
'రాజకీయ వ్యభిచారులు దేశాన్ని ముక్కలు చేశారు'
రాష్ట్ర విభజనలో తమకు న్యాయం చేయని నాయకులపై ప్రజలు తిరగబడి, ధర్మాగ్రహాన్ని ప్రదర్శించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ పిలుపునిచ్చారు.
హైదరాబాద్: రాష్ట్ర విభజనలో తమకు న్యాయం చేయని నాయకులపై ప్రజలు తిరగబడి, ధర్మాగ్రహాన్ని ప్రదర్శించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ పిలుపునిచ్చారు. విభజన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఈమేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. విభజన పాపం అన్ని పార్టీలదీ అంటూ పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిని తప్పుపట్టారు.
స్వార్థ రాజకీయనేతలకు ఓటర్లు బుద్ధి చెప్పే రోజు త్వరలో రానుందని పేర్కొన్నారు. దేశ సమగ్రతకు వల్లభాయ్ పటేల్, తెలుగు జాతి సమైక్యతకు ఎన్టీఆర్‌లు నిదర్శనమని, ప్రస్తుత రాజకీయ వ్యభిచారులు స్వార్థంతో దేశాన్ని కుక్కలు చించిన విస్తరి చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర ఎంపీలు రాష్ట్ర భవిష్యత్‌ను సోనియా గాంధీ కాళ్ల ముందు బేరానికి పెట్టారని విమర్శించారు.