గాలి కొదిలేశారు.! | Sakshi
Sakshi News home page

గాలి కొదిలేశారు.!

Published Sat, Aug 19 2017 1:51 AM

గాలి కొదిలేశారు.!

సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగంలో ఇష్టారాజ్యం
గణేశ్వరరావు విధులపైనా  పర్యవేక్షణ కరువు
మూడేళ్లుగా విశాఖ నుంచి వస్తున్నా చర్యలు శూన్యం
రాజకీయ అండ ఉందని భయపడిన ఏడీ
ఇక్కడ ఉద్యోగం  చేస్తూనే విశాఖలో ట్యాంపరింగ్‌


కుటుంబంలో ఎవరైనా తప్పుచేస్తే ఆ బాధ్యత కుటుంబ పెద్దదే. ఏదైనా సంస్థలో ఎవరైనా పొరపాటు చేస్తే బదులివ్వాల్సిన బాధ్యత యాజమాన్యానిది. అలాగే కార్యాలయంలో సిబ్బంది సక్రమంగా నడుచుకోవడం లేదంటే దానికి బాధ్యుడు ఆ విభాగాధిపతే. కానీ ఎవరు ఎలా పోతే  మనకెందుకు... మన వరకూ వస్తే అప్పుడు చూద్దాంలే... అనుకుని వదిలేసినా.. తప్పటడుగును ప్రోత్సహించినట్టే. ఆ నిర్లక్ష్యం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ గేదెల గణేశ్వరరావు ఉదంతమే ఉదాహరణ. తన శాఖలో పనిచేసే ఉద్యోగి ఏం చేస్తున్నాడనే పర్యవేక్షణ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సరిగ్గా చేసినా, సహచరుడు తప్పుడు మార్గంలో నడుస్తున్నట్లున్నాడని సహోద్యోగులు గుర్తించినా ఇంతటి భారీ కుంభకోణం జరిగి ఉండేది కాదేమో.

విజయనగరం: జిల్లా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగంలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్లులుంటారు. ఫీల్డ్‌ ఇన్‌స్పెక్టర్స్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్లు(డీఐఓ) ఏదైనా పొరపాటు చేస్తే వారికి మెమోలు ఇవ్వడం మాత్రమే వీరిపని. డీఐఓలు డివిజన్‌కు ఒకరు చొప్పున విజయనగరం, పార్వతీపురంలో ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీఐఓ ఒకరు ఉన్నారు. మండల సర్వేయర్లు మండలానికొకరు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం బాడంగి, జామి మండలాలకు లేరు. బాడంగి మండలానికి గంట్యాడ సర్వేయర్‌ చంద్రశేఖర్‌ను డెప్యూటేషన్‌ వేశారు. వీరిలో కొందరు సెలవులని, క్యాంపులని, మీటింగులని చెప్పి మండలంలో అందుబాటులో ఉండరు. వీరందరినీ కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత ఏడీదే.

ఆయనతో మనకెందుకన్న భయంతో...
సర్వే శాఖ ఏడీగా ఎం.గోపాలరావు తూర్పుగోదావరి జిల్లా నుంచి 2015 ఆగస్టు 18న జిల్లాకు బదిలీపై వచ్చారు. ఈయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా అయినప్పటికీ తొలిపోస్టింగ్‌ విజయనగరంలోనే కావడంతో ఇక్కడే స్థిరపడ్డారు. ట్యాంపరింగ్‌ కింగ్‌ గణేశ్వరరావు, ఏడీ గోపాలరావులిద్దరూ ఒకే బ్యాచ్‌కు చెందిన వారే. పదవీ విరమణకు సమీపిస్తుండటంతో గోపాలరావు ఆరోగ్య సమస్యల దృష్ట్యా కార్యాలయంపై పర్యవేక్షణ తగ్గించారు. తనకు ఇబ్బందులు తెస్తారనుకునేవారిని చూసీ చూడనట్టు వేదిలేశారు. ముఖ్యంగా గణేశ్వరరావు విషయంలో ఇది మరీ ఎక్కువైంది. విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తున్నా, విధులకు సక్రమంగా హాజరుకాకపోయినా నిలదీయలేదు. దానికి కారణం లేకపోలేదు. విజయనగరంలో గోపాలరావు గతంలో పనిచేసినపుడు గణేశ్వరరావు తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఎదగాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో తనకు అడ్డుగా ఉన్న గోపాలరావును కృష్ణా జిల్లాకు బదిలీ చేయించారు. ఈ విషయంలో ఇద్దరి మధ్యా పొరపచ్చాలున్నాయి. అయినా ఆయనతో నెగ్గడం కష్టమనే గోపాలరావు మౌనం వహించారు.

ఎంతటివారినైనా దారికి తెచ్చుకునే సత్తా...
ఎంతటివారినైనా దారికి తెచ్చుకునే సామర్ధ్యం గణేశ్వరరావుకు ఉంది. వివిధ జిల్లాల్లో 15 ఏళ్లు పనిచేసి తిరిగి జిల్లాకు ఏడీగా గోపాలరావు వచ్చే సరికి గణేశ్వరరావు ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. అయినప్పటికీ అతని విషయంలో గోపాలరావు కల్పించుకోకుండా వదిలేశారు. తన వరకూ ఎలాంటి సమస్యా రాకూడదని ఆయన్ను పట్టించుకోకుండా వదిలేయడంతో గణేశ్వరరావు తన పనులను నిర్విఘ్నంగా చేసుకుపోయాడు. నిజానికి ఏడీగా ప్రమోషన్‌ పొందేందకు ఎలాంటి చర్యలకైనా వెనుకాడని గణేశ్వరరావుకు అంతకుముందు ఏసీబీ కేసులు అడ్డంకిగా మారాయి. అయితే 2011 అక్టోబర్‌ 22 నుంచి డిసెంబర్‌ 4 వరకూ ఒకసారి, 2012 జూలై 11 నుంచి ఆగస్టు 13 వరకూ ఒకసారి ఇన్‌చార్జ్‌ ఏడీగా  పనిచేశాడు.

Advertisement
Advertisement