చంద్రుని షో వెలవెల | Sakshi
Sakshi News home page

చంద్రుని షో వెలవెల

Published Fri, Apr 25 2014 2:18 AM

no response to chandrababu naidu's sabha

కొత్తగూడెం, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత చంద్రబాబు కొత్తగూడెం పర్యటన వెలవెలబోయింది. సభా ప్రాంగణం ప్రకాశం స్టేడియం జనంలేక బోసిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన చంద్రబాబు బహిరంగసభకు జనసమీకరణ చేయడంలో ఆ పార్టీ స్థానిక నేతలు విఫలం అయ్యారు.

 నియోజకవర్గంలో అంతంతమాత్రంగా ఉన్న పార్టీకి కలిసి వస్తుందని భావించి చంద్రబాబును రప్పించినా జనం రాకపోవడం.. పసలేని ప్రసంగంతో వచ్చిన జనాలు కాస్త వెనుదిరిగి వెళ్లడంతో స్థానిక నేతల లక్ష్యం నెరవేరినట్టు లేదు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని షామియానాలు వేసినా అందులో కేవలం మూడువేల కుర్చీలను మాత్రమే వేయించారు. టెంట్లు సక్రమంగా లేకపోవడంతో జనం ఉక్కపోతతో అల్లాడారు. కొంతమంది బాబు రాకముందే తిరుగుపయనమయ్యారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సిన ఆ పార్టీ అధినేత 1.12 గంటలకు ప్రకాశం స్టేడియానికి చేరుకున్నారు.

 మంచినీళ్ల కోసం మహిళల మండిపాటు..
 ఒకవైపు మండుటెండ, మరోవైపు స్టేడియంలో ఉక్కపోతతో మహిళలు తీవ్ర అసహనానికి లోనయ్యారు. కనీసం మంచినీళ్లు కూడా సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో నాయకులపై ప్రధాన స్టేజీ ముందున్న మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గంటలో వెళ్లొచ్చని తీసుకొచ్చారు.. పొద్దట్నుంచి ఇక్కడే ఉన్నాం.. మీరేమో కూలర్లు పెట్టుకుని, చల్లని నీళ్లు తాగుతూ తిరుగుతున్నారు.. మాకు నీళ్లు ఎవరు ఇస్తారు..’ అని మండిపడ్డారు. మహిళలు పెద్దపెట్టున మొత్తుకోవడంతో స్టేజీపైనున్న నాయకులు మంచినీళ్లు ఏర్పాటు చేయాలని సూచించినా వలంటీర్లు స్పందించకపోవడం గమనార్హం.

 మధ్యలోనే ఇంటిముఖం..
 తొలుత ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పావుగంట ప్రసంగించారు. ఆ తర్వాత బాబు ఊకదంపుడు ఉపన్యాసం మొదలుపెట్టడంతో మధ్యలోనే జనం వెళ్లిపోయారు. సభా ప్రాంగణం ముందున్నవారందరూ ఒక్కసారిగా లేవడంతో వెనుక ఉన్నవారికి వేదికపైనున్న నేతలు కనిపించకపోవడంతో జనం వెనుదిరిగి వెళ్లారు.  ఎన్‌డీఏతో పొత్తు వల్ల ముస్లిం, మైనార్టీలకు ఎక్కడ దూరం కావాల్సి వస్తుందోనని చంద్రబాబు తన ప్రసంగంలో ‘ఎన్‌డీఏతో పొత్తు పెట్టుకోవడం వల్ల మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు.. మాది నిజమైన సెక్యులర్ పార్టీ..’ అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

 తుమ్మల వర్గం దూరం
 నియోజకవర్గంలో ఇప్పటికే దరిదాపుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న తుమ్మల వర్గం నేతలు చివరకు అధినేత బహిరంగ సభకు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. సింగరేణిలో బలమైన నాయకుడిగా ఉన్న టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి బిక్కసాని నాగేశ్వరరావు, కాపా కృష్ణమోహన్‌లు సభకు హాజరు కాలేదు. మేజర్ పంచాయతీ చుంచుపల్లిలో బలమైన కేడర్ ఉన్న బిక్కసాని వర్గీయులు సభకు దూరంగా ఉండటం వల్లే జనం తక్కువగా హాజరయ్యారనే గుసగుసలు వినిపించాయి.

Advertisement
Advertisement