కల నెరవేరకుండానే..

కల నెరవేరకుండానే..


హాస్యనటుడు పొట్టి రాంబాబు మృతి

వందకు పైగా సినిమాల్లో వివిధ పాత్రలు

హీరోగా సినిమా పూర్తికాకుండానే కన్నుమూత


 

జగ్గంపేట : చిన్ననాటి నుంచి ఆయనకు నాటకాలంటే మక్కువ. ఊళ్లో ఏ ఉత్సవం జరిగినా అక్కడ వేదికపై ఆయన ప్రదర్శన ఉండేది. తనదైన శైలిలో అందర్నీ మెప్పించి ‘మనోడు నటనలో గట్టివాడు’ అనిపించుకునేవారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఓ నాటక ప్రదర్శన ఆయన సినీ రంగంలోకి సోపానం అరుుంది. ప్రముఖ నటుడు విజయ్‌చందర్.... రాంబాబు ప్రతిభను గుర్తించి సినీ అవకాశాన్ని కల్పించారు. వందకు పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నవ్వుల పువ్వులు పూయించి, ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పొట్టి రాంబాబు అందరికీ విషాదం మిగిల్చి వెళ్లిపోయూడు! హైదరాబాద్ శ్రీనగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున మరణించారు. ఆయన స్వగ్రామం కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.




పొట్టి రాంబాబు అసలు పేరు కనపర్తి రాంబాబు (43). ‘ఈశ్వర్’తో పరిశ్రమకు పరిచయమై వందకుపైగా సినిమాల్లో నటించారు. రాంబాబుకు భార్య మంగ, మూడేళ్ల కుమారుడు వేణు, ఏడాది వయసు గల కుమార్తె ఉన్నారు. హైదరాబాద్‌లో మకాం ఉంటున్నా ఎక్కువగా జగ్గంపేటలోనే ఉండేవారు. సినిమా షూటింగ్‌ల కోసం జిల్లాకు వచ్చిన సందర్భంలో ఎక్కువగా  తోటి నటులను జగ్గంపేట తీసుకువచ్చి స్థానికులు, స్నేహితులకు పరిచయం చేసేవారు. వారం రోజుల క్రితం రాజమండ్రిలో జరిగిన ఓ సినిమా షూటింగ్‌లో  నటించారు.  

 

 ‘తూర్పు’ యాసతో హాస్యం పండించాడు..

ఈశ్వర్ సినిమాలో హీరో మిత్ర బృందంలో పనసకాయ పట్టుకుని తిరిగే క్యారెక్టర్‌లో తూర్పు గోదావరి యాసతో రాంబాబు హాస్యాన్ని పండించారు. ఆ తర్వాత చంటిగాడు చిత్రంలో కోటప్పకొండ పాత్రలో కడుపుబ్బ నవ్వించారు. జగ్గంపేట గ్రామ దేవత రావులమ్మ తల్లి అంటే రాంబాబుకు ఎంతో భక్తి. స్వగ్రామానికి వచ్చిన ప్రతిసారీ అమ్మవారి దర్శనం చేసుకునేవారు. తమిళంలో కూడా రెండు చిత్రాల్లో నటించారు. రాంబాబు హీరోగా ‘పులిరాజా ఐపీఎస్’ చిత్రాన్ని ఈ ఏడాది ప్రారంభించారు. చిత్రం షూటింగ్ దశలో ఉండగా తండ్రి పాత్రలో నటిస్తున్న ఎంఎస్ నారాయణ మృతి చెందడంతో కొన్నాళ్లు షూటింగ్ వాయిదాపడింది.

 

 స్వగ్రామంలో విషాదఛాయలు

 రాంబాబు మృతితో బూరుగుపూడిలో విషాదఛాయలు నెలకొన్నాయి. అతడి తల్లి, భార్యను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. రాంబాబుతో అనుబంధాన్ని స్థానికులు గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. రాంబాబు మృతదేహానికి బుధవారం బూరుగుపూడిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top