విశాఖ లేకపోతే చిత్ర పరిశ్రమ చెన్నైకి చెక్కేసేది! | Sakshi
Sakshi News home page

విశాఖ లేకపోతే చిత్ర పరిశ్రమ చెన్నైకి చెక్కేసేది!

Published Mon, Apr 14 2014 12:53 AM

విశాఖ లేకపోతే చిత్ర పరిశ్రమ చెన్నైకి చెక్కేసేది! - Sakshi

      సినీ నిర్మాత సురేష్

     అరకులో షూటింగులకు అనుకూలం

     లొకేషన్లకు కొదవలేదు.. వనరులకూ ఢోకా లేదు

     వెంకటేష్ చిత్రం చిత్రీకరణ

 అరకు రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన తర్వాత చిత్ర పరిశ్రమ విశాఖ వైపు చూస్తోందని, 90 శాతం యూనిట్ విశాఖ తరలి వస్తోందని సినీ నిర్మాత సురేష్ చెప్పారు. విశాఖ లేకపోతే చిత్ర పరిశ్రమ మళ్లీ చెన్నై చెక్కేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. అరకు పరిసర ప్రాంతాల్లోనే  షూటింగ్‌లు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని తెలిపారు.

సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై కెమెరామన్ బి.గోపాల్‌రెడ్డి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మీనా, నదియా ప్రధానపాత్రల్లో ‘దృశ్యం’ అనే చిత్రాన్ని అరకులోయలో తెరకెక్కిస్తున్నారు. విశాఖ-అరకు ప్రధాన రహదారి కొత్తభల్లుగుడ, అరకులోయ రహదారికిరువైపులా సిల్వర్‌ఓక్ చెట్ల మధ్య రెండు రోజులుగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా సురేష్ విలేకరులతో మాట్లాడారు. మళయాళంలో విజయం సాధించిన ‘దృశ్యం’ సినిమాను తెలుగులో నిర్మిస్తున్నామని చెప్పారు. కథ కొత్తగా ఉందని, ఈ చిత్రంలో రెండు పాటలుంటాయని, ఫైట్స్ ఉండవన్నారు. విశాఖ, విజయనగరంలో కూడా పలు సన్నివేశాలను చిత్రీకరిస్తామని వివరించారు.
 
ఈ నెలాఖరు నాటికి షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అరకులోయ పరిసరాల్లో చెట్లు విపరీతంగా ఉండేవని, ప్రస్తుతం చెట్లు కొట్టేయడంతో బోడి కొండలు దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ మొక్కలు నాటాలని, చెట్లను రక్షించాలని కోరారు.  ఈ చిత్రంలో నరేష్, చలపతిరావు, రవికాల్, సప్తగిరి, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నారన్నారు. విశాఖకు చెందిన బిల్డర్ అప్పారావు బాయ్స్ (బౌన్సర్లు) షూటింగ్‌లో పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement