‘బోరు’మంటున్న గోదావరి | Sakshi
Sakshi News home page

‘బోరు’మంటున్న గోదావరి

Published Sat, May 2 2015 1:16 AM

ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద గోదావరిలో భారీ బోర్లు వేసి ఆ నీటితో గుంతలను నింపుతున్న దృశ్యం

జీవనది జీవం కోల్పోయింది...
 జలసిరులతో కళకళలాడే
 దక్షిణ గంగ వట్టిపోయింది...
 గలగలా ప్రవహించే గోదావరి
 బాసర వద్ద మూగబోయింది...
 దేశంలోనే రెండో పెద్ద నదిగా
 పేరున్న గోదావరి
 ప్రస్తుతం ఎడారిగా మారింది...
 బోర్లు వేసి నీటిని నదిలోకి
 వదలాల్సిన దుర్గతి పట్టింది...
 మరో రెండున్నర నెలల్లో
 (జూలై 14 నుంచి) గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదికి పట్టిన దుస్థితి అందరినీ కలవరపెడుతోంది.
 
 సాక్షి, హైదరాబాద్: జీవనది జీవం కోల్పోయింది. గలగలా ప్రవహించే గోదావరి మూగబోయింది. జలసిరులతో కళకళలాడే దక్షిణ గంగ వట్టిపోయింది. దేశంలోనే రెండో పెద్ద నదిగా పేరున్న గోదావరిలో తడి ఇంకిపోయి ఎడారిగా మారింది. బోర్లు వేసి నీటిని నదిలోకి వదలాల్సిన దుర్గతి పట్టింది. మరో రెండున్నర నెలల్లో(జూలై 14 నుంచి) గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదికి పట్టిన దుస్థితి అందరినీ కలవరపెడుతోంది. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ కనీవినీ ఎరుగని అత్యంత గడ్డు పరిస్థితిని ఈ ‘జీవనది’ ఎదుర్కొంటోంది. దీంతో కుంభమేళా స్థాయిలో గోదావరి పుష్కర ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని చూస్తున్న రాష్ర్ట ప్రభుత్వానికి ఎటూ పాలుపోవడం లేదు. వరుణుడు సకాలంలో కరుణించని పక్షంలో నవ తెలంగాణలో జరిగే తొలి పుష్కరాల్లో భక్తులు బోరు నీటినే తలపై చిలకరించుకుని తరించాల్సిన విచిత్ర పరిస్థితి ఎదురయ్యేలా ఉంది.
 
 ఉసురుతీసిన బాబ్లీ
 
 వర్షాలు సరిగా లేకపోవడాన్ని పక్కనబెడితే.. ఎప్పుడూ జీవం ఉట్టిపడే గోదావరి ఉసురు తీసింది మహారాష్ర్ట నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టే. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి మహారాష్ట్ర సర్కారు మొండిగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గోదావరి నీటిని పూర్తిగా పీల్చేసుకుంది. గతంలో మండుటెండల్లోనూ హాయిగా స్నానమాచరించేలా నీళ్లు పారే బాసర వద్ద ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. ఆ తర్వాత మరో దివ్యక్షేత్రం ధర్మపురి వద్ద కూడా ఇదే దుస్థితి. ఇక్కడి బ్రహ్మగుండం, సత్యవతి గుండంలో మినహా నీళ్ల జాడలేదు. ఇక మంథని వద్ద ఓ వాగు పుణ్యాన కాస్త తడి మిగిలి ఉంది. ఓవైపు గోదావరి నై బారినా.. ప్రాణహిత వల్ల కాళేశ్వరం వద్ద నదీపాయ కళకళలాడుతోంది. ఈ క్షేత్రాల వద్దే పుష్కరాలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో భక్తులకు ఇక్కట్లు తొలగాలన్నా.. సంతృప్తి మిగలాలన్నా వరుణుడిపైనే పూర్తిగా భారం వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
 
 పుష్కర ఘాట్ల పనులకు ట్యాంకర్లే గతి
 
 జీవనది తీరాన నీటి కరువు ఉందంటేనే విడ్డూరంగా ఉంది. గోదావరి ఒడ్డున భక్తుల కోసం నిర్మించే పుష్కర ఘాట్ల పనులకు నీళ్లు కరవయ్యాయి. లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారని భావిస్తున్నందున కుంభమేళా తరహాలో ఏర్పాట్లకు ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా నదీ తీరంలోని ప్రధాన పుణ్యక్షేత్రాల వద్ద భారీ సంఖ్యలో స్నాన ఘట్టాలను నిర్మిస్తోంది. పది రోజుల క్రితమే పనులు మొదలుపెట్టారు. కానీ ఆ పనులకు ఇప్పుడు నీటి గండం నెలకొంది. సిమెంటు, ఇసుక కలిపేందుకు, సిమెంట్ పనుల క్యూరింగ్‌కు నీళ్లు లేక తిప్పలు పడాల్సి వస్తోంది. బాసర వద్ద 14 పుష్కర ఘాట్లను నిర్మిస్తున్నారు. సమీపంలోని పంటపొలాల నుంచి నీటిని ట్యాంకర్ల ద్వారా తెచ్చుకుని పనులు చేస్తున్నారు. నదిలో ఓ ప్రాంతంలో లోతుగా ఉన్న చోట తోడటం వల్ల ఊరే నీటిని కూడా వినియోగిస్తున్నారు. మరో నెల తర్వాత మొదటి ఘాట్ వద్ద పనులు చేపట్టాల్సి ఉంటుంది. అప్పటికి నీళ్లు దొరకడం కష్టమే.  
 ధర్మపురిలో రెండు గుండాలే దిక్కు
 
 ధర్మపురి వద్ద జరుగుతున్న పనులకు కూడా ట్యాంకర్లే దిక్కయ్యాయి. నదీగర్భంలో దాదాపు 15 మీటర్ల లోతుతో ఉండే బ్రహ్మగుండం, సత్యవతి గుండంలో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడి పనులు జరిగే చోటుకి ట్యాంకర్లతో తరలిస్తున్నారు. హనుమజ్జయంతి వేడుకల సమయంలో భక్తుల అవసరాల కోసం ఎస్సారెస్పీ నుంచి వదిలిన నీటి వల్ల ఈ గుండాల్లో నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం వీటి  నుంచి పైపులు ఏర్పాటు చేసి, మోటార్ల ద్వారా నీటిని తోడి షవర్ తరహాలో భక్తులపై నీటిని చిలకరిస్తూ స్నానం చేసిన అనుభూతి కలిగిస్తున్నారు.
 
 మంథని వద్ద బొక్కలవాగే ఆధారం
 
 మంథని వద్ద గోదావరిలో నీటి ప్రవాహం కనుమరుగైంది. కానీ ఇటీవలి వర్షాలు, సింగరేణి గనుల నుంచి తోడుతున్న నీటి వల్ల ఇక్కడి బొక్కలవాగు నుంచి వచ్చే నీళ్లు గోదావరిలో అక్కడక్కడా నిలిచాయి. ఆ నీటితో పుష్కరఘాట్ల నిర్మాణం, ఇతర పనులు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు భారీ డీజిల్ ఇంజిన్లు, మోటార్లు బిగించి ఈ నీటిని తోడారు. అయితే ఈ ప్రాంతం వణ్యప్రాణుల రక్షణ చట్టం పరిధిలో ఉండటంతో ఇక్కడ శబ్ద కాలుష్యానికి కారణమయ్యే మోటార్ల ఏర్పాటు నిషిద్ధం. దీంతో ఇటీవలే ఆ ఇంజిన్లను తొలగించి ట్యాంకర్ల ద్వారా నీటిని వినియోగిస్తున్నారు.
 
 జూలై 1 వరకు ఎదురుచూపే..
 గోదావరిలో నీటి ప్రవాహాన్ని చూడాలంటే జూలై ఒకటి వరకు ఎదురు చూడాల్సిందే. ఆ రోజున బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకుంటాయి. ఎగువ నుంచి నీళ్లు వస్తాయి. అదికూడా ఓ మోస్తరు వానలు కురిస్తేనే. వర్షాలు లేకుంటే మాత్రం పుష్కరాలను ఎండిన గోదావరిలోనే తూతూమంత్రంగా ముగించక తప్పదు. బాబ్లీ గేట్లను ఏర్పాటు చేసిన ఈ మూడేళ్లలో కొద్దోగొప్పో వానలు కురియడం వల్ల గోదావరిలో నీటి ప్రవాహం తగ్గినా పూర్తిగా ఎండిపోయే పరిస్థితి రాలేదు. కానీ గత సంవత్సరం ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రాష్ర్టంలో గోదావరిపై బాబ్లీ ప్రభావం ఇప్పుడు తెలిసొచ్చింది. సాధారణంగా జూన్ రెండో వారం తర్వాత వానలు కురుస్తాయి. చివరి వారంలో భారీ వానలకు అవకాశం ఉంటుంది. ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినా.. అరకొర వర్షాలు పడినా పుష్కరాలకు ఇబ్బందులు తప్పవు.
 
 బోరు నీళ్లతోనే స్నానాలు
 
 బాసర వద్ద నెల క్రితం నదీగర్భంలో ఆరు బోర్లు వేశారు. వీటితో నీళ్లు తోడి భక్తుల అవసరాలు తీరుస్తున్నారు. నిత్యం ఇక్కడికి వేలల్లో భక్తులు వస్తుంటారు. స్నానాల కోసం ఉత్సాహంగా వచ్చే భక్తులు నదిలో నై తప్ప నీటి చుక్కలేని దృశ్యం చూసి విస్తుపోతున్నారు. అధికారులు రెండు బోర్ల నుంచి నీటిని తోడి నదిలో పెద్ద గుంటలను నింపుతున్నారు. ఆ నీటి వద్దే స్నానం తంతు ముగించుకుని భక్తులు భారంగానే ఆలయంవైపు కదులుతున్నారు.

Advertisement
Advertisement