మళ్లీ తెరపైకి జెడ్పీ డెప్యూటీ సీఈవో పోస్టు | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి జెడ్పీ డెప్యూటీ సీఈవో పోస్టు

Published Sat, Jun 7 2014 2:49 AM

To the fore again, the deputy group CEO post

  • ఎవరికి వారే ముమ్మర యత్నాలు
  •  ఊపందుకోనున్న  రాజకీయ పైరవీలు
  •  కలెక్టర్‌కు కత్తిమీద సామే!
  •  కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి పోస్టుకు పైరవీలు ప్రారంభమయ్యాయి. వరుస ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా కొంతమంది అధికారులను మూడు సంవత్సరాల పైబడి ఒకే ప్రాంతంలో ఉన్న వారిని బదిలీ చేశారు. దీనిలో భాగంగా డెప్యూటీ సీఈవోగా పనిచేసిన జీవీ సూర్యనారాయణ ఎంపీడీవోల బదిలీల్లో భాగంగా ఫిబ్రవరిలో బదిలీ అయ్యారు. దీంతో అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది.

    అయితే తిరిగి బందరు మండల ఎంపీడీవోగా బదిలీ అయ్యి జెడ్పీ డెప్యూటీ సీఈవో పోస్టును దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇన్‌చార్జ్ జెడ్పీ సీఈవోగా పనిచేస్తున్న చింతా కళావతి ఎన్నికల ముందు ఎంపీడీవోల బదిలీల్లో ఇతర జిల్లాకు బదిలీ అయ్యారు. అయితే ప్రస్తుతం బందరు ఎమ్మెల్యే కొల్లు రవీంద్రకు ఈమె బంధువు కావటంతో ఆమె కూడా ఈ పోస్టుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. వీరు ఇరువురి ప్రయత్నాలు ఇలా ఉంటే... మరో పక్క రాజీవ్ విద్యామిషన్ ఎఫ్‌ఏవోగా పనిచేస్తున్న వి.జ్యోతిబసు న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు.

    గతంలో చింతా కళావతి ఇన్‌చార్జ్ జెడ్పీ సీఈవోగా, డెప్యూటీ సీఈవోగా జీవీ సూర్యనారాయణ విధులు నిర్వర్తించిన సమయంలో 2013 అక్టోబరు 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం చింతా కళావతి, జీవీ సూర్యనారాయణ కంటే ఎక్కువ సీనియార్టీ ఉన్న వి జ్యోతిబసును ఇన్‌చార్జ్ జెడ్పీ సీఈవోగా అప్పట్లో ఉయ్యూరు మండలం ఎంపీడీవోగా పనిచేస్తున్న ఎం.కృష్ణమోహన్‌ను ఇన్‌చార్జ్ డెప్యూటీ సీఈవోగా నియమించాలని తీర్పు వెల్లడైంది.

    ఈ తీర్పు ఆధారంగా అప్పటి నుంచి వీరు ఇరువురు న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. అయితే ఎన్నికల ముందు జెడ్పీ సీఈవోగా నియమితులైన దాసరి సుదర్శనం జిల్లాపరిషత్ డెప్యూటీ సీఈవో, ఏవో పోస్టులను భర్తీ చేసేందుకు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు వద్దకు ఇన్‌చార్జ్ డెప్యూటీ సీఈవోగా బందరు మండలం ఎంపీడీవోగా పనిచేస్తున్న సుబ్బారావును, రాజీవ్ విద్యామిషన్ కార్యాలయంలో ఎఫ్‌ఏవో పనిచేస్తున్న జ్యోతిబసును ఏవోగా నియమించాలని ప్రతిపాదనలు తీసుకువెళ్లారు.

    అయితే కలెక్టర్  ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం సుబ్బారావు కంటే జ్యోతిబసు సీనియర్ కదా ఆయనను ఎలా నియమిస్తారని సీఈవోను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే జెడ్పీ సీఈవో వి జ్యోతిబసు  జిల్లా వాసి అయినందున  ఆయన నియామకం ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా నియామకం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పడంతో కలెక్టర్‌కు ఈ ఫైల్‌ను పక్కన పెట్టి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత చూద్దామని సీఈవోకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తికావటంతో జెడ్పీ డెప్యూటీ సీఈవో పోస్టును దక్కించుకునేందుకు ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

    బందరు ఎంపీడీవోగా పనిచేసిన జీవీ సూర్యనారాయణ రాష్ట్ర నాయకత్వాన్ని నమ్ముకోగా, చింతా కళావతి రాజకీయపరంగా తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. జ్యోతిబసు మాత్రం న్యాయపరంగా తనకు ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకుండా డెప్యూటీ సీఈవోగా పోస్టు తనకే దక్కుతుందని ఆశగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అయితే జెడ్పీ డెప్యూటీ సీఈవో పోస్టు ఎవరికి దక్కుతుందో, ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో త్వరలోనే తేలనుంది.
     

Advertisement
Advertisement