దువ్వాడ జగన్నాథమ్‌’కు మరో షాక్‌ | Sakshi
Sakshi News home page

‘దువ్వాడ జగన్నాథమ్‌’కు మరో షాక్‌

Published Mon, Jun 26 2017 6:45 PM

‘దువ్వాడ జగన్నాథమ్‌’కు మరో షాక్‌ - Sakshi

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ నటించిన దువ్వాడ జగన్నాథమ్‌ (డీజే) సినిమాలోని శృంగార గీతాల్లో యజుర్వేదంలో ఉన్న నమకం, చమకం వంటి పవిత్ర పదాలను ఉపయోగించారని, వీటిని తొలగించేంత వరకు ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించకుండా నిషేధం విధించాలంటూ ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని రంగారెడ్డి జిల్లాకు చెందిన గోగులపాటి కృష్ణమోహన్‌ దాఖలు చేశారు. ఇందులో ప్రాంతీయ సెన్సార్‌ బోర్డు అధికారి, వెంకటేశ్వర క్రియేషన్స్, డీజీపీ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. డీజే సినిమాలోని శృంగార గీతాల్లో పలు అభ్యంతరకర పదాలు ఉన్నాయని పిటిషనర్‌ తెలిపారు. అంతేకాక యజుర్వేదంలోని నమకం, చమకం వంటి పవిత్ర పథనాలను కూడా ఉపయోగించారన్నారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ సెన్సార్‌ బోర్డు అధికారులకు వినతిపత్రం సమర్పించినా, దానిని పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు.

ఈ పదాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. అందువల్లే మరో ప్రత్యామ్నాయం లేక హైకోర్టును ఆశ్రయించామని వివరించారు. నమకం, చమకం వంటి పదాలను శృంగార గీతాల్లో నుంచి తొలగించేంత వరకు థియేటర్లలో డీజే ప్రదర్శనపై నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కృష్ణమోహన్‌ కోర్టును కోరారు. ఇంతకుముందు బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేయడంతో పాటలోని అభ్యంతరకర పదాలను తొలగిస్తామని చిత్రయూనిట్‌ ప్రకటించింది.

Advertisement
Advertisement