నష్టాలు లేనిచోటే 24 గంటల విద్యుత్ | Sakshi
Sakshi News home page

నష్టాలు లేనిచోటే 24 గంటల విద్యుత్

Published Fri, Sep 19 2014 4:00 AM

24 hours power supply scheme

* అందుకు అనుగుణంగా ప్రాంతాల ఎంపిక
* మొత్తం 2 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు, 39 మండలాలు
* అధిక నష్టాలున్న గిరిజన ప్రాంతాలు దూరం
* అదనంగా 50 మెగావాట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ
* ఒప్పంద ఖర్చులో 25 శాతం భరించాలని విజ్ఞప్తి
 

సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరాలో నష్టాలు అతి తక్కువగా, వ్యవసాయ వాడకం పెద్దగాలేని ప్రాంతాల్లోనే నిరంతర విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఇందుకోసం తిరుపతి, విశాఖపట్నంతోపాటు మరికొన్ని మండలాలు, మున్సిపాలిటీలను జాబితాలో చేర్చింది. మొదట్లో పట్టణ ప్రాంతాల్లోనే అమలు చేయాలనుకున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే విమర్శలొస్తాయన్న ఆందోళన వ్యక్తమైంది. దీంతో పంపిణీ నష్టాలు రెండు శాతం మించని, సరఫరాకు తగ్గట్టుగా చెల్లింపు జరుగుతున్న మండలాలు, మున్సిపాలిటీలను కూడా చేర్చారు. 35 నుంచి 65 శాతం నష్టాలున్న గిరిజన, ఇతరప్రాంతాలను దూరంగా ఉంచారు. ఇలా మొత్తం రెండు కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీలు, 39 మండలాలను ఎంపిక చేశారు.

ఈ మేరకు అక్టోబర్ రెండు నుంచి నిరంతర విద్యుత్ పథకానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ, ఎంపిక చేసిన ప్రాంతాల వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంధనశాఖ అధికారులు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. అలాగే నిరంతర విద్యుత్ పథకం కోసం అదనంగా మరో 50 మెగావాట్లు ఎవరికీ ఇవ్వని కోటా నుంచి కేటాయించాలని రాష్ట్ర సర్కారు కోరింది. ఇప్పటికే 200 మెగావాట్లు ఇస్తున్న కేంద్రం, తాజా ప్రతిపాదనకు సానుకూలత వ్యక్తం చేసింది. దీంతోపాటు ఒప్పందాల నేపథ్యంలో అయిన మొత్తం రూ. 15 కోట్ల ఖర్చులో, 25 శాతం (రూ. 3.75 కోట్లు) మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఒప్పందాలు కుదిరినప్పటికీ, అదనపు విద్యుత్, ఖర్చులపై స్పష్టమైన విధానాలు లేకపోవడంతో, కేంద్రాన్ని నొప్పించకుండా వ్యవహరించాలన్న రీతిలో రాష్ట్ర ఇంధన శాఖ ఆచితూచి అడుగులు వేస్తోంది.

పవర్ కట్ తప్పనిసరి
నిరంతర విద్యుత్ అమలు చేసినా, పెద్దగా డిమాండ్ పెరగదనే అధికారులు చెబుతున్నారు. అయితే అనూహ్యంగా ఉత్పత్తి తగ్గి, డిమాండ్ పెరిగే పక్షంలో అవసరమైన ముందస్తు చర్యలకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంవల్ల వాణిజ్య, వ్యాపార వర్గాలు సాధారణ స్థాయిలోనే విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. వాతావరణం మారినా, ఎండల తీవ్రత పెరిగినా డిమాండ్ పెరగవచ్చనే అంచనాలున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య సంస్థలకు, గ్రామాల్లో వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘అందరికీ విద్యుత్’ పథకం అమలు చేసే ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ కొనసాగిస్తూనే, ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల్లో విద్యుత్ కోత అమలు చేసే యోచనలో ఉన్నారు. ఈ దిశగానూ కసరత్తు చేసిన ఇంధన శాఖ, 50 శాతంకు మించి పంపిణీ నష్టాలున్న ప్రాంతాలను గుర్తించింది. వ్యవసాయ పంపుసెట్లకు ఐఎస్‌ఐ మార్కులేని మోటార్లు వాడే గ్రామాలు, ఎల్‌ఈడీ కాకుండా, సాధారణ బల్బులు వాడే ఏరియాల్లో ఈ నష్టాలు ఎక్కువగా ఉండే వీలుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు అమలు చేయడంవల్ల, ఎంపిక చేసిన ప్రాంతాలకు నిరంతర విద్యుత్ ఇవ్వొచ్చని లెక్కలు కట్టారు.
 
రూ. 200కే ఎల్‌ఈడీ బల్బు
నిరంతర విద్యుత్ పథకంలో భాగంగా విద్యుత్ పొదుపును కూడా ప్రభుత్వం ఎజెండాగా తీసుకుంది. మున్సిపాలిటీలు, నగరాలు, పంచాయతీల పరిధిలో పెద్ద ఎత్తున ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేసేందుకు ఎనర్జీ ఎఫిషియన్సీ లిమిటెడ్‌తో ఒప్పందం కుదిరింది. ఇప్పటికే ప్రముఖ విద్యుత్ బల్బుల కంపెనీ ఫిలిప్స్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల ఎల్‌ఈడీ బల్బులను ఒక్కొక్కటీ రూ. 200కే అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మార్కెట్ రేటుతో పోలిస్తే ఇది అతి చౌకగా ఉండటంతో ప్రభుత్వం దీన్ని స్వాగతించే వీలుంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, తండాల్లోనూ ఇదే కంపెనీ బల్బులను సరఫరా చేసే అవకాశం కన్పిస్తోంది. అయితే అందులో వాడే ఫిలమెంట్లు, ఇతర పదార్థాల నాణ్యత ఏమిటి అనే దానిపై అధికారులు స్పష్టత కోరుతున్నారు.

Advertisement
Advertisement