కాలిఫోర్నియా బీచ్ లో 'రెడ్ కార్పెట్' | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియా బీచ్ లో 'రెడ్ కార్పెట్'

Published Thu, May 19 2016 12:57 PM

కాలిఫోర్నియా బీచ్ లో 'రెడ్ కార్పెట్'

కాలిఫోర్నియాః అక్కడి తీర ప్రాంతాలు ఇప్పుడు సందర్శకులకు, పర్యటకులకు రెడ్ కార్పెట్ తో భయాన్ని గొల్పుతున్నాయి. రెడ్ కార్పెట్ అంటే సాదర స్వాగతం అనుకుంటే తప్పులో కాలేసినట్లే. నీటిలో కాలుష్య ప్రభావమో.. వాతావరణ ప్రతికూల పరిస్థితులో కానీ జలచరాలు కుప్పలు తెప్పలుగా ఒడ్డుకు చేరుకుంటుండటంతో ఎర్రని ట్యూనా పీతలతో నిండిన తీరం రెడ్ కార్పెట్ ను తలపిస్తోంది.  

వేలకు వేలుగా  ఎర్ర పీతలు దక్షిణ కాలిఫోర్నియా బీచుల్లో చేరడం న్యూ పోర్ట్ బీచ్ సందర్శకులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అరుదుగా కనిపించే ఆ దృశ్యాన్ని కొందరు వింతగా చూస్తుంటే... అక్కడి మునిసిపల్ సిబ్బంది మాత్రం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయలేక తీవ్ర కష్టాలు పడుతున్నారు. కొన్నేళ్ళ క్రితం ఇలాగే సుమారు మూడు అంగుళాల పొడవైన ఎర్ర పీతలు కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంటీ ప్రాంతాన్ని ముంచెత్తాయి. అయితే కొందరి కష్టం మరి కొందరికి ఆనందం అన్నట్టు.. శాండియాగోకి దగ్గరలో ఉన్న ఇంపీరియల్ బీచ్ లో పక్షుల ఆనందం మాత్రం పట్టలేకుండా ఉంది. ఓ స్పెషల్ బఫెట్ ను వాటి ముందు పెట్టినట్లు బీచ్ ఒడ్డుకు చేరిన పీతలను తినేందుకు ఉత్సాహంగా పక్షులు అక్కడికి చేరుతున్నాయి.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి చేరిన పీతలను అక్కడే వదిలేయాలా,  తిరిగి సముద్రంలోకి పంపించాలా అన్న విషయంపై అధికారులు తలమునకలౌతున్నారు. గత 15 సంవత్సరాలనుంచి ఇలా ఎర్ర పీతలు సముద్ర తీరాల్లోకి కొట్టుకు వస్తున్నట్లు పురపాలక రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఒక్క  క్రితం సంవత్సరంలోనే బాల్బోవా ఐస్ ల్యాండ్,  చైనా కోవ్  ప్రాంతాల్లో కార్మికులు, స్వచ్ఛంద సభ్యులు కలసి ఎనిమిది టన్నుల దాకా ఒడ్డుకు చేరిన పీతలను పట్టుకొన్నట్లు లాస్ ఏంజిల్స్ దగ్గరలోని ఆరెంజ్ కౌంటీ న్యూపోర్ట్ నగరం చెప్తోంది. ఇలా నీటినుంచి జలచరాలు బయటకు వచ్చేయడానికి తీవ్ర వాతావరణ మార్పులే కారణమని సైంటిస్టులు చెప్తున్నారు.

Advertisement
Advertisement