రేపు జేఈఈ మెయిన్ ఫలితాలు | Sakshi
Sakshi News home page

రేపు జేఈఈ మెయిన్ ఫలితాలు

Published Sun, Apr 26 2015 12:55 AM

Tomorrow JEE Main Results

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలను ఈనెల 27వ తేదీన వెల్లడించేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 4న ఆఫ్‌లైన్‌లో, 10, 11 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రం నుంచి దాదాపు లక్ష మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష కీ విడుదల చేసి, 22వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించారు. 27న ఫలితాలను వెల్లడించనున్నారు.

దీంతోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఎంపిక చేసిన టాప్ 1.5 లక్షల మంది విద్యార్థుల జాబితాను కూడా అదే రోజున ప్రకటిస్తారు. జేఈఈ మెయిన్ స్కోర్‌కు 60 శాతం, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీలను కలిపి ఆలిండియా తుది ర్యాంకులను జూలై 7న ప్రకటిస్తారు. వాటి ఆధారంగా ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలను చేపడతారు.

అడ్వాన్స్‌డ్‌కు మే 2 నుంచి దరఖాస్తులు..

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణకు సీబీఎస్‌ఈ చర్య లు చేపట్టింది. ఈ పరీక్షను మే 24న నిర్వహించనుంది. మెయిన్‌లో అత్యధిక మా ర్కులు సాధించిన 1.5 లక్షల మందికి మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసే అర్హత ఉంటుంది. వారు మే 2 నుంచి 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 24న పరీక్ష నిర్వహించి జూన్ 18న ఫలితాలు ప్రకటిస్తారు.
 
 

Advertisement
Advertisement