'మహ' మాయ | Sakshi
Sakshi News home page

'మహ' మాయ

Published Fri, Dec 19 2014 11:44 PM

'మహ' మాయ

ఆస్తి పన్ను గణనలో అక్రమాలు
సిబ్బంది చేతివాటం
నివాస గృహాలు వాణిజ్య భవనాలుగా గుర్తింపు
సర్వేతో వెలుగు చూస్తున్న వైనం

 
సిటీబ్యూరో: ఆస్తిపన్ను... జీహెచ్‌ఎంసీకి ఎంత మేరకు ఆదాయం తెచ్చి పెడుతుందన్న సంగతి పక్కన పెడితే... ఆ సంస్థలోని కొంతమంది ఉద్యోగులకు మాత్రం పెద్ద ఆదాయ వనరుగా మారింది. ఇప్పటికే వివిధ విభాగాలు అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నాయి. తాజాగా భవనాల ఆస్తిపన్ను విధింపులోనూ వివిధ రూపాల్లో అవినీతి చోటుచేసుకున్నట్టు వెల్లడైంది. వాణిజ్య భవనాలను నివాస గృహాలుగా చూపుతూ కొంతమంది సంస్థను ముంచుతుండ గా... మరికొంతమంది భవనాన్ని ఆస్తిపన్ను జాబితాలోనే చేర్చకుండా ‘ప్రైవేటుగా’ వసూలు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీకి ఏటా రూ.వందల కోట్ల నష్టం వాటిల్లుతోంది. జీహెచ్‌ఎంసీ తాజాగా చేపట్టిన సర్వేలో ఈ వివరాలు వెలుగు చూస్తున్నాయి.

సంఖ్య బారెడు... ఆదాయం మూరెడు

ఈ ఆర్థిక సంవత్సరం ఖజానాను నింపే క్రమంలో వాణిజ్య భవనాల ఆస్తిపన్ను, ట్రేడ్ లెసైన్సులపై అధికారులు దృష్టి సారించారు. నగరంలో మూడు లక్షలకుపైగా వాణిజ్య, వ్యాపార సంస్థలు ఉన్నప్పటికీ, వాటిలో దాదాపు 60 వేల సంస్థలు మాత్రమే ట్రేడ్‌లెసైన్సు ఫీజులు చెల్లిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. పెద్ద సంఖ్యలో వాణిజ్య భవనాల నుంచి నివాస గృహాల రూపంలో వసూలవుతున్నట్టు గుర్తించారు. వాస్తవానికి  నివాస గృహానికి ఆస్తిపన్ను రూ.వెయ్యి ఉంటే... అదే విస్తీర్ణంలోని భవనానికి వాణిజ్య కేటగిరీలో ఏరియాను బట్టి రెండు మూడు రెట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. సిబ్బంది చేతివాటంతో ఇలాంటి వాటిని వాణిజ్య కేటగిరీలో చేర్చకుండా ‘దయ’ చూపిస్తున్నారు. ఇక కార్పొరేటర్లను మచ్చిక చేసుకొని ఇటీవలి వరకు వాణిజ్య కేటగిరీలో నమోదు కాకుండా చేసుకున్న వారు... అసలు జాబితాలోనే లేని వారు భారీ సంఖ్యలోనే ఉన్నారు. స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ ఇలాంటి వాటిపై దృష్టి సారించారు. విద్యుత్ శాఖ నుంచి వాణిజ్య కేటగిరీలోని భవనాల జాబితా తెప్పించారు. గ్రేటర్‌లో దాదాపు 3.13 లక్షల కనెక్షన్లు వాణిజ్య కేటగిరీలో ఉన్నాయి. వాటితో పోలుస్తూ, తమ సిబ్బందితో సర్వే చేయించారు. వచ్చే నెల రెండో వారంలోగా సర్వే పూర్తి చేసి, పన్ను వసూలు చేయాలని ఆయన ఆదేశించారు.

రూ.200 కోట్లు వచ్చే అవకాశం

ఇంతవరకు ఆస్తిపన్ను పరిధిలోకి రాని 3,218 భవనాలను, నివాస గృహాల పేరిట వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న 22,046, భవనాలను, పన్ను పరిధిలో కనిపించని 1,336 భవనాలు (మొత్తం 26,600) గుర్తించినట్లు జీహెచ్‌ఎంసీ డేటాబేస్‌లో పేర్కొన్నారు.  ఇంకా గుర్తించాల్సినవి చాలా ఉన్నాయి. గుర్తించిన వాటిలో 4975 భవనాలకు స్పెషల్ నోటీసులు జారీ చేశారు. వారంతా ఆదనంగా చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా ఆస్తిపన్ను రేపేణా జీహెచ్‌ఎంసీకి అదనంగా రూ. 10 కోట్లు రాగలదని అంచనా. మొత్తం సర్వే పూర్తయితే ఈ ఆదాయం రూ.200 కోట్లకు పైగా పెరుగుతుందని భావిస్తున్నారు.

లబోదిబోమంటున్న చిరు వ్యాపారులు

 ఇదిలా ఉండగా, జిరాక్స్ సెంటర్లు, రోడ్డు పక్క టిఫిన్ సెంటర్లకు సైతం కరెంటు కనెక్షన్లు వాణిజ్య కేటగిరీలో ఉన్నాయి. వాటి ఆధారంగా ఆస్తిపన్ను వసూలుతో పాటు భవన యజమానులు తమపై మరింత భారం మోపుతారని చిరువ్యాపారులు లబోదిబోమంటున్నారు.
 
థర్ ్డపార్టీతోనూ సర్వే..
 

ఆస్తిపన్ను విధింపులో జీహెచ్‌ఎంసీలోని కొంతమంది సిబ్బం ది చేతివాటం ఉండటం వల్ల తాజా సర్వేలోనూ అవకతవకలకు ఆస్కారం ఉండగలదని అధికారులు భావిస్తున్నారు. దీంతో థర్డ్‌పార్టీతో మరో మారు సర్వే జరిపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ప్రైవేటు సంస్థను టెండ రు ద్వారా ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
 

Advertisement
Advertisement