అచ్చెన్న అరాచకం

అచ్చెన్న అరాచకం - Sakshi


సంతబొమ్మాళి, న్యూస్‌లైన్: ఒకప్పుడు టీడీపీ కంచుకోట అయిన సంతబొమ్మాళి మండలంలో ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తండటం.. దానికి కింజరాపు కుటుంబం వెన్నుదన్నుగా నిలవడం తెలిసిందే. దాంతో మండలంలోని థర్మల్ ప్రభావిత గ్రామాల్లో టీడీపీ పట్టుకోల్పోయింది. ఈ నేపథ్యంలో టెక్కలి టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం ఆకాశలక్కవరం పంచాయతీలో ఎన్నికల ప్రచారానికి గురువారం మందీమార్బలంతో తరలివెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల మహిళలు సీరపువానిపేట జంక్షన్ వద్ద కాపు కాశారు. అచ్చెన్న కాన్వాయ్ రాగానే.. దానికి అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. అచ్చెన్న గోబ్యాక్ అన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ‘పవర్ ప్లాంట్‌కు అనుకూలంగా మారి మా బతుకులు బుగ్గిపాల్జేశావు. కాల్పుల్లో ముగ్గురు రైతుల చావుకు కారణమయ్యావు. తుఫాన్లతో మా బతుకులు అతలాకుతలమైనప్పుడూ పట్టించుకోలేదు. కష్టకాలంలో మావైపు కన్నెత్తి చూడని నువ్వు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం మా గ్రామాలకు వస్తున్నావు’.. అంటూ మహిళలు టీడీపీ అభ్యర్థిని నిలదీశారు.

 

 నన్నే నిలదీస్తారా?..

 మహిళల నిరసనను.. తనకు జరిగిన పరాభవంగా అచ్చెన్నాయుడు భావించారు. వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా ఉక్రోషంతో విరుచుకుపడ్డారు. తన వెంట ఉన్న టీడీపీ కార్యకర్తలనూ వారిపైకి ఉసిగొల్పారు. అంతే అందరూ కలిసి రోడ్డుకు అడ్డంగా ఉన్న మహిళపై వీరంగం చేశారు. ద్విచక్ర వాహనాలతో మహిళలను తొక్కించారు. కొందరినీ విసురుగా తోసేశారు. అడ్డుపడిన పోలీసులను సైతం నెట్టేశారు. ఈ దౌర్జన్యకాండలో ఆకాశలక్కవరం గ్రామానికి చెందిన రోకళ్ల నీలవేణి తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే అపస్మారక స్థితికి చేరుకుంది. అయినా అచ్చెన్న ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా మిగిలిన వారిపై కూడా తన అనుచరగణాన్ని పురిగొల్పడంతో ద్విచక్ర వాహనాల కింద పడి దువ్వు సత్యవతి, సీరపు అమ్మాయమ్మ అనే మరో ఇద్దరు మహిళలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఊహించని ఈ దాడితో మహిళలు భీతిల్లారు. రోదించడం మొదలుపెట్టారు. అవేవీ పట్టించుకోకుండా అచ్చెన్నాయుడు తన అనుచరగణంతో గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం చేసుకున్నారు. సీరపువానిపేట జంక్షన్ వద్ద మహిళలపై దాడి జరిగిన విషయం మండలమంతా దావానలంలా వ్యాపించడంతో బాధితుల బంధువులతో పాటు వివిధ గ్రామాల ప్రజలు అక్కడకు చేరుకున్నారు. దెబ్బలు తగిలిన వారిని టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

 

 అచ్చెన్నాయుడుపై ఫిర్యాదు

 సీరపువానిపేట జంక్షన్ వద్ద మహిళలపై అచ్చెన్నాయుడు, ఆయన అనుచరులు జరిపిన దాడిపై బాధితులు నౌపడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దౌర్జన్య కాండలో తీవ్రంగా గాయపడిన రోకళ్ల నీలవేణి, దువ్వు సత్యవతి, సీరపు అమ్మాయమ్మ తదితరులు అచ్చెన్నాయుడు సహా నిందితులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.

 

 మండిపడుతున్న థర్మల్ బాధిత గ్రామాలు

 మహిళలపై అచ్చెన్న బృందం దాడి సంఘటనతో థర్మల్ ప్రభావిత గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ఆనాడు థర్మల్‌కు అనుకూలంగా ప్రవర్తించి మా బతుకులు బుగ్గిపాలు చేసిన అచ్చెన్నాయుడు ఇప్పుడు ప్రచారం పేరుతో మా గ్రామాలకు వచ్చి నిలదీసిన వారిపై దాడికి తెగబడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో తమ సత్తా చూపించి అచ్చెన్నాయుడుకు గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.



 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top