బొత్స ఫ్యామిలీ.. జంబో ప్యాకేజి!! | Sakshi
Sakshi News home page

బొత్స ఫ్యామిలీ.. జంబో ప్యాకేజి!!

Published Wed, Apr 16 2014 3:34 PM

బొత్స ఫ్యామిలీ.. జంబో ప్యాకేజి!! - Sakshi

ఒకే కుటుంబం నుంచి ఒకేసారి ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేయచ్చు? కాంగ్రెస్ పార్టీ అయితే ఈసారి ఒక కుటుంబం నుంచి ఒకరికే అవకాశం ఇస్తామంటూ మొదట్లో బీరాలు పలికింది. దాంతో చాలామంది సీనియర్ నాయకులు తమ వారసులను రంగంలోకి దింపలేకపోయారు. కొంతమందయితే వారసుల కోసం తాము త్యాగాలు చేయాల్సి వచ్చింది. అయితే, కొంతమందికి వర్తించిన ఈ నిబంధనను అందరికీ వర్తింపజేయలేదు. నిన్న మొన్నటి వరకు సమైక్య రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన బొత్స సత్యానారాయణ కుటుంబం ఈ విషయంలో జంబో ప్యాకేజి తీసుకుందనే చెప్ప తప్పదు. ముందునుంచి కూడా విజయనగరం రాజకీయాల్లో మొత్తం జిల్లా అంతటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలన్నట్లే బొత్స కుటుంబం వ్యవహరించింది. ఇంతకుముందు కూడా ఎంపీ స్థానం, రెండు లేదా మూడు ఎమ్మెల్యే స్థానాలు, జిల్లా పరిషత్ చైర్మన్ పదవి.. ఇలా ఎక్కడ ఎలాంటి పదవి చూసినా అది తమ కుటుంబానికి జేబులో వచ్చి పడాలన్నట్లుగా వ్యవహరించేవారు.

ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం, అందునా యువరాజు రాహుల్ గాంధీ పెట్టిన నిబంధనను సైతం తోసిరాజని బొత్స కుటుంబానికి ఏకంగా నాలుగు టికెట్లు కేటాయించేశారు. నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి ఇచ్చిన మూడు టికెట్ల కంటే కూడా ఇది ఒకటి ఎక్కువే అయ్యింది. విజయనగరం పార్లమెంటు స్థానానికి సత్తిబాబు సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఇక స్వయంగా బొత్స సత్యనారాయణ తాను ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన చీపురుపల్లి నుంచే మరోసారి పోటీ చేస్తున్నారు. సత్తిబాబు తమ్ముడు అప్పల నరసయ్య గజపతినగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ పడుతుండగా మరో సమీప బంధువు బడుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఇలా ఏకంగా నాలుగు టికెట్లు దక్కించుకున్న కుటుంబం బహుశా ఇదొక్కటే అయ్యి ఉంటుందని కాంగ్రెస్ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు.

Advertisement
Advertisement