విషజలాన్నేతాగుతున్నారు | Sakshi
Sakshi News home page

విషజలాన్నేతాగుతున్నారు

Published Mon, Nov 3 2014 12:37 AM

they were drink toxic water

 2 వేల గ్రామాల్లో మంచినీళ్లు విషపూరితం గుర్తించిన కేంద్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని దాదాపు రెండు వేల గ్రామాల్లో ప్రజలు పూర్తిగా ఫ్లోరైడ్‌తో పాటు విషపూరిత జలాలనే మంచినీరుగా తాగుతున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏపీలో 745 గ్రామాల్లో ఫ్లోరైడ్, మరో నాలుగు గ్రామాల్లో మాంగనీసు మూలకంతో భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయి. తెలంగాణలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు 1,174 ఉండగా, మాంగనీస్ మూలకంతో నీరు కలుషితమైన గ్రామాలు మరో మూడు ఉన్నాయి.

ఆయా గ్రామాల్లో రానున్న మూడేళ్లలో ప్రతి వ్యక్తికి 8 నుంచి 10 లీటర్ల రక్షిత నీటిని అందించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రభావిత గ్రామాల్లో నీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, లేదంటే ఆ గ్రామానికి దగ్గర నదులు, కాల్వల నుంచి నీటిని మళ్లించి ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందజేస్తారు. దీనిపై రాష్ట్రాలకు సలహాలిచ్చేందుకు కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా గ్రామాల్లో నీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, భవన వసతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం నిధులు అందజేస్తాయి.

అయితే ఆయా రక్షిత మంచినీటి ప్లాంట్ల నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిధులు అందజేయవు. ఆ బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. ఆ కాంట్రాక్టర్లు గ్రామస్తుల నుంచి నామమాత్రపు రుసుం వసూలు చేస్తూ పదేళ్ల పాటు రక్షిత నీటి ప్లాంట్లు నిర్వహిస్తారు. ఈ రక్షిత నీటి పథకాలను ఏపీలో ఈ ఆర్థిక ఏడాది 166, వచ్చే ఏడాది 333, ఆపై ఏడాది మిగిలిన 250 గ్రామాల్లో ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో ఈ ఏడాది 262, రెండో సంవత్సరం 523, మూడో సంవత్సరం 392 గ్రామాల్లో ఏర్పాటు చేయనున్నారు.

Advertisement
 
Advertisement