ప్యూయెల్-ఏ-డ్రీమ్ తో క్రౌడ్ ఫండింగ్..

స్పెరో ఈ-బైక్‌తో రంగనాథ్ తోట - Sakshi


విజయవంతంగా 40 ప్రాజెక్టులు

మొత్తం రూ.1.6 కోట్లు సమీకరణ

కంపెనీ ఫౌండర్ రంగనాథ్ తోట


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మంచి వ్యాపార ప్రణాళిక, దాతృత్వ కార్యక్రమం, సామాజిక చైతన్యం.. కార్యక్రమం ఏదైనా క్రౌడ్ ఫండింగ్ చేసిపెడతామని అంటోంది ఫ్యూయెల్‌ఏడ్రీమ్.కామ్. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీ ఇప్పటి వరకు 40 ప్రాజెక్టులకు క్రౌడ్ ఫండింగ్ అందించింది. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి 5 ప్రాజెక్టులు ఉన్నాయని ఫ్యూయెల్‌ఏడ్రీమ్.కామ్ ఫౌండర్ రంగనాథ్ తోట సాక్షి బిజినెస్ బ్యూరోకు మంగళవారం తెలిపారు.


అన్ని ప్రాజెక్టులకు కలిపి మొత్తం రూ.1.6 కోట్లు సమీకరించామని చెప్పారు. ఏ కార్యక్రమమైనా తక్కువ వ్యయంతో విజయవంతంగా పూర్తి అయ్యేందుకు సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. డిసెంబరుకల్లా మొత్తం రూ.4 కోట్లు సమీకరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. క్రౌడ్ ఫండింగ్ అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, కస్టమర్లు, ఇతరుల నుంచి ఉచితంగా నిధులను సమీకరించడం.


 డెలివరీకి ఈ-బైక్ సిద్ధం..

ఫ్యూయెల్‌ఏడ్రీమ్.కామ్ క్రౌడ్ ఫండింగ్ అందించిన స్పెరో ఈ-బైక్ డెలివరీకి సిద్ధమైంది. ఈ నెలాఖరు నుంచి కస్టమర్లకు అందిస్తామని స్పెరో ఈ-బైక్ ఫౌండర్ ఎస్.మణికందన్ వెల్లడించారు. ఇప్పటి వరకు 160 బుకింగ్స్ నమోదయ్యాయని చెప్పారు. నెలకు 300 ఈ-బైక్స్‌ను తయారు చేసే సామర్థ్యం తమ కంపెనీకి ఉందని పేర్కొన్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.55 లక్షలు సమీకరించామన్నారు. ఒకసారి చార్జ్ చేస్తే 30, 60, 100 కిలోమీటర్లు నడిచే మూడు రకాల స్పెరో ఈ-బైక్ మోడళ్లున్నాయి. ధరల శ్రేణి రూ.29,900-50,900 ఉంది. మార్కెట్ ధరలతో పోలిస్తే 40 శాతం తక్కువ అని కంపెనీ తెలిపింది. శాంసంగ్ తయారీ బ్యాటరీని వీటిలో వాడారు. మోటారు, టైర్లను కొరియా నుంచి దిగుమతి చేసుకున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top