నయా కిడ్నాపింగ్ గ్యాంగ్ | Sakshi
Sakshi News home page

నయా కిడ్నాపింగ్ గ్యాంగ్

Published Thu, Feb 11 2016 12:26 AM

నయా కిడ్నాపింగ్ గ్యాంగ్

బిజినెస్ డీల్స్ పేరుతో వ్యాపారులకు ఎర
బెంగళూరుకు పిలిచి కిడ్నాప్
నగరానికి చెందిన ముగ్గురిని రక్షించిన పోలీసులు
అక్కడి మాజీ కార్పొరేటర్ కుమారుడు సూత్రధారి

 
సిటీబ్యూరో: వ్యాపార లావాదేవీల పేరుతో పొరుగు రాష్ట్రాల వ్యాపారులకు ఎర వేయడం... తమ వద్దకు రప్పించి వారిని కిడ్నాప్ చేయడం... కుటుంబీకుల నుంచి అందినకాడికి దండుకుని వదిలిపెట్టడం...కర్ణాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా యథేచ్ఛగా రెచ్చిపోతున్న కిడ్నాపింగ్ గ్యాంగ్ వ్యవహారమిది. వీరి చెరలో చిక్కిన ముగ్గురు నగరవాసుల్ని రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) జోక్యంతో అక్కడి విల్సన్ గార్డెన్ పోలీసులు రెస్క్యూ చేశారు. 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ముఠా ఏజెంట్లుగా స్థానికులు...
బెంగళూరుకు చెందిన ఓ మాజీ మహిళా కార్పొరేటర్ కుమారుడు సందీప్ ఈ గ్యాంగ్‌కు సూత్రధారి. అక్కడి కోరమంగళ, మదికెరి తదితర ప్రాంతాలకు చెందిన 15 మంది చిల్లర దొంగల్ని చేరదీసి ముఠాలో చేర్చుకున్నాడు. వీరంతా బెంగళూరులోని లాల్‌బాగ్ గార్డెన్ వెస్ట్‌గేట్ ప్రాంతంలో ఉన్న ఓ పాత గోడౌన్‌ను డెన్‌గా చేసుకున్నారు. పొరుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలకు చెందిన వారితో ఒప్పందాలు కుదుర్చుకున్న సందీప్ ఆయా ప్రాంతాలకు ఏజెంట్లుగా పెట్టకున్నాడు. ఆయా నగరాల్లో ఉన్న వ్యాపారస్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, వారి లావాదేవీలు తెలుసుకుని సందీప్‌కు సమాచారం ఇవ్వడం వీరి పని.  ఇలా చేసినందుకు ప్రతి కిడ్నాప్‌కు వీరికి కొంత కమిషన్               చెల్లిస్తున్నాడు.
 
‘తక్కువ’ అంటూ రప్పించి...
వ్యాపారస్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకునే ‘లోకల్ ఏజెంట్లు’ వారి లావాదేవీల పూర్తి వివరాలు సందీప్‌కు అందిస్తారు. వీటి ఆధారంగా వారు చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన సరుకు తక్కువ ధరకు ఇస్తామంటూ ఏజెంట్ల ద్వారానే సందీప్ వర్తమానం పంపుతాడు. బెంగళూరు శివార్లలో ఓ కంపెనీ మూతపడుతోందని, అందుకే అతి తక్కువ ధరకు భారీగా సరుకును విక్రయిస్తున్నామంటూ నమ్మబలుకుతాడు. ఇలా తమ వల్లో పడిన వారితో ముందు గా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని, బెంగళూరు వచ్చి సరుకు చూసుకున్న తర్వాత నచ్చితేనే లావాదేవీలు కొనసాగిస్తామంటూ వలవేస్తారు. దీనికి ఆశపడిన వ్యాపారస్తులు బెంగళూరు చేరుకున్న వెంటనే తమ ఆధీనంలోకి తీసుకుని అసలు ‘పని’ ప్రారంభిస్తుందీ గ్యాంగ్.
 
ముగ్గురు ‘సిటీ’జన్ల కిడ్నాప్...
నగరానికి చెందిన ముగ్గురు వ్యాపారులకు గత నెల్లో ఈ ముఠా ఎరవేసింది. శ్రీకాంత్ అనే ఏజెంట్ ద్వారా వ్యవహారాలు నడిపింది. ఈ ముగ్గురినీ 15 రోజుల క్రితం బెంగళూరుకు రప్పించింది. అక్కడికి చేరుకున్న ముగ్గురినీ ఓ కారులో కిడ్నాప్ చేసిన గ్యాంగ్ తమ డె న్‌లో బంధించింది. మారణాయుధాలతో బెదిరించడంతో పాటు తీవ్రంగా గాయపరిచింది. నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వారి కుటుంబీకులకు ఫోన్లు చేసి రూ.20 లక్షల చొప్పున డిమాండ్ చేసింది. దీంతో నగరానికి చెందిన బాధితుల సంబంధీకులు సీఐడీలోని సైబర్ క్రైమ్ ఎస్పీ యు.రామ్మోహన్‌ను సంప్రదించారు. వెంటనే ఆయన బెంగళూరులోని విల్సన్ గార్డెన్ పోలీసులను అప్రమత్తం చేశారు. పూర్తిస్థాయిలో సాంకేతిక సహకారం అందిస్తూ కిడ్నాప్ ముఠాకు చెందిన నలుగురు అరెస్టు అయ్యేలా చేయడంతో పాటు వారి ఆధీనంలో ఉన్న నగరవాసులు ముగ్గుర్నీ రక్షించారు.   పరారీలో ఉన్న 12 మంది ముఠా సభ్యుల కోసం అక్కడి పోలీసులు గాలిస్తున్నారు.
 

Advertisement
Advertisement