భద్రత వెరీ స్ట్రాంగ్‌ | Sakshi
Sakshi News home page

భద్రత వెరీ స్ట్రాంగ్‌

Published Tue, May 21 2024 10:15 AM

భద్రత

● జిల్లాలో 24 గంటలూ పటిష్టమైనపోలీస్‌ నిఘా ● జూన్‌ 4న ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భద్రత పెంపు ● గ్రామాల్లో 144 సెక్షన్‌ అమలు.. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ● గ్రామాల్లో గొడవలు జరగకుండాపోలీస్‌ ముందస్తు చర్యలు ● స్ట్రాంగ్‌ రూమ్‌లను సందర్శించిన డీఐజీ, జిల్లా ఎస్పీ

సాక్షి, అనకాపల్లి: పోలింగ్‌ ముగిసి వారం రోజులైంది. కౌంటింగ్‌కు మరో రెండు వారాల సమయం ఉంది. లెక్కింపు ఘడియలు దగ్గరయ్యే కొద్దీ సర్వత్రా ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశముంది. ఈ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పట్టిష్టమైన పోలీస్‌ నిఘా ఏర్పాటు చేశారు. జూన్‌ 1న ఎగ్జిట్‌ పోల్స్‌, జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉంటుంది. ఎన్నికల ఫలితాలకు ముందుగానీ, తరువాత గానీ గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, స్టేజ్‌ ప్రోగ్రాంలకు ఎటువంటి అనుమతుల్లేవని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను రెచ్చగొట్టేలా రాజకీయ నాయకుల సందేశాలు, నిరాధార ఆరోపణలు, రచ్చబండ చర్చలు, సామాజిక, సోషల్‌ మీడియాల్లో ప్రచారం.. మొదలైన వాటిని నేరంగా పరిగణిస్తున్నట్లు పోలీస్‌ అధికారులు వెల్లడించారు. పెట్రోల్‌ బంకుల్లో లూజ్‌ పెట్రోల్‌ అమ్మకాలు, బాణసంచా విక్రయాలపై ఆంక్షలు విధించారు. ధాబాల్లో, హోటళ్లలో, పాన్‌షాప్‌లలో అక్రమ మద్యం, సారాయి అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. జూదం, కోడిపందాలు, కాయిన్‌ గేమ్‌, బెట్టింగ్‌ మొదలైన చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నాటుసారా, అక్రమ మద్యం, రవాణా జరగకుండా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. లాడ్జీలు, సత్రాలు, కల్యాణ మండపం మొదలైన చోట అపరిచిత వ్యక్తులు, అనుమానిత వ్యక్తులను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు.

గ్రామాల్లో ఇరు పార్టీల వారితో సమావేశం

ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌ఓ స్థాయి పోలీస్‌ అధికారులు గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించి మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌, కౌంటింగ్‌ ఫలితాల సమయంలో కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడితే తీసుకునే కఠిన చర్యలను వివరిస్తున్నారు. గ్రామాల్లో పోలీసు పికెట్‌, పెట్రోలింగ్‌, చెక్‌ పోస్ట్‌లను ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేస్తారు. అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించేవారు, ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని గుర్తించి, వారి కట్టడికి ముందస్తుగా బైండోవర్‌ చేస్తున్నారు. గ్రామాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌లు, అనుమానాస్పద గ్రామాల్లో కార్డన్‌, సెర్చ్‌ ఆపరేషన్‌లు చేపడున్నారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

కేంద్ర బలగాలు, ఆర్మ్‌డ్‌ రిజర్వు, సివిల్‌ పోలీసులను ఏర్పాటు చేశారు. 24 గంటలూ నిరంతర సీసీ కెమెరాల నిఘా.. ప్రత్యేక సాయుధ బలగాల పహారా ఏర్పాట్లు ఉన్నాయి.

స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించిన డీఐజీ

ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన నిబంధనల మేరకు జిల్లా ప్రజలు అధికార యంత్రాంగానికి తమ వంతు సహకారం అందించాలని విశాఖ రేంజ్‌ డీఐజీ విశాల్‌ గున్ని కోరారు. జిల్లా ఎస్పీ మురళీకృష్ణతో పాటు ఆయన కలెక్టరేట్‌ సమీపంలో గల ప్యూచర్‌ వరల్డ్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్ట్రాంగ్‌ రూమ్‌లో ఈవీఎంలు, వీవీప్యాట్‌లను, కంట్రోల్‌ యూనిట్‌లను పరిశీలించారు. కౌంటింగ్‌కి ముందుగానీ, కౌంటింగ్‌ రోజు గాని, కౌంటింగ్‌ తర్వాత గాని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నామని, కౌంటింగ్‌ రోజు 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని, అల్లర్లలో పాల్గొనే వారి వాహనాలు సైతం సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ప్రజలందరూ సంయమనంతో వ్యవహరిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్‌ శాఖకు సహకరించాలని డీఐజీ సూచించారు.

రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా

పాత నేరస్తులు, రౌడీ షీటర్ల పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ముందస్తుగా పోలీస్‌స్టేషన్ల వద్ద కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. వారిలో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీయాక్ట్‌తో పాటు జిల్లా నుంచి బహిష్కరించనున్నట్లు ఎస్పీ మురళీకృష్ణ హెచ్చరించారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలు, 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో నేరాలకు, తగాదాలకు పాల్పడినవారిపై నిఘా ఉంచారు. అభ్యర్థుల గెలుపు, ఓటములపై బెట్టింగ్‌లు నిర్వహించేవారు.. పాల్గొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

భద్రత వెరీ స్ట్రాంగ్‌
1/1

భద్రత వెరీ స్ట్రాంగ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement