లంక లంకకో రావణుడు

లంక లంకకో రావణుడు - Sakshi


ఆదిలోనే లంక, అసైన్డు భూములపై కన్నేసిన పచ్చ గద్దలు



ఆనాడు రావణాసురుడు సీతమ్మను చెరబట్టే ప్రయత్నం చేస్తే.. ఈనాటి రావణాసురులు భూమాతపై కన్నేశారు. కృష్ణా నదిలోని లంకలన్నింటినీ స్వాధీనం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాజధాని భూసమీకరణ పరిధి నుంచి ఏకంగా లంకలను తప్పించేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం ఆ భూములను లాక్కుంటుందంటూ బడుగులను భయపెట్టారు. దళిత పేద రైతులను దిక్కుతోచని దుస్థితిలో కూరుకుపోయేలా చేశారు. ఈ సమయంలో పచ్చ రాబందులు లంకలపై వాలాయి. ఎకరం కనిష్టంగా రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.35 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. అస్మదీయుల భూదోపిడీ ముగిశాక లంక భూములను సమీకరిస్తున్నట్లు.. పరిహారం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.

 

నోటిఫికేషన్‌లో తప్పించేశారు!

రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల పరిధిలో 13 లంకలు ఉన్నాయి. ఈ లంకల్లో 574.93 ఎకరాలు అసైన్డు భూమి కాగా 1,584.24 ఎకరాలు లంక భూమి. మొత్తం 2159.17 ఎకరాలను 1954 నుంచి 1976 వరకూ ప్రభుత్వం దళిత పేద రైతులకు 77 సెంట్ల నుంచి ఎకరం లోపు పంపిణీ చేస్తూ వచ్చింది. ఆ భూములను దళిత పేద రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో భూసమీకరణకు జనవరి 1, 2015న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో పట్టా, అసైన్డు భూములను మాత్రమే సమీకరిస్తున్నట్లు పేర్కొంది. లంక భూముల ప్రస్తావన ఆ ఉత్తర్వుల్లో కన్పించకుండా సీఎం చంద్రబాబునాయుడు చక్రం తిప్పారు.



లంకల్లో రాబందులు

రాజధాని భూసమీకరణ సమయంలో మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావులు మూణ్నెళ్లపాటు తిష్ట వేసి.. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రధానంగా లంక భూములు ఎంత ఉన్నాయన్నది ఆరా తీశారు. భూసమీకరణ ఉత్తర్వులు, నోటిఫికేషన్‌లో లంక భూములను చేర్చని వైనాన్ని అనుచరుల వద్ద ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా ఆ భూములను లాక్కుంటుందంటూ వాటి లబ్ధిదారులను బెదరగొట్టాలని సూచించారు. దాంతో 13 గ్రామాల్లోనూ తిష్ట వేసిన మంత్రుల అనుచరులు.. లంక భూములు సాగుచేసుకుంటోన్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి బెదరగొట్టారు. ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటే బతకలేమని ఆందోళన చెందిన లబ్ధిదారులు.. ఆ భూములను తెగనమ్మేయడానికి సిద్ధపడ్డారు. ఇదే అంశాన్ని మంత్రులకు వారి అనుచరులు చేరవేశారు. దాంతో రియల్ ఎస్టేట్ బ్రోకర్లను రంగంలోకి దించి.. ఒక్కో లంకలో ఒక్కొక్కరు చొప్పున భూములు కొనుగోలు చేశారు. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం లంకల్లో సీఎం తనయుడు లోకేష్, మంత్రి ప్రత్తి పాటి, తాళ్లాయపాలెం, వెంకట పాలెం లంకల్లో మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, మరో మంత్రి ప్రత్తిపాటి, రాయపూడి లంకల్లో మంత్రి నారాయణ, మందడం, ఉండవల్లి లంకల్లో  హిందూపురం ఎమ్మెల్యే,  బాలకృష్ణ వియ్యంకుడు భూములను కొనుగోలు చేశారని ఆ లంకలకు చెందిన దళిత పేద రైతులు ‘సాక్షి’కి చెప్పారు.



ఒక్క మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాత్రమే తన బినామీ గుమ్మడి సురేష్ పేరుతో 96.4 ఎకరాల లంక భూములను కొనుగోలు చేశారు. ఇందులో వెంకటపాలెం లంకలో 1.01 ఎకరాల కొనుగోలు చేసిన భూమిని మాత్రమే మంగళగిరి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తక్కిన భూములను రిజిస్టర్ చేయడానికి అధికారులు నిరాకరించడంతో.. అగ్రిమెంట్లు చేసుకున్నారు. మిగతా మంత్రులు కూడా లంక భూములను కొనుగోలు చేసినట్లు లబ్ధిదారులతో ఒప్పందాలు మాత్రమే చేసుకోవడం గమనార్హం. దళిత నిరుపేద రైతుల నుంచి లంక భూములు కొన్న పచ్చ గద్దలు.. సంబంధిత రైతుల నుంచి పట్టాదారు పాసుపుస్తకాలు, అసైన్‌మెంట్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన పత్రాలతోసహా ఆ భూములకు సంబంధించిన అన్ని ఆధారాలను ముందు జాగ్రత్తగా స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

 

రూ.2,500 కోట్లకుపైగా దోపిడీ


చంద్రబాబు తనయుడు, టీడీపీ నేతలు లంక భూములను కొనుగోలు చేశాక తొలి విడతగా రాయపూడి గ్రామ పరిధిలోని ఆరు లంకల్లో 1093 ఎకరాలు, ఉండవల్లి లంకలో 162.50 ఎకరాల సమీకరణకు డిసెంబరు 6న నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ.. సర్వే నెంబర్లు, రైతుల వారీగా నోటిఫికేషన్ జారీ చేస్తే.. టీడీపీ నేతల  భూదోపిడీ అధికారికంగా బహిర్గతమవుతుందనే భయంతో నామమాత్రపు నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. ఇది నిబంధనలకు విరుద్ధమని సీఆర్‌డీఏ అధికారులే స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం లంక భూముల సమీకరణకు అంగీకరించడంతో ఎకరం భూమి రూ.1.75 కోట్లకుపైగా పలుకుతోంది. లంక భూముల లబ్ధిదారులకు కాకుం డా.. వాటిని కొనుగోలు చేసిన అధికారపార్టీ నేతలకు ప్రయోజనం చేకూరేలా చట్టాన్ని సవరించాలంటూ ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు సీసీఎల్ (భూపరి పాలన కమిషనర్) అధికారులను ఆదేశిం చారు. తద్వారా తన తనయుడు, అస్మదీయులకు రూ.2,500 కోట్లకుపైగా విలువైన లంక భూములపై యాజమా న్య హక్కులు కల్పించి, ప్రయోజనం చేకూర్చడానికి సిద్ధమైనట్లు  తెలుస్తోంది.

 

ఆంజనేయులు ‘వాటా’ 4.69 ఎకరాలు!


రాజధాని ప్రకటనకు ముందే తుళ్లూరు ప్రాంతంలో రాజధాని వస్తుందని తెలుసుకున్న టీడీపీ నేతలు రైతులను మోసగించి తక్కువ ధరలకు భూములు కొట్టేసిన వైనం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చేరారు. ఆయన తన కుటుంబ సభ్యుల పేర్లతోపాటు, బినామీ పేర్లతో భారీ ఎత్తున భూములను కొనుగోలు చేశారు. కోర్ క్యాపిటల్‌లోని తుళ్లూరుకు అతి దగ్గరగా ఉండే ఐనవోలు గ్రామంలో 4.69 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సర్వే నెంబరు 77-2లో 2.26 ఎకరాలు, 121-7 లో 0.97 ఎకరాలు,  137-2లో 1.46 ఎకరాలు చొప్పున తన కుమార్తె గోనుగుంట్ల లక్ష్మీసౌజన్య పేరుతో 2014లో రిజిస్టర్ చేయించుకున్నారు. అప్పట్లో ఎకరం రూ. 3.9 లక్షలు చొప్పున 4.69 ఎకరాలను రూ. 18.29 లక్షలకే కొనుగోలు చేశారు. ఐనవోలులో ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 2 కోట్లు ఉన్నట్లు చెబుతున్నారు. అంటే ఏడాది కాలంలో జీవీ ఆంజనేయులు భూములకు 50 రెట్లకుపైగా ధర పెరిగింది. జిల్లాలో ప్రజా రాజధాని నిర్మాణం ప్రజల అదృష్టమని చెప్పే జీవీ రైతుల భూములను అతి తక్కువ ధరకే కొట్టేసి వారికి తీవ్ర అన్యాయం చేయడం ఎంత వరకు సమంజసమో ఆయనే చెప్పాల్సి ఉంది.

 

ధూళిపాళ్ల ఆగలేదు...


గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో వాగు పోరంబోకు భూములను కాజేసిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అంతటితో ఆగలేదు. ముందుగానే రాజధాని నిర్మాణం తుళ్లూరులో జరుగబోతుందని తెలుసుకుని కోర్ క్యాపిటల్‌కు అతి దగ్గరగా ఉండే ఐనవోలు గ్రామంలోని సర్వేనెంబరు 69-1లో 0.72 ఎకరాలు, 69-2లో 2.86 ఎకరాల భూమిని తన పెద్దకుమార్తె ధూళిపాళ్ల వీరవైష్ణవి పేరుతో కొనుగోలు చేశారు. ఈ భూమిని 2014లో ఎకరా రూ. 3.80 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అంటే మొత్తం 3.58 ఎకరాలను రూ. 13.60 లక్షలకు కొనుగోలు చేయగా, ప్రస్తుతం ఆగ్రామంలో ఎకరం భూమి ధర రూ. 2 కోట్ల వరకు పలుకుతుంది. ఇలా రాజధాని ప్రాంతంలో 50 ఎకరాలకు పైగా బినామీ పేర్లతో ధూళిపాళ్ల నరేంద్ర కొనుగోలు చేసినట్లు సమాచారం.

 

భూములు కొన్నది టీడీపీ నేతలే

లంక గ్రామాల్లో ఉండే దళిత పేదల్లో అధిక శాతం మంది నిరక్షరాస్యులే. మా అన్న కూడా 77 సెంట్ల భూమిని అమ్మేశారు. ల్యాండ్ పూలింగ్ విషయంలో అధికార పార్టీ నేతలు చెప్పిందే నమ్మారు. భూములు లాగేసు కుంటారన్న భయంతో ఎవరికి వారు దక్కిన బేరానికి అమ్మేశారు. మంగళగిరికి చెందిన బ్రహ్మారెడ్డి, విజయవాడకు చెందిన సురేష్‌లు లోకేష్, బాలకృష్ణ, మంత్రులు నారాయణ, దేవినేని ఉమా, ఎంపీ గల్లా జయదేవ్‌లకు బినామీ పేర్లతో మా ఊర్లోనే 150 ఎకరాలకుపైగా భూములు కొని పెట్టారు.  ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కింద లంక, అసైన్డు భూములు తీసుకుంటామని ప్రకటించడంతో ధరలు బాగా పెరిగాయి.     - తిరుమనపల్లి ప్రకాశ్, తాళ్లాయపాలెం లంక

 

భయపెట్టి లాక్కున్నారు

ప్రభుత్వం ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుం టారని రోజుకో రకంగా గ్రామంలో ప్రచారం జరిగింది. అధికారుల్ని అడిగితే అది ప్రభుత్వం ఇచ్చిందే కదా, అవసరమైతే ఉచితంగా ఇచ్చేయాల్సిందే అన్నారు. ప్రభుత్వం తీసేసుకుంటే రోడ్డున పడిపోతానని భయంతో పొలానికి బేరం పెట్టాను. 90 సెంట్ల భూమిని రూ.16 లక్షలకు అమ్ముకున్నాను. ఇప్పుడా పొలం రూ. 1.50 కోట్ల వరకు పలుకుతోంది. అసైన్ఢ్ భూములపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని మొదటి నుంచి చెప్పకపోవడంతోనే అమ్ముకోవాల్సి వచ్చింది.

 - నందిగం నాగేంద్రమ్మ,ఉద్దండరాయునిపాలెం.

 

భయంతోనే అమ్మేశా

ఎకరం లంక భూమే మా కుటుంబానికి జీవనా ధారం. ప్రభుత్వం ఉత్తినే లాగేసుకుం టుందని టీడీపీ నేతలు లంకలో ప్రచారం చేశారు. ఈలోగా పిల్లకు పెళ్లి కుదిరింది. మంగళగిరికి చెందిన దళారీ బ్రహ్మారెడ్డి ద్వారా ఎకరా రూ.22 లక్షలకు అమ్మేశా. అడ్వాన్సుగా  రూ.5 లక్షలు ఇచ్చారు. తక్కిన రూ.17 లక్షలు ల్యాండ్ పూలింగ్ కింద భూమి తీసుకుంటేనే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కింద లంక భూములు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుండటంతో ఎకరం రూ.1.50 కోట్లకుపైగా పలుకుతోంది. టీడీపీ నేతలు భయపెట్టడం వల్ల నేను తక్కువ ధరకే భూమిని అమ్మి.. రూ.1.28 కోట్ల మేర నష్టపోయా.  - మందల మేరీబాబు,ఉద్దండరాయునిపాలెం లంక

 

టీడీపీ కార్యకర్తనైన నన్నే మోసం చేశారు


నాకు లంకలో 1.40 ఎకరాల భూమి ఉంది. లంక భూములను ప్రభుత్వం ఉత్తినే లాగేసుకుంటుందని మా పార్టీ నేతలు ప్రచారం చేయడంతో భయమేసింది. మొత్తం భూమిని రూ.40 లక్షలకు అమ్మేశా. అడ్వాన్సు కింద రూ.పది లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కింద లంక భూము లు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడం తో ఎకరం రూ.1.50 కోట్లకుపైగా పలుకు తోంది. అధికార పార్టీకి చెందిన పంచాయతీ సభ్యున్నైన నన్నే మోసం చేయడం బాధ కలిగించింది.     

 - సుద్దపల్లి కోటేశ్వరరావు, ఉద్దండరాయునిపాలెం లంక

 

అధికారులూ భయపెట్టారు

అసైన్డ్ భూములకు నష్టపరిహారం రాదని సీఆర్‌డీఏ అధికారులే భయపెట్టారు. ఎవరైనా కొనేవాళ్లుంటే ముందుగానే అమ్మేసుకోమన్నారు. దీంతో భయపడి మూడు ఎకరాల భూమిని రూ.45 లక్షలకు అమ్మాను. ఇప్పుడు ఎకరా రూ. 2 కోట్ల వరకు పలుకుతోంది. అసైన్డ్ భూములపై ప్రభుత్వ విధానాన్ని చెప్పకపోవడం వల్లనే నేను భారీగా నష్టపోయాను.

- పులి సుబ్బారావు, ఉద్దండ్రాయునిపాలెం

 

ప్యాకేజీ ఇస్తామంటే అమ్మేవాడిని కాదు


ప్రభుత్వం పదేళ్ల కిందట ఎకరం భూమి ఇచ్చింది. అప్పటినుంచి సాగు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఒక రైతు పొలంలో కూలికి వెళ్లినప్పడు అసైన్డ్ భూముల్ని ప్రభుత్వం లాగేసుకుంటుందని మిగిలిన రైతులు చెప్పుకుంటుంటే విన్నాను. ఆలస్యం చేస్తే ఏదో ఒక పద్ధతిలో సీఎం చంద్రబాబు లాగేసుకుంటాడని భయపడి రూ.20 లక్షలకు అమ్మేశాను. ఇప్పుడు ఎంత లేదనుకున్నా రూ.1.50 కోట్లు పలుకుతుంది.   అసైన్డ్ ల్యాండ్‌లకు ప్యాకేజి ముందుగానే ప్రకటించి ఉంటే నేను లాభపడేవాడిని.  

- మండల ఫిలిప్,  ఉద్దండ్రాయునిపాలెం



13 రాజధాని ప్రాంతంలో లంకల సంఖ్య ఇది. రాయపూడి గ్రామం పరిధిలో ఆరు, లింగాయపాలెం లో ఒకటి, మందడంలో ఒకటి, ఉద్దండరాయుని పాలెంలో ఒకటి, వెంకటపాలెంలో ఒకటి, ఉండవల్లి గ్రామ పరిధిలో రెండు లంకలు ఉన్నాయి.

 

2159.17 ఎకరాలు  లంకల్లో రైతులు సాగుచేస్తున్న మొత్తం లంక, అసైన్డు భూములు.  ఇందులో574.93 ఎకరాలు అసైన్డు.. 1,584.24 ఎకరాలు లంక.

 

2,028 ఎకరాలు రాజధాని ప్రాంతంలోని మొత్తం అసైన్డు భూములు.ఇందులో 1278 ఎకరాల భూమిని 1954లో అసైన్డు చేశారు.తక్కిన 750 ఎకరాల భూమిని పలు దఫాల్లో రైతులకు పంపిణీ చేశారు.

 

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుపేదలకు ప్రభుత్వం అరెకరం.. ఎకరం చొప్పున వాటిని అసైన్డు చేసింది.

 

3,097 ఎకరాలు మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బినామీ పేర్లతో తక్కువ ధరలకే కొన్న మొత్తం లంక, అసైన్డు భూములు

 

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top