బతుకుబండి భారం
పేరుకు ప్రభుత్వ ఉద్యోగులే.. అయినా బతుకు బండి నడపడం కష్టంగా మారింది...
	పేరుకు ప్రభుత్వ ఉద్యోగులే.. అయినా బతుకు బండి నడపడం కష్టంగా మారింది. బారెడు ఖర్చులు..బెత్తెడు జీతంతో కుటుంబ పోషణ భారమవుతోంది. ఐదేళ్లకోసారి ఇచ్చే పీఆర్‌సీ అమలులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఫలితంగా చిన్నా..చితకా ఉద్యోగులే కాదు అధికారుల స్థాయి కుటుంబాలూ అల్లాడుతున్నాయి. పీఆర్‌సీ అమలు జాప్యంతో సగటు ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులపై కథనం..
	 
	- పీఆర్‌సీ కోసం వేచి చూస్తున్న ఉద్యోగ వర్గాలు
	- ప్రకటనలతోనే సరిపెడుతున్న ఏపీ ప్రభుత్వం
	- తెలంగాణ  కంటే అదనపు ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్
	 
	ఒంగోలు: పే రివిజన్ కమిటీ సిఫార్సులు అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. 2003 జులై 1వ తేదీ నుంచి పదో పీఆర్‌సీ అమలు కావాల్సి ఉన్నా..నేటికీ అడ్రస్ లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీ కంటే మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ఇవ్వాలని ఏపీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్‌సీ అమలులో జాప్యం జరిగితే హక్కుల సాధనకు రాజీలేని పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నాయి.
	 
	మారని బాబుకు నిదర్శనం:
	‘మిమ్మల్ని పదేళ్లు దూరం చేసుకున్నాను...మరోసారి అలా జరగకుండా చూసుకుంటా. ప్రభుత్వం చేపట్టే ప్రతి అంశాన్ని ప్రజల దగ్గరకు చేర్చేవారధులు మీరే. అందుకే మీ అందర్నీ గౌరవిస్తా...మీ సమస్యలను నా సమస్యలుగా భావిస్తా. మీరు కోరుకుంటున్న పీఆర్‌సీలో కూడా మెరుగైన పీఆర్‌సీ ఇస్తా...అన్ని విధాలుగా మీకు అండగా ఉంటా’ అంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఊదర గొట్టారు. పదేళ్ల తరువాత చెబుతున్న మాటలు కావడంతో బాబు మారాడని సాధారణ జనంతో పాటు ఉద్యోగులు భావించారు. తమ దెబ్బ ఏంటో చంద్రబాబుకు తెలిసిందని, కనుక భవిష్యత్తులో ఉద్యోగులతో పెట్టుకోడని నమ్మారు. కానీ ఆ నమ్మకం...మరో మారు వమ్మయిందని నేడు ఉద్యోగులు అంటున్నారు.
	
	తెలంగాణ  కంటే మెరుగైన పీఆర్‌సీ (అంటే అదనపు ఫిట్‌మెంట్‌తోపాటు పలు ప్రయోజనాలు) కల్పిస్తామన్న చంద్రబాబు నేడు మౌనం వహిస్తుండడం సరికాదంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి ఉద్యోగుల జీతాలకు ఎసరు పెడతామంటే సహించేదే లేదని ఇప్పటికే ఉద్యోగ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో మంత్రివర్గ ఉపసంఘం ఒక వైపు సమావేశమవుతుంటే, మరో వైపు ప్రభుత్వ నిర్ణయం వెలువడగానే తదుపరి చర్యలు చేపట్టేందుకు ఏపీ జేఏసీ భేటీ అవుతుండడం గమనార్హం.
	
	కుటుంబంలో ఇద్దరు ఉద్యోగం చేస్తుంటే తప్ప బతుకు చక్రాన్ని నడపడం సాధ్యం కాదని పలువురి నెలవారీ కుటుంబ వ్యయాలను పరిశీలిస్తుంటే అర్థం అవుతుంది. గతంలో మిగుల్చుకున్న పొదుపులను కూడా నేడు ఖర్చుచేసుకోవాల్సి వస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. పీఆర్‌సీ కనీస వేతనం రూ.13 వేలుగా నిర్ణయించడం చూస్తుంటే అసలు కుటుంబ పోషణ ఎలా సాధ్యం అవుతుందని, కనుక దానిని మార్పు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
	 
	ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవీ:
	⇒ కనీస వేతనం రూ.13 వేలకు బదులుగా రూ.15 వేలు చేయాలి
	⇒ డీఏ రేటు 0.524 బదులుగా 0.856 గా మార్చాలి
	⇒ మహిళలకు స్పెషల్ క్యాజువల్ లీవులు మంజూరు చేయాలి
	⇒ ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు కార్పోరేట్ ఆస్పత్రులు తిరస్కరిస్తున్న దృష్ట్యా  తక్షణమే అవి వినియోగంలోకి వచ్చేలా చేయాలి. అవి కూడా క్యాష్‌లెస్ వైద్యసేవలు అందించే కార్డులుగా ఉండాలి
	⇒ సమైక్యాంధ్ర సందర్భంగా చేసిన 80 రోజుల సమ్మెకాలాన్ని స్పెషల్ క్యాజువల్‌లీవుగా ప్రకటించాలి.
	⇒ ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 20 శాతం హెచ్‌ఆర్‌సీ, నగర పంచాయతీల పరిధిలో 14.5 శాతం హెచ్‌ఆర్‌సీ ఇవ్వాలి
	⇒ కార్పొరేషన్‌కు సమీపంలో అంటే 8 కిలోమీటర్ల పరిధిలో కాకుండా 15 కిలోమీటర్ల పరిధిలో పనిచేసేవారికి కూడా 20 శాతం హెచ్‌ఆర్‌సీ ఇవ్వాలి.
	⇒ గ్రాట్యుటీ పెంపుదల రూ.8 నుంచి రూ.12 లక్షలకు కాకుండా రూ.8 నుంచి రూ.15 లక్షలుగా మార్చాలి
	⇒ అందువల్ల రాష్ట్ర విభజనతో లింకు పెట్టకుండా 2013 జూలై 1వ తేదీ నుంచి పీఆర్‌సీ అమలు చేయాలి.
	 
	ఉద్యోగి పేరు:
	 గౌరవరపు వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయుడు
	 కుటుంబ సభ్యులు: భార్య,భర్త, ఇద్దరు పిల్లలు
	 నెలసరి ఇంటి అద్దె: రూ. 4500
	 నిత్యావసరాలు: రూ.4 వేలు
	 పాలు (రోజుకు లీటరు): 1500
	 బియ్యం: రూ.2 వేలు
	 పిల్లల విద్యకు: రూ.10 వేలు
	 వైద్యం: రూ.2 వేలు
	 దుస్తులు: రూ.2 వేలు
	 గ్యాస్: రూ.400
	 కరెంటు బిల్లు: రూ. 450
	 ప్రయాణఖర్చులు: రూ. 1000
	 వినోదం: రూ.600
	 డిష్ బిల్లు: రూ.150
	 సెల్ ఫోన్ బిల్లు: రూ.500
	 కూరగాయలు: రూ.1500
	 ఇతర ఖర్చులు: రూ.3 వేలు
	 మొత్తం ఖర్చు: రూ.33,600
	 
	 ఉద్యోగి పేరు:
	 కె.శరత్‌బాబు-మెడికల్ డిపార్టుమెంట్,
	 సీనియర్ అసిస్టెంట్
	 కుటుంబ సభ్యులు: భార్య, భర్త, ఇద్దరు చిన్నపిల్లలు
	 నెలసరి ఇంటి అద్దె: రూ.5 వేల
	 నిత్యావసరాలు: రూ.3 వేలు
	 పాలు: రూ.1500
	 బియ్యం: రూ.1500
	 పిల్లల విద్యకు: రూ.3 వేలు
	 వైద్యం: రూ.2 వేలు
	 దుస్తులు: రూ.2 వేలు
	 గ్యాస్: రూ.500
	 కరెంటు బిల్లు: రూ.1000
	 ప్రయాణఖర్చులు: రూ.1000
	 ద్విచక్రవాహనం: రూ.1500
	 వినోదం:     -
	 డిష్ బిల్లు: రూ.200
	 సెల్ ఫోన్ బిల్లు: రూ.1000
	 కూరగాయలు: రూ.1000
	 
	 ఉద్యోగి పేరు:
	 కోయ కోటేశ్వరరావు, ఆఫీస్ సబార్డినేట్
	 కుటుంబ సభ్యులు: భార్య, భర్త, కుమార్తె
	 నెలసరి ఇంటి అద్దె: రూ.3500
	 నిత్యావసరాలు: రూ.4500
	 పాలు: రూ.1000
	 బియ్యం: రూ.1000
	 పిల్లల విద్యకు(కోచింగ్): రూ.1000
	 వైద్యం: రూ.3 వేలు
	 దుస్తులు: రూ.1000
	 గ్యాస్: రూ.300
	 కరెంటు బిల్లు: రూ. 600
	 ప్రయాణ ఖర్చులు: రూ.2 వేలు
	 వినోదం: రూ.500
	 డిష్ బిల్లు: రూ. 150
	 సెల్ ఫోన్ బిల్లు: రూ. 600
	 కూరగాయలు: రూ.600
	 ఇతర ఖర్చులు: రూ.3500
	 మొత్తం ఖర్చు: రూ.23,250
	 
	69 శాతం ఫిట్‌మెంట్‌కు కట్టుబడి ఉన్నాం:
	10వ పీఆర్‌సీలో 69 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని  మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి మేము కట్టుబడి ఉన్నాం. తాత్కాలిక భృతిగా 26 శాతం ఐఆర్ ఇస్తున్నారు. తెలంగాణ లో ఫిట్‌మెంట్‌ను 43 శాతంగా ప్రకటించినందువల్ల తప్పనిసరిగా అంతకంటే అదనంగా ప్రకటించాలని సీఎంను కోరుతున్నాం. అప్పుడే చంద్రబాబు మారినట్లు ఉద్యోగులు భావిస్తారు. అలా కాని పక్షంలో రాజీలేని పోరాటం చేసేందుకు ఏపీఎన్‌జీవో ప్రకాశం జిల్లా యూనిట్ సిద్ధంగా ఉంది.
	- ఏపీఎన్‌జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు
	 
	మా పదవీ విరమణ వయస్సును పెంచాలి:
	పీఆర్‌సీ జాప్యం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ ఇవ్వాలి. దాంతోపాటు నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం కోరుతున్నట్లుగా పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు మార్పు చేయాలి. లెక్చరర్లకు మార్పులు చేస్తూ జీవో జారీచేసిన ప్రభుత్వం మా పట్ల కనికరించకపోవడం బాధిస్తోంది. తక్షణమే ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి.
	 - కోయ కోటేశ్వరరావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
