‘అనూహ్య’ తీర్పు | Sakshi
Sakshi News home page

‘అనూహ్య’ తీర్పు

Published Sat, Oct 31 2015 1:02 AM

‘అనూహ్య’ తీర్పు

సర్వత్రా హర్షం
దోషి చంద్రభాన్‌కు ఉరిశిక్ష ఖరారు చేసిన కోర్టు
ప్రజల మనోభావాలకు అద్దం పట్టిన తీర్పు
తాము అనుకున్న తీర్పే ప్రకటించారన్న అనూహ్య తల్లిదండ్రులు

 
గారాబంగా పెంచుకున్న కూతురు కసాయి చేతిలో చిక్కుకుని దారుణ హత్యకు గురైతే ఆ కుటుంబ సభ్యుల క్షోభ వర్ణనాతీతం. చేయి పట్టుకు నడిచిన కూతురు ఊరు కాని ఊరులో హత్యకు గురికావడం.. ఫిర్యాదు చేస్తే పోలీసుల నుంచే ఈసడింపులు ఎదురవటంతో ఆ తండ్రి పడిన బాధ వర్ణనాతీతం. ఎట్టకేలకు కోర్టు తీర్పుతో ఆ.. వేదనకు, ఆవేదనకు కాస్తంత ఊరట. ఎస్తేరు అనూహ్య కేసులో దోషిగా నిర్ధారించిన చంద్రభాన్‌కు కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పునివ్వటం సమాజంలో ఇలాంటి మానవ మృగాలకు హెచ్చరికలా ఉందని సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
 
మచిలీపట్నం : దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఎస్తేరు అనూహ్య హత్య కేసులో నిందితుడికి ముంబై సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం కోర్టు వెలువరించిన తీర్పు ప్రజల మనోభావాలకు అద్దం పట్టినట్లుగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు. తాము పైకి చెప్పకున్నా తామనుకున్న తీర్పును కోర్టు ప్రకటించిందని అనూహ్య తల్లిదండ్రులు జోనాథన్ ప్రసాద్, జ్యోత్స్న తెలిపారు. అయినా తమ కుమార్తె జ్ఞాపకాలు తమను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని వారు కన్నీటిపర్యంతమయ్యారు.

 ఆ కన్నీళ్లకు వెలకట్టేదెవరు?
 తమతో కలిసి క్రిస్మస్ పండుగ చేసుకుని ఉద్యోగం నిమిత్తం ముంబై వెళ్లేటప్పుడు.. నాన్నా పెళ్లి సంబంధాలు చూడండని, తాను వేసుకునే పెళ్లి గౌను ఇలా ఉండాలని చెప్పి వెళ్లిన ఒకటి, రెండు రోజుల తరువాత ఆమె విగత జీవిగా మారితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. పోలీసులు సహకరించకున్నా బంధువుల సాయంతో సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా కుమార్తె ఆచూకీని కనుగొన్న ఆ తండ్రి కన్నీళ్లకు వెలకట్టలేం. ఆ కుటుంబానికి జరిగిన లోటు పూడ్చలేనిది. మచిలీపట్నానికి చెందిన శింగవరపు ఎస్తేరు అనూహ్య (25) ముంబైలో దారుణ హత్యకు గురి కావడం, పోలీసులు నిందితుడి ఆచూకీని కనుగొనడం, సాక్ష్యాలు సేకరించటం, 2500 మందిని విచారించడం, తాజాగా దోషిగా నిర్ధారించిన చంద్రభాన్‌కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించడం తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
 

Advertisement
 
Advertisement