ఇంటర్‌ సప్లిమెంటరీకి సర్వం సిద్ధం | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సప్లిమెంటరీకి సర్వం సిద్ధం

Published Tue, May 21 2024 10:15 AM

ఇంటర్‌ సప్లిమెంటరీకి సర్వం సిద్ధం

● ఈనెల 24 నుంచి జూన్‌ 1 వరకు పరీక్షలు ● జిల్లాలో 20 కేంద్రాల్లో నిర్వహణ ● పరీక్షలు రాయనున్న 14,807 మంది విద్యార్థులు

తుమ్మపాల: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలను జిల్లావ్యాప్తంగా 20 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. జిల్లాలో ఫస్టియర్‌ 9,326 మంది, సెకండియర్‌ 5,481 మంది, మొత్తం 14,807 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే సిబ్బందిని నియమించారు. డీవీఈవో, హైపవర్‌ కమిటీ, సిటింగ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టి, వీటి ద్వారా ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా స్ట్రీమింగ్‌ చేశారు. పరీక్షలు తప్పినవారికి, మరిన్ని మార్కులు పొందేందుకు బెటర్‌మెంట్‌ కట్టిన విద్యార్థులకు కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

రెండు సెషన్లలో..

ఈనెల 24 నుంచి జూన్‌ 1 వరకు జరిగే పరీక్షలను రెండు సెషన్లుగా నిర్వహిస్తున్నారు. ఫస్టియర్‌ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్‌ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు వారికి కేటాయించిన కేంద్రానికి అరగంట ముందుగా చేరుకోవాల్సి ఉంటుంది. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. అలాగే పరీక్ష కేంద్రాల్లో అవసరమైన వైద్య సిబ్బందిని నియమిస్తున్నారు.

పరీక్ష కేంద్రాలివి..

జిల్లాలో మొత్తం 20 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో 14 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు (పరవాడ, నర్సీపట్నం (గర్ల్స్‌, బాయ్స్‌), యలమంచిలి, నక్కపల్లి, పాయకరావుపేట, కొత్తకోట, వడ్డాది, చోడవరం, సబ్బవరం, దేవరాపల్లి, కేడీపేటలలోని ప్రభుత్వ కాలేజీలు, దేవరాపల్లి సోషల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కళాశాల, నర్సీపట్నం బాలికల గురుకుల కళాశాల) ఉన్నాయి. 5 ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో (అచ్యుతాపురంలో ప్రశాంతి, పాయకరావుపేట కార్తికేయ, అనకాపల్లిలో నారాయణ, శ్రీచైతన్య, సంయుక్త జూనియర్‌ కళాశాలలు) కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి కాక ఒక ఎయిడెడ్‌ జూనియల్‌ కాలేజీలో (ఆదినారాయణ మహిళా జూనియర్‌ కళాశాల) కూడా పరీక్షలు నిర్వహిస్తారు.

నేడు కలెక్టర్‌ సమన్వయ సమావేశం

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఈ నెల 21న కలెక్టరేట్‌లో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఇంటర్‌ బోర్డు అధికారులతోపాటు వైద్యఆరోగ్య శాఖ, ఆర్టీసీ, పోలీసు, పోస్టల్‌, రెవెన్యూ, మున్సిపల్‌, విద్య, పంచాయతీ శాఖల అధికారులు పాల్గొంటారు. విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై చర్చిస్తారు.

ప్రశాంత వాతావరణంలో పరీక్షలు

విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం. ముఖ్యంగా మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాం. మండుతున్న ఎండల నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం.

–బి.సుజాత, ఇంటర్మీడియట్‌ జిల్లా విద్యాశాఖ అధికారి, అనకాపల్లి

Advertisement
 
Advertisement
 
Advertisement