‘ఉమ్మడి’కాదు..తాత్కాలిక రాజధానే

‘ఉమ్మడి’కాదు..తాత్కాలిక రాజధానే - Sakshi


 తెలంగాణ జేఏసీ ఏకగ్రీవ నిర్ణయం

 సీమాంధ్రులు కిరాయిదారులుగానే ఉండాలి

 సీమాంధ్రకు రాజధానిగా రామోజీ ఫిల్మ్‌సిటీ

 ఆర్టికల్ 371 (డి)పై లోతైన అధ్యయనం

 ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గ బృందానికి నివేదిక

 నేడు కూడా జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం

 వైఎస్సార్ కాంగ్రెస్ సభపై మౌనమే


 

 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని అంటే అంగీకరించే ప్రసక్తి లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. సీమాంధ్రలో రాజధాని ఏర్పాటు చేసుకునేంతవరకు హైదరాబాద్‌ను తాత్కాలిక రాజధానిగా మాత్రమే ప్రకటించాలని ప్రతిపాదించింది. సీమాంధ్రులు హైదరాబాద్‌లో హక్కులతో కాకుండా కేవలం కిరాయిదారుగానే (లీజుపై) ఉండాలని స్పష్టంగా అభిప్రాయపడింది. దీనిపై సమగ్ర నివేదికను మంత్రివర్గ బృందానికి సమర్పించాలని అనుకున్నారు. తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ముందు వివిధ ప్రత్యామ్నాయాలు, పరిష్కార మార్గాలను సూచిస్తూ నివేదించడానికి తెలంగాణ జేఏసీ రెండు రోజులుగా కసరత్తులు చేస్తోంది. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సమావేశం గురువారం కూడా జరిగింది.

 

 ఇదే సమావేశం వరుసగా మూడోరోజైన శుక్రవారం కూడా కొనసాగనుంది. సుమారు ఐదు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ విభజన సందర్భంగా 12 కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణపై అప్పుడే అంతా అయిపోనట్టుగా అనుకోవద్దని, కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేయొచ్చునని, అందుకే అప్రమత్తంగా ఉండాలని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు హెచ్చరించారు. జేఏసీ ముఖ్యనేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, కత్తి వెంకటస్వామి, అద్దంకి దయాకర్, దేవీ ప్రసాద్, రసమయి బాలకిషన్, రఘు, వెంకటరెడ్డి, మాదు సత్యం, మణిపాల్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి (టీఆర్‌ఎస్), యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ), కె.గోవర్ధన్ (న్యూ డెమొక్రసీ) సమావేశానికి హాజరయ్యారు. ఈ నివేదికలపై చర్చల సందర్భంగా టీఆర్‌ఎస్ నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడారు.

 

వైఎస్సార్ కాంగ్రెస్ సభపై మౌనం

హైదరాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే సభపై ఎవరూ మాట్లాడకూడదని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నారు. సభకు న్యాయస్థానం అనుమతిని ఇచ్చినందున అనవసరమైన వివాదాలు తలెత్తే విధంగా వ్యాఖ్యానాలు చేయకుండా సంయమనంతో వ్యవహరించాలని తీర్మానించారు. సభా నిర్వహణకోసం ఎలాంటి అనుమతినిచ్చారు, ఎలాంటి పరిమితులను విధించారు, ఇంకా నియమ నిబంధనలేమిటనేదానిపై కొంత అధ్యయనం చేసిన తర్వాతనే మాట్లాడితే మంచిదని భావిస్తున్నారు. శుక్రవారం కూడా జరిగే జేఏసీ స్టీరింగ్ కమిటీ మూడోరోజు సమావేశంలో చర్చించిన తర్వాత వైఖరిని ప్రకటించాలని, అప్పటిదాకా మౌనంగానే ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

 

 జేఏసీ ముఖ్య నిర్ణయాలు...

 రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్‌పై తకరారు లేకుండా అప్రమత్తంగా ఉండాలని, ఉమ్మడి రాజధాని అంటే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని జేఏసీ అభిప్రాయపడింది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేస్తామంటే అంగీకరించకూడదని, సీమాంధ్రకు పదేళ్ల పాటు ‘తాత్కాలిక రాజధాని’ (టెంపరరీ కేపిటల్) అనే పదాన్ని రాష్ట్ర విభజన బిల్లులో చేర్చేవిధంగా ఒత్తిడి తీసుకురావాలని ఈ సమావేశం నిర్ణయించింది.

     

హైదరాబాద్ శివార్లలో 17 వందల ఎకరాల్లో విస్తరించిన రామోజీ ఫిల్మ్ సిటీని సీమాంధ్రకు సచివాలయంగా, పరిపాలనా కేంద్రంగా చేసుకుంటే మంచిదని సమావేశం ఏకగ్రీవంగా ప్రతిపాదించింది. పరిపాలనకు ఒకటే క్యాంపస్ ఉండటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయని, ఘర్షణపూరిత వాతావరణం తలెత్తకుండా ఉంటుందని అభిప్రాయపడింది. సీమాంధ్రకు ఎక్కడికైనా రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని, ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరగా ఉండటంవల్ల జాతీయస్థాయిలో రవాణాకు అనువుగా ఉంటుందని సూచించింది.

 

     

ఆర్టికల్ 371 (డి) పేరుతో రాష్ట్ర విభజనను సంక్లిష్టం చేసే కుట్రలు జరుగుతున్నాయని, ఆ ఆర్టికల్‌ను లోతుగా అధ్యయనం చేసి కేంద్ర మంత్రివర్గ బృందానికి ప్రత్యామ్నాయ నివేదికను సమర్పించాలని నిర్ణయించారు. దీనిని అధ్యయనం చేసే బాధ్యతను సీనియర్ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డికి అప్పగించారు.

     

రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీపై రిటైర్డు ఐఏఎస్ ఎ.కె.గోయల్, ఉద్యోగుల విభజనపై రిటైర్డు ఐఏఎస్ రామలక్ష్మణ్ అధ్యయనం చేసిన నివేదికలను జేఏసీకి అందించారు. సాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్ వంటి అన్ని కీలకరంగాలపై నివేదికలను సమర్పించారు. సింగరేణిని కోల్ ఇండియాలో విలీనం చేసే కుట్ర జరుగుతున్నదని, సింగరేణిని కొనసాగిస్తే వచ్చే ఉపయోగాలపైనా అధ్యయనం చేసిన నివేదికను ఈ సమావేశంలో అందించారు. ఉన్నత విద్యలో తెలంగాణ జరిగిన అన్యాయం, తెలంగాణలో విద్యావిధానంపై కత్తి వెంకటస్వామి నివేదికను ఇచ్చారు. అన్ని నివేదికలపై సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత కేంద్ర మంత్రివర్గ బృందానికి నివేదికను అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top